4 మోటార్లు పూర్తిగా ధ్వంసం!

ABN , First Publish Date - 2022-08-12T09:13:55+05:30 IST

కాళేశ్వరం పంపుహౌ్‌సల నీట మునక, నష్టంపై సర్కారు నోరు మెదపడం లేదు. గత నెలలో వచ్చిన భారీ వరదకు లక్ష్మీ పంపుహౌస్‌ నీట మునిగిన సంగతి తెలిసిందే.

4 మోటార్లు పూర్తిగా ధ్వంసం!

  • నష్టం రూ.800-1000 కోట్లు?..
  • 13, 14, 15, 17 నంబర్ల మోటార్లు పనికిరావు..
  • మరో మూడు పాక్షికంగా ధ్వసం
  • లక్ష్మీ పంపుహౌ్‌సలో కూలిన బేస్‌మెంట్‌ స్లాబ్‌..!
  • అధికారుల ప్రాథమిక అంచనా!


భూపాలపల్లి, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం పంపుహౌ్‌సల నీట మునక, నష్టంపై సర్కారు నోరు మెదపడం లేదు. గత నెలలో వచ్చిన భారీ వరదకు లక్ష్మీ పంపుహౌస్‌ నీట మునిగిన సంగతి తెలిసిందే. వరద తాకిడికి నాలుగు మోటార్లు పూర్తిగా పనికిరాకుండా పోయాయి. మరో మూడు మోటార్లు పాక్షికంగా దెబ్బతిన్నట్టు అధికారులు గుర్తించారు. వీటితో పాటు పంపుహౌ్‌సలోని ప్యానల్‌ బోర్డులు, ఎలక్ట్రికల్‌ వ్యవస్థ మొత్తం ధ్వంసమైనట్లు సమాచారం. లక్ష్మీ పంపుహౌస్‌ నీట మునకతో సుమారు రూ.1000 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందన్న ప్రాథమిక అంచనాతో అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్లు తెలిసింది. పంపుహౌ్‌సలో మొత్తం 17 మోటార్లు ఉండగా గత నెల 14న వచ్చిన వరదకు ఫోర్‌బే రక్షణ గోడ కూలిపోవడంతో అవన్నీ మునిగిపోయాయి. 21 నుంచి పంపుహౌ్‌సలో నీటిని ఎత్తిపోశారు. బురదను కూడా తొలగించడంతో పంపుహౌ్‌సలో మోటార్ల పరిస్థితిపై అధికారులు వారం రోజులుగా పోస్టుమార్టం నిర్వహించారు. ఇందులో 13, 14, 15, 17 నంబర్లు గల నాలుగు మోటార్లు పూర్తిగా ధ్వంసమైనట్లు గుర్తించారు. వాటికి మరమ్మతులు చేసినా పని చేసే పరిస్థితి లేదని నిర్ధారించారు. పంపుహౌ్‌సపైనున్న రెండు హైడ్రాలిక్‌ క్రేన్లు కూలి పడడంతోనే నాలుగు మోటార్లు ధ్వంసమైనట్లు పేర్కొంటున్నారు. అలాగే 11, 12, 16 నంబర్లు గల మోటార్లు పాక్షికంగా ధ్వసమైనట్లు సమాచారం.


 ఈ మోటార్లన్నీ ఆస్ట్రియా, స్వీడన్‌ దేశాల నుంచి కొనుగోలు చేసినవే. పాక్షికంగా ధ్వంసమైన మూడు మోటార్లు వినియోగంలోకి వస్తాయా.. లేదా? అని తేల్చేందుకు ఆ దేశాల నుంచి నిపుణులు రావాల్సి ఉంటుందని ఇంజనీర్లు పేర్కొంటున్నారు. 40 మెగావాట్ల సామర్థ్యం గల ఈ మోటార్లను ఒక్కోటి రూ.60 కోట్ల చొప్పున వెచ్చించి 2018-19లో కొనుగోలు చేశారు. పనికి రాకుండా పోయిన 4మోటార్లకు రూ.240కోట్ల వరకు ప్రభుత్వం ఖర్చు చేసింది. వీటి స్థానంలో కొత్తగా నాలుగు మోటార్లను కొనుగోలు చేయాలని అధికారులు పేర్కొంటున్నారు. పాక్షికంగా దెబ్బతిన్న మూడు మోటార్లకు మరమ్మతులు చేస్తే వినియోగంలోకి వస్తాయని అంచనా వేస్తున్నారు. వీటికి కావాల్సిన విడి భాగాల కోసం ఆస్ట్రియాలోని సంబంధిత కంపెనీ ఇంజనీర్లతో ఆన్‌లైన్‌లో చర్చించినట్లు సమాచారం. పంపుహౌ్‌సలోని ప్యానల్‌ బోర్డులు, ఎలక్ట్రికల్‌ సిస్టం, సంపులో ఏర్పాటు చేసిన ఏడు మోటార్ల పంపులు, పైపులు పూర్తిగా విరిగినట్లు తెలిసింది. ఫోర్‌బే రక్షణ గోడ, గేట్ల నిర్మాణంతో పాటు పెరిగిన ధరలకు అనుగుణంగా సుమారు రూ.800-1000 కోట్ల పైగా నష్టం వాటిల్లినట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రాథమికంగా ఇంజనీర్లు నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది. 


బయట పడుతున్న నిర్మాణ లోపాలు

పంపుహౌ్‌సలో నీటిని మొత్తం ఎత్తిపోయడంతో మోటార్ల పరిస్థితి బయటపడింది. నాణ్యతా లోపం వల్లే ఫోర్‌బే రక్షణ గోడ కూలిందనే విషయం తొలుత వెలుగులోకి వచ్చింది. అయితే పంపుహౌ్‌సలో నీటిని తోడేసిన తర్వాత మోటార్లు ఏర్పాటు చేసిన హౌస్‌లో బేస్‌మెంట్‌ స్లాబ్‌ కూడా కూలిపోయింది. మోటార్ల కింది భాగంలో పంపులు, పైపులను ఏర్పాటు చేస్తారు. స్లాబ్‌ కూలడంతో అవి కూడా దెబ్బతిన్నట్లు అధికారులు గుర్తించారు. గోదావరి నుంచి కేవలం 450మీటర్ల దూరంలోనే 48 మీటర్ల లోతులో పంపుహౌస్‌ నిర్మాణం చేశారు. గోదావరికి వరద తాకిడి పెరిగినప్పుడు గ్రౌండ్‌ వాటర్‌ పంపుహౌస్‌ కింది భాగం వరకు వచ్చినట్టు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఫలితంగా నాణ్యత లేని బేస్‌మెంట్‌ కూలిపోయిందని అంచనా వేస్తున్నారు. పంపుహౌస్‌ డిజైన్‌ లోపంతోనే భారీ నష్టం వాటిల్లినట్టు ప్రచారం జరుగుతోంది. 


ఇప్పట్లో ఎత్తిపోతలు కష్టమే..

కాళేశ్వరం పంపుహౌస్‌ నీట మునిగి 28 రోజులు గడుస్తోంది. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి కాళేశ్వరం పరిస్థితిపై అధికారికంగా ప్రకటన విడుదల చేయలేదు. నీటిపారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శి రజత్‌కుమార్‌ రూ.25 కోట్ల కంటే ఎక్కువ నష్టం వాటిల్లిందని ప్రకటించినా.. అది రూ.వందల కోట్లలోనే ఉంటుందన్న అంచనాలున్నాయి. కాగా, కాళేశ్వరం ఇంజనీర్లతో ప్రభుత్వం ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్నట్లు సమాచారం. స్వయంగా సీఎం కేసీఆర్‌, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ పంపుహౌస్‌ పరిస్థితిపై సమీక్షిస్తున్నట్లు తెలుస్తోంది. పంపుహౌ్‌సలోని 11 మోటార్లు సురక్షితంగా ఉన్నాయని, ఫోర్‌బే రక్షణ గోడతో పాటు మోటార్ల పంపులున్న బేస్‌మెంట్‌ నిర్మాణం పూర్తి చేస్తే మళ్లీ నీటిని ఎత్తిపోసే అవకాశం ఉందని అధికారులు నివేదిక ఇచ్చినట్లు సమాచారం. అయితే ఇప్పటికిప్పుడు పనులు చేపట్టలేమని, అక్టోబరు వరకు వర్షాలు ఉండడంతో పాటు విదేశాల నుంచి నిపుణులను రప్పించేందుకు సమయం పడుతుందని అధికారులు పేర్కొంటున్నారు. 

Updated Date - 2022-08-12T09:13:55+05:30 IST