థర్డ్‌ వేవ్‌ వచ్చేసిందా!?

ABN , First Publish Date - 2021-09-06T06:20:25+05:30 IST

కరోనా వైరస్‌..

థర్డ్‌ వేవ్‌ వచ్చేసిందా!?

కరోనాలో కొత్త రకం వేరియంట్‌ ఏవై.12 గుర్తింపు

రాష్ట్రంలో 18 కేసులు... వాటిలో ఆరు విశాఖలోనే నమోదు

డెల్టా, డెల్టా ప్లస్‌ వేరియంట్‌లకన్నా వేగంగా వ్యాప్తి

మూడో దశకు సంకేతంగా భావిస్తున్న వైద్య నిపుణులు

మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక

లేకపోతే స్వల్ప వ్యవధిలోనే భారీగా కేసులు పెరిగే ప్రమాదం

సెకండ్‌ వేవ్‌లో పడిన ఇబ్బందులను గుర్తుచేసుకోవాలని హితవు

మాస్క్‌ ధారణ, భౌతిక దూరం కొనసాగించాలని సూచన


(ఆంధ్రజ్యోతి/విశాఖపట్నం): జిల్లాలో వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్‌ కొత్తరకం వేరియంట్‌ ఇప్పుడు ఆందోళనకు గురి చేస్తోంది. నిన్న మొన్నటి వరకు డెల్టా, డెల్టా ప్లస్‌ వేరియంట్‌లే ఆందోళనకర రీతిలో వ్యాప్తి చెందగా...  ఏవై.12 రకం వేరియంట్‌ వాటికంటే వేగంగా వ్యాప్తి చెందే అవకాశముందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో డెల్టా ప్లస్‌లోని ఏవై.12 అనే రకానికి చెందిన కేసులు జిల్లాలో నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఏవై.12 రకం కేసులు దేశ వ్యాప్తంగా వారం రోజుల్లో 178 నమోదు కాగా, ఏపీలో 18 మంది ఈ రకం వైరస్‌ బారిన పడినట్టు నిర్ధారించారు. వీటిలో ఆరు కేసులు విశాఖలోనే నమోదు కావడం గమనార్హం. 


జిల్లాలో కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌ కొద్దిరోజుల నుంచి తగ్గుముఖం పడుతున్నట్టు అనిపిస్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో కేసుల తగ్గలేదు. రోజూ సుమారు వంద వరకు కేసులు నమోదవుతున్నాయి. కాగా సెకండ్‌ వేవ్‌లో కేసుల నమోదు ‘జీరో’కి రాకముందే మూడో వేవ్‌ విజృంభించడానికి అవకాశం వుందని, ఇందుకు కొత్త మ్యూటెంట్‌లు కారణం కావచ్చని వైద్య నిపుణులు అంచనా వేస్తూవచ్చారు. జిల్లాలో కొత్తరకం మ్యూటెంట్‌ వెలుగు చూడడం వీరి అనుమానాన్ని బలపరుస్తు న్నదనడానికి సంకేతంగా భావించవచ్చని పేర్కొంటున్నారు. తాజాగా వెలుగు చూసిన వేరియంట్‌కు వేగంగా వ్యాప్తి చెందే గుణముందని నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, లేకపోతే స్వల్ప వ్యవధిలోనే భారీగా పాజిటివ్‌ కేసులు పెరిగే ప్రమాదం వుందని సూచిస్తున్నారు.  


థర్డ్‌ వేవ్‌కు కారణమవుతుందా..?

నిపుణుల కమిటీ కరోనా థర్డ్‌ వేవ్‌ను అంచనా వేస్తూ కొద్దిరోజుల కిందట కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. దేశంలో సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో భారీ సంఖ్యలో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కావచ్చని పేర్కొంది. అయితే సెకండ్‌ వేవ్‌ వైరస్‌ వ్యాప్తికి కారణమైనట్టుగా కొత్త వేరియంట్లు వెలుగులోకి వస్తే తప్ప పరిస్థితి తీవ్రంగా ఉండకపోవచ్చని చెప్పింది. నిపుణుల కమిటీ నివేదికను సమర్పించి 15 రోజులు కాకముందే దేశంలో కొత్తరకం వేరియంట్‌ వ్యాప్తి చెందుతున్నట్టు కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. డెల్టా ప్లస్‌లోని ఏవై.12 రకంగా దీన్ని నిపుణులు గుర్తించారు. అత్యంత వేగంగా వ్యాప్తిచెందే గుణాన్ని కలిగి ఉన్నందున ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.  


నేడు జిల్లాకు వివరాలు

జిల్లా నుంచి ప్రతివారం 15 చొప్పున ర్యాండమ్‌ నమూనాలను హైదరాబాద్‌లోని సీసీఎంబీకి అధికారులు పంపిస్తుంటారు. వీటిని పరీక్షించి, కొత్త వేరియంట్లు ఏమైనా ఉన్నాయా? లేవా? అన్నది గుర్తించి, ఫలితాలను వెల్లడిస్తున్నారు. రెండు వారాల కిందట పంపించిన నమూనాల్లో కొత్తరకం వేరియంట్‌ని గుర్తించినట్టు తెలిసింది. అయితే జిల్లా అధికారులకు ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో సమాచారం రాలేదు. కొత్తరకం వేరియంట్‌ బారినపడిన వ్యక్తులు ఏ ప్రాంతానికి చెందిన వారు? బయటివారైతే ఎక్కడి నుంచి వచ్చారు? అన్న వివరాలు సోమవారంనాటికి జిల్లా అధికారులకు చేరనున్నట్టు తెలిసింది. అనంతరం ఆయా వ్యక్తుల కుటుంబ సభ్యులకు, సన్నిహితంగా మెలిగిన వారికి కొవిడ్‌ పరీక్షలు నిర్వహిస్తారని సమాచారం. 


అప్రమత్తంగా ఉండాల్సిందే

కరోనా వైరస్‌ కొత్తరకం వేరియంట్‌ ‘ఏవై.12’ కేసులు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో ప్రజలు అప్ర మత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా కొత్త వేరియంట్‌ ఆందోళకర రీతిలో వ్యాప్తి చెందడానికి అవకాశాలు వున్నాయని, దీని వ్యాప్తి థర్డ్‌ వేవ్‌కు సంకేతంగానే భావించాల్సి ఉంటుందని పేర్కొంటున్నారు. కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌ సమయంలో ఎదుర్కొన్న ఇబ్బందులను ఒకసారి గుర్తుచేసుకోవాలని హెచ్చరిస్తున్నారు. మాస్క్‌ ధరించడం, భౌతిక దూరం పాటించడం యథావిధిగా కొనసాగించాలని సూచిస్తున్నారు. 


కేసులు వేగంగా పెరిగితే థర్డ్‌ వేవ్‌ వచ్చేసినట్టే!

కరోనా వైరస్‌ సెకండ్‌ విజృంభణకు డెల్టా వేరియంట్‌ కారణమైంది. కొద్దిరోజుల కిందట నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికను పరిశీలించిన కేంద్ర ప్రభుత్వం.. కొత్త వేరియంట్లు వస్తే తప్ప థర్‌ వేవ్‌ అంతా ప్రభావం చూపదని చెప్పింది. అయితే ప్రస్తుతం దేశంలో వెలుగు చూస్తున్న డెల్టా ప్లస్‌, డెల్టా ప్లస్‌లోని ఏవై.12 రకం వ్యాప్తితో కొంత ఇబ్బందే. ఇది వేగంగా వ్యాప్తి చెందుతున్నట్టు చెబుతున్నారు. ఇదే నిజమైతే కేసులు శరవేగంగా పెరిగే ప్రమాదం వుంది. ప్రజలు మరింత అప్రమత్తంగా వుండాలి. కేసుల పెరుగుదల  ప్రారంభమైతే థర్డ్‌ వేవ్‌కు సంకేతంగానే భావించాలి.      

- డాక్టర్‌ రాంబాబు, కొవిడ్‌-19 నోడల్‌ అధికారి

Updated Date - 2021-09-06T06:20:25+05:30 IST