317 తాత్కాలిక టపాకాయల దుకాణాలు

ABN , First Publish Date - 2021-11-03T06:11:09+05:30 IST

దీపావళి పండుగ సందర్భంగా జిల్లాలో 317 తాత్కాలిక టపాకాయల దుకాణాల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతిచ్చింది.

317 తాత్కాలిక టపాకాయల దుకాణాలు
చిత్తూరు వ్యవసాయ మార్కెట్‌లో ఏర్పాటు చేసిన టపాకాయల దుకాణాలు

నిబంధనలు పాటించని దుకాణదారులు

ఎన్‌వోసీ తీసుకోని పర్మినెంట్‌ దుకాణదారులు


చిత్తూరు సిటీ, నవంబరు 2: దీపావళి పండుగ సందర్భంగా జిల్లాలో 317 తాత్కాలిక టపాకాయల దుకాణాల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. కరోనా కారణంగా గత ఏడాది ప్రజలు పండుగను పెద్దగా జరుపుకోలేదు. ప్రస్తుతం కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేసుకోవడం, ముందు జాగ్రత్తలు పాటిస్తుండటంతో సంబరాలు జరుపుకోవడానికి సిద్ధ పడుతున్నారు. దీపావళి అంటేనే టపాకాయలు కావడంతో  వీటి దుకాణాలకు డిమాండ్‌ పెరిగింది. ఈ నేపథ్యంలో చిత్తూరులో 54, కుప్పంలో 38, మదనపల్లెలో 30, మొలకలచెరువులో 17, నగరిలో 7, పాకాలలో 17, పలమనేరులో 22, పీలేరులో 37, పుంగనూరులో 23, పుత్తూరులో 19, సత్యవేడులో 9, శ్రీకాళహస్తిలో 3, తిరుపతిలో 18, వాల్మీకిపురంలో 12 దుకాణాలు ఏర్పాటుచేశారు. అత్యధికంగా చిత్తూరులో దుకాణాలు ఏర్పాటయ్యాయి. ఇవికాక శాశ్వత లైసెన్స్‌ కల్గినవి జిల్లాలో 26 ఉన్నాయి. వీటిల్లో.. సత్యవేడులో 2, పలమనేరులో 2, పుత్తూరులో 7, నగరిలో 2, తిరుపతిలో 6, కుప్పంలో 3, చిత్తూరులో1, శ్రీకాళహస్తి 3 టపాకాయల దుకాణాలున్నాయి. ఇదిలా ఉంటే.. శాశ్వత, తాత్కాలిక  టపాకాయల దుకాణదారుల్లో చాలామంది అగ్నిమాపక శాఖ నిబంధనలు పాటించడం లేదన్న విమర్శలున్నాయి. దుకాణానికి దుకాణానికి మద్య దూరం నుంచి ఫైర్‌ సేఫ్టీ పరికరాలూ ఏర్పాటులోనూ తగిన జాగ్రత్తలు తీసుకోలేదు. ఇక శాశ్వత లైసెన్సు కలిగిన టపాకాయల దుకాణదారులు ప్రతి ఏడాదీ లైసెన్స్‌ రెన్యువల్‌ చేసుకోవాలి. అలాగే తప్పనిసరిగా అగ్నిమాపకశాఖ వద్ద ఎన్‌వోసీ తీసుకోవాలి. ఈసారి చాలామంది ఎన్‌వోసీ తీసుకోలేదని అగ్నిమాపక అధికారులు నోటీసులు ఇచ్చినా స్పందించలేదని సమాచారం. ఇప్పటికైనా ఈ విషయంపై ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకోవాలని జనం కోరుతున్నారు.  

Updated Date - 2021-11-03T06:11:09+05:30 IST