3,138 కిలోల గంజాయి పట్టివేత

ABN , First Publish Date - 2022-05-29T06:13:40+05:30 IST

అర్ధరాత్రి దాటాక రెండు వాహనాల్లో అతి భారీగా తరలిస్తున్న గంజాయిని అనకాపల్లి జిల్లా చీడికాడ పోలీసులు అత్యంత చాకచక్యంగా పట్టుకున్నారు.

3,138 కిలోల గంజాయి పట్టివేత
రెండు ఘటనల్లో పట్టుబడిన గంజాయి మూటలు

- రెండు వ్యాన్లలో తరలిస్తుండగా   వలపన్నిన చీడికాడ పోలీసులు 

- 11 మందిని అదుపులోకి తీసుకుని విచారణ

- పరారీలో ఉన్న నలుగురి కోసం గాలింపు


చీడికాడ, మే 28 : అర్ధరాత్రి దాటాక రెండు వాహనాల్లో అతి భారీగా తరలిస్తున్న గంజాయిని అనకాపల్లి జిల్లా చీడికాడ పోలీసులు అత్యంత చాకచక్యంగా పట్టుకున్నారు. 3,138కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, పదకొండు మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలివి. 

చీడికాడ మండలం మంచాల గ్రామంలో పాటూరి పెంటారావు (39) అనే వ్యక్తి శుక్రవారం రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న ఎస్‌ఐ సుధాకర్‌ సిబ్బంది గ్రామానికి చేరుకొని అర్ధరాత్రి 12 గంటల వరకూ విచారించారు. ఆ సమయంలో ఆరుగురు వ్యక్తులు  మంచాల గ్రామం వైపు వస్తుండడాన్ని వారు గుర్తించారు. అనుమానం వచ్చి విచారించగా, అందులో కొందరు వారి వెనుక వస్తున్న గంజాయి వాహనాన్ని వెనక్కి వెళ్లిపోవాలని ఫోన్‌ ద్వారా సమాచారం అందించారు. ఇది గమనించిన పోలీసులు వెంటనే వెంబడించి సదరు వాహనాన్ని  కోనాం సమీపంలో పట్టుకున్నారు. అనంతరం నిందితులు, గంజాయి వాహనాన్ని  చీడికాడ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఇదిలావుంటే,  వేకువజాము మూడు గంటల ప్రాంతంలో మరో ముగ్గురు మంచాల గ్రామం మీదుగా గంజాయిని ఓ వ్యాన్‌లో తరలిస్తుండగా పోలీసులను చూశారు. వెంటనే ఆ వాహనాన్ని వెనక్కి మళ్లించే క్రమంలో సదరు వాహనం అక్కడి మానిక గెడ్డలోకి ఒరిగిపోయింది. దీంతో డ్రైవర్‌, క్లీనర్‌తో పాటు మరో ముగ్గుర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శనివారం ఉదయం గెడ్డలో ఒరిగిపోయిని వాహనాన్ని ఎక్స్‌కవేటర్‌ సహాయంతో బయటకు తీసి, పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న అనకాపల్లి డీఎస్పీ బి.సునీల్‌కుమార్‌, చోడవరం సీఐ ఇలియాస్‌ అహ్మద్‌, చీడికాడ, మాడుగుల ఎస్‌ఐలు నిందితులను విచారిస్తున్నారు. ఈ రెండు వాహనాల్లో ఉన్న గంజాయిని తూకం వేయగా 3,138 కిలోలుగా ఉందని డీఎస్పీ సునీల్‌కుమార్‌ తెలిపారు. ఈ రెండు ఘటనలకు సంబంధించి 11 మంది తమ అదుపులో ఉండగా,  మరో నలుగురు నిందితులు పరారీలో ఉన్నట్టు చెప్పారు. వీరికోసం గాలిస్తున్నామన్నారు. ఈ ఘటనలపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.   

Updated Date - 2022-05-29T06:13:40+05:30 IST