నిద్రలేస్తూనే భార్యకు భారీ షాకిచ్చిన భర్త! ఒక్కసారిగా జీవితం తల్లకిందులు

ABN , First Publish Date - 2021-07-29T02:25:22+05:30 IST

ఆ రోజు ఎప్పటిలాగే మొదలైంది. భర్త మరికాసేపట్లో లేస్తాడనుకుంటోంది అతడి భార్య. అతడు కూడా ఎప్పటిలానే నిద్ర లేచాడు. ఎదురుగా నిలబడ్డ భార్యకు మాత్రం ఊహించని షాకిచ్చాడు.

నిద్రలేస్తూనే భార్యకు భారీ షాకిచ్చిన భర్త! ఒక్కసారిగా జీవితం తల్లకిందులు

ఇంటర్నెట్ డెస్క్: ఆ రోజు ఎప్పటిలాగే మొదలైంది. భర్త మరికాసేపట్లో లేస్తాడనుకుంటోంది అతడి భార్య. అతడు కూడా ఎప్పటిలానే నిద్ర లేచాడు. ఎదురుగా నిలబడ్డ భార్యకు మాత్రం ఊహించని షాకిచ్చాడు. నేను ఇక్కడ ఎందుకున్నాను? నువ్వెవరూ..?అంటూ అతడు ప్రశ్నించేసరికి ఆమెకు తల తిరిగిపోయింది. ఇదొక్కటే కాదు.. చదువు, ఉద్యోగం, పెళ్లి, పిల్లలు ఇలా తన జీవితంలో జరిగిన ముఖ్యమైన ఘటనలన్నీ అతడు మర్చిపోయాడు. ప్రస్తుతం అతడి వయసు 37. ఓ కూతురు కూడా ఉంది. కానీ.. తన 21 ఏళ్ల చరిత్ర మొత్తం మెదడులోంచి ఒక్కసారిగా తుడిచిపెట్టుకుపోయింది.


ఇటువంటి విచిత్ర పరిస్థితి ఎదుర్కొన్న అతడి పేరు డేనియల్ పోర్టర్. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో గల గ్రాన్‌బరీ ప్రాంతంలో నివశిస్తుంటాడు. ఆయన భార్య పేరు రూత్. భర్త వేసిన ప్రశ్నకు షాకైపోయానని చెప్పింది రూత్. ఆ రోజు తనను తాను అద్దంలో చూసుకుని డేనియల్ కోపంతో ఊగిపోయాడట. ఇదేంటి ఇంత ముసలాడిలా మారిపోయా..ఇంత లావెక్కానేమిటి..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడట. తన తల్లిదండ్రుల మినహా మరే విషయం అతడికి గుర్తు లేదు. 


అదృష్టవశాత్తూ డేనియల్ కుటుంబం అతడి తల్లిదండ్రుల వద్దే నివశిస్తుండటంతో..రూత్ అత్తమామల సహాయం తీసుకుంది. వారు ఎదురుపడ్డాకే డేనియల్ కొద్దిగా స్థిమితపడ్డాడట. ట్రాన్సియంట్ గ్లోబల్ ఆమ్నీసియా అనే సమస్యతో డేనియల్ బాధపడుతున్నాడని వైద్యులు రూత్‌కు చెప్పారు. ఈ సమస్య తాత్కాలికమేనని భరోసా ఇచ్చారు. 24 గంటల్లో అతడికి అన్నీ జ్ఞప్తికి వస్తాయన్నారు. కానీ.. ఏడాది తరువాత కూడా పరిస్థితి అలాగే ఉంది. వారి జీవితంలోని 20 ఏళ్లు కాలం ఎవరో తుడిచేసినట్టు  ఒక్కసారిగా మాయమైపోయింది. 


పాత విషయాలను అతడికి గుర్తుకు తెచ్చేందుకు రూత్ ప్రస్తుతం శతవిధాలా ప్రయత్నిస్తోంది. గతంలో వారు నివశించిన ప్రదేశాలకు తీసుకెళుతూ, పాత స్నేహితులను పరిచయం చేస్తూ అతడిని పూర్వస్థితికి తెచ్చే ప్రయత్నం చేస్తోంది. ఈ ఘటనకు ఆరు నెలల ముందు..హియరింగ్ స్పెషలిస్ట్ అయిన డేనియల్ తన ఉద్యోగాన్ని కోల్పోయాడు. ఈ క్రమంలో కొంత ఒత్తిడికి లోనయ్యాడు. ఈ కారణంగానే అతడు తన గత జీవితాన్ని మర్చిపోయి ఉంటాడని వైద్యులు చెబుతున్నారు. తీవ్ర ఒత్తిడికి లోనైనప్పుడు మెదడు భిన్నరీతుల్లో స్పందిస్తుందని వారు తెలిపారు. 

Updated Date - 2021-07-29T02:25:22+05:30 IST