పెను విషాదం : కళ్ల ముందే నలుగురు కొట్టుకుపోయారు.. ఇక మాకు దిక్కెవరు..!?

ABN , First Publish Date - 2021-11-20T13:16:10+05:30 IST

గురువారం రాత్రి టేకుమందకు చెందిన నలుగురు మహిళలు గల్లంతైన విషయం తెలిసిందే.

పెను విషాదం : కళ్ల ముందే నలుగురు కొట్టుకుపోయారు.. ఇక మాకు దిక్కెవరు..!?

  • విషాదంలో టేకుమంద
  • గల్లంతైన నలుగురు మహిళల్లో 
  • ఒకరి మృతదేహం లభ్యం

చిత్తూరు జిల్లా/బంగారుపాళ్యం : బంగారుపాళ్యం మండలంలోని కామాక్షమ్మ చెరువు కలుజు ప్రవాహంలో గురువారం రాత్రి టేకుమందకు చెందిన నలుగురు మహిళలు గల్లంతైన విషయం తెలిసిందే. వీరిలో జయంతమ్మ(45) మృతదేహం శుక్రవారం లభ్యమవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సంఘటనా స్థలం నుంచి సుమారు కిలోమీటరు పైగా దూరంలో పాలమాకులపల్లె చెరువు సమీపంలోని ముళ్లపొదల్లో మృతదేహం కనిపించింది. ఈమెతోపాటు గల్లంతైన కస్తూరి, ఉషారాణి, లక్ష్మీదేవి ఆచూకీ రాత్రి వరకు తెలియరాలేదు. వీరికోసం పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, వలంటీర్లు, గ్రామ యువకులు గాలిస్తున్నారు. సంఘటనా స్థలాన్ని కలెక్టర్‌ హరినారాయణన్‌ సందర్శించారు. 


ఆయనకు ప్రమాద సంఘటనను వైస్‌ ఎంపీపీ శిరీష్‌రెడ్డి వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. ప్రమాదంలో మృతిచెందిన ఒక్కో కుటుంబానికి ప్రభుత్వ సాయంగా రూ.5లక్షలు అందించనున్నట్లు ప్రకటించారు. జయంతమ్మ మృతదేహాన్ని పూతలపట్టు ఎమ్మెల్యే ఎం.ఎస్‌.బాబు సందర్శించి, నివాళులర్పించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని చెప్పారు. తహసీల్దార్‌ సుశీల, డీటీ శివకుమార్‌, ఎంపీడీవో విద్యారమ, గంగవరం రూరల్‌ సీఐ రామకృష్ణాచారి, ఎస్‌ఐ మల్లికార్జున్‌రెడ్డి, నాయకులు రామచంద్రారెడ్డి, దొరస్వామి, అమర్‌నాథ్‌, ప్రకాష్‌ గౌడ్‌, గ్రామస్తులు పాల్గొన్నారు.


కళ్లముందే కొట్టుకుపోయారు..!

గల్లంతైన వారిలో ముగ్గురు మా సమీప బంధువులు. మా నాన్నతో కలసి నేను, మరో ఐదుగురు మహిళలు ప్రవాహాన్ని దాటుతున్న క్రమంలో నీటి ఉధృతి ఒక్కసారిగా పెరిగింది. దీంతో పట్టు తప్పి కింద పడ్డాము. నా కళ్ల ముందే నలుగురూ ప్రవాహంలో కొట్టుకుపోయారు. మా నాన్న గట్టిగా పట్టుకుని, అతికష్టంపై బయటకు లాగడంతో త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాను. ఆ సంఘటన ఇంకా నా కళ్ల ముందే మెదలుతోంది. - శిరీష


ఇక మాకు దిక్కెవరు?

ప్రమాదంలో మా తల్లి ఉషారాణి గల్లంతైంది. ఇంతవరకు ఆచూకీ లభించలేదు. పదేళ్ల క్రితమే మా నాన్న మమ్మల్ని వదిలిపెట్టి వెళ్లిపోయాడు. అప్పట్నుంచీ అమ్మే ఎంతో కష్టపడి సాకుతున్నది. మేము బాగా చదువుకోవాలని ఎన్నో కలలు కనేది. మాకు ఎలాంటి కష్టం తెలియనివ్వకుండా జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చింది. ఇక మాకు దిక్కెవరు? మా అమ్మ క్షేమంగా తిరిగి రావాలని ఆ దేవుడ్ని వేడుకుంటున్నాము. - ఉషారాణి పిల్లలు మహేశ్వరి, జగదీష్‌.

Updated Date - 2021-11-20T13:16:10+05:30 IST