రెండున్నరేళ్లలో రూ.3.5లక్షల కోట్ల అప్పు

ABN , First Publish Date - 2022-01-21T06:57:37+05:30 IST

‘సీఎం జగన్‌ బాధ్యతలు చేపట్టిన రెండున్నరేళ్లలో దాదాపు రూ.3.5లక్షల కోట్ల అప్పు చేశారు.

రెండున్నరేళ్లలో రూ.3.5లక్షల కోట్ల అప్పు
మీడియాతో మాట్లాడుతున్న భానుప్రకా్‌షరెడ్డి

రాష్ట్రంలోని ప్రతి వ్యక్తిపైనా రూ.1.35లక్షల రుణభారం


తిరుపతి(కొర్లగుంట), జనవరి 20: ‘సీఎం జగన్‌ బాధ్యతలు చేపట్టిన రెండున్నరేళ్లలో దాదాపు రూ.3.5లక్షల కోట్ల అప్పు చేశారు. రాష్ట్రంలోని ప్రతి వ్యక్తిపైనా రూ.1.35 లక్షల రుణభారం ఉంది’ అని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భానుప్రకా్‌షరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం ఆయన తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం రాష్ట్ర రుణ మొత్తం రూ.6.5లక్షల కోట్లకు పెరిగిందన్నారు. దమ్ము, ధైర్యముంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం ఓ శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఆంధ్రప్రదేశ్‌ కాస్తా అంధకార ప్రదేశ్‌గా మారబోతోందని వాపోయారు. ఆయన మాటల్లోనే.. ‘విధ్వంసంతోనే జగన్‌ పాలన మొదలైంది. సంక్షేమాల పేరుతో రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందుతున్నా.. వైసీపీ ప్రభుత్వం ఈ నిధులను దారి మళ్లించి.. రాష్ట్రాన్ని అధ్వానస్థితికి తీసుకెళ్లింది. సీఎం పేరును నిత్యం స్మరించే ఆ నలుగురు మాత్రమే ఆనందంగా ఉన్నారు. ఉపాధ్యాయులు, ఉద్యోగులు రోడ్డెక్కి నిరసనలు చేస్తుండడం బాధాకరం. రాష్ట్రంలో ఐపీసీ బదులుగా వైసీపీ సెక్షన్లు అమలవుతున్నాయి. అధికార పక్షాన కాకుండా ప్రజలకోసం డీజీపీ పనిచేయాలి. కేసినో పేరుతో గోవా సంప్రదాయాన్ని ప్రవేశపెట్టారు. దీనికి కర్త, కర్మ, క్రియ ఎవరో బయటపెట్టాలి. ఈ ప్రభుత్వంలో భూ, ఇసుక, లిక్కర్‌ మాఫియాలతోపాటు కొత్తగా కేసినో వచ్చి చేరింది. వీటన్నింటిపై ఎదురు తిరిగిన, ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు బనాయించి, ఇబ్బంది పెడుతున్నారు’ అంటూ భానుప్రకా్‌షరెడ్డి మండిపడ్డారు. 

Updated Date - 2022-01-21T06:57:37+05:30 IST