కేరళలో సీపీఎం కార్యకర్త హత్య.. నలుగురు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు అరెస్ట్

ABN , First Publish Date - 2022-02-23T01:11:10+05:30 IST

హత్య జరిగిన కొన్ని గంటలకే ఒక బీజేపీ నేత చేసిన వ్యాఖ్యలు సీపీఎం కార్యకర్తల ఆరోపణలకు బలం చేకూర్చే విధంగా ఉన్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక వీడియోలో కన్నూరుకి చెందిన కె.లిజేష్ అనే బీజేపీ నేత మాట్లాడుతూ..

కేరళలో సీపీఎం కార్యకర్త హత్య.. నలుగురు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు అరెస్ట్

తిరువనంతపురం: కేరళలోని కన్నూర్‌లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్ట్)కి చెందిన ఒక కార్యకర్తను సోమవారం కొందరు కిరాతకంగా కొట్టి చంపారు. అయితే ఈ కేసులో బీజేపీ-ఆర్ఎస్ఎస్‌కు చెందిన నలుగురు కార్యకర్తలను మంగళవారం అరెస్ట్ చేశారు. కన్నూరు జిల్లాలోని తలస్సెరికి చెందిన కొరంబిల్ హరిదాస్(54) అనే వ్యక్తి సోమవారం చేపలు పట్టి తిరిగి వస్తుండగా ఇంటి చాటున వేచి ఉన్న దుండగులు దాడికి పాల్పడ్డారు. పదునైన ఆయుధాలతో హరిదాస్‌ను చాలాసార్లు నరికి చంపినట్లు పోలీసులు తెలిపారు. చుట్టుపక్కల నివసించే బంధువులు అతన్ని తలస్సేరిలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయినప్పటికీ అతడిని కాపాడుకోలేకపోయామని వాపోయారు.


ఈ హత్య జరిగిన కొద్ది సేపటికే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌పై సీపీఎం దాడికి దిగింది. హరిదాస్‌ను హత్య చేసింది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలేనని సీపీఎం కార్యకర్తలు ఆరోపించారు. హత్య జరిగిన కొన్ని గంటలకే ఒక బీజేపీ నేత చేసిన వ్యాఖ్యలు సీపీఎం కార్యకర్తల ఆరోపణలకు బలం చేకూర్చే విధంగా ఉన్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక వీడియోలో కన్నూరుకి చెందిన కె.లిజేష్ అనే బీజేపీ నేత మాట్లాడుతూ తమ పార్టీ కార్యకర్తపై దాడికి పాల్పడ్డ సిపిఎం కార్యకర్తపై ఎలా పగ తీర్చుకునేదో వివరించారు. బీజేపీ-ఆర్ఎస్ఎస్ కార్యకర్తలపై సీపీఎం కార్యకర్తల దాడికి నిరసనగా చేపట్టిన ఒక నిరసనను ఉద్దేశిస్తూ ప్రసంగిస్తున్నప్పుడు తీసిన వీడియో అది. ఈ వీడియోను కూడా పరిగణలోకి తీసుకున్నామని చెప్పిన పోలీసులు.. కె.లిజేష్ సహా విమిన్, అమల్ మనోహరన్, సుమేష్ అనే నలుగురిని అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు.

Updated Date - 2022-02-23T01:11:10+05:30 IST