జిల్లాలో 4 సరోగసీ కేంద్రాలు

ABN , First Publish Date - 2022-09-25T06:13:19+05:30 IST

అమ్మతనం కల్పించేందుకు సరోగసీ (అద్దె గర్భాల) కేంద్రాలు జిల్లాలో అందుబాటులోకి రానున్నాయి. పునరుత్పత్తి హక్కులను పరిరక్షించేందుకు, సాంకేతిక సహాయ పునరుత్పత్తి కేంద్రాల ఏర్పాటుకు జిల్లాలో చట్ట ప్రకారం అమోదం లభించనుంది. ఈ మేరకు

జిల్లాలో 4 సరోగసీ కేంద్రాలు

సంతానం కోసం నిరీక్షించే వారికి వరం


చాలా కాలం కిందటే పెళ్లయి, పిల్లల కోసం నిరీక్షిస్తున్న వారికి ఇది శుభవార్త. జిల్లాలో నాలుగు సరోగసీ కేంద్రాలు ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. త్వరలో రాష్ట్ర, జిల్లా వైద ్యశాఖ అధికారులు పరిశీలనానంతరం అన్ని వసతులతో కూడిన సరోగసీ కేంద్రాలు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు సరోగసీ కమిటీ చైర్మన్‌ కలెక్ట్టర్‌ విజయరామరాజు, జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ నాగరాజు ఈ కేంద్రాల  ఏర్పాటుకు కసరత్తు ముమ్మరం చేస్తున్నారు. ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా చేశారు. 


కడప(కలెక్టరేట్‌) సెప్టెంబరు 24: అమ్మతనం కల్పించేందుకు సరోగసీ (అద్దె గర్భాల) కేంద్రాలు జిల్లాలో అందుబాటులోకి రానున్నాయి. పునరుత్పత్తి హక్కులను పరిరక్షించేందుకు, సాంకేతిక సహాయ పునరుత్పత్తి కేంద్రాల ఏర్పాటుకు జిల్లాలో చట్ట ప్రకారం అమోదం లభించనుంది. ఈ మేరకు ఈ ఏడాది జూలై 11న రాష్ట్ర ప్రభుత్వం గెజిట్‌ నోటిషికేషన్‌ జారీచేసింది. కృత్రిమ గర్భధారణ, కృత్రిమ అండాలు, వీర్య కణాలను భద్రపరిచేందుకు వీలుగా అన్ని సౌకర్యాలతో కూడిన నాలుగు ఏఆర్‌టీ (యాంటీ రిట్రోవైరల్‌ థెరఫీ) క్లినిక్‌లు, బ్యాంకుల ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే కడపలో 2, ప్రొద్దుటూరులో రెండు చొప్పున  సంతాన సాఫల్య కేంద్రాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. దీంతో కలెక్టర్‌కు, రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతుల కోసం ప్రైవేట్‌ ఆస్పత్రుల యాజమాన్యాలు దరఖాస్తు చేసుకున్నాయి. ఈ ఆస్పత్రులను జిల్లా వైద్యశాఖ అధికారులు పలుమార్లు తనిఖీ చేయనున్నారు. రాష్ట్ర వైద్య బృందం కూడా పరీక్షించిన మీదట అన్నిరకాల వసతులుంటే సరోగసీ కేంద్రాల ఏర్పాటుకు అనుమతులు ఇవ్వనున్నారు.


పిల్లలు పుట్టక పోవడానికి కారణాలు..

పిల్లలు పుట్టకపోవడానికి పలు కారణాలున్నాయి. మానసిక వత్తిడి, ఆహారపు అలవాట్లు, వివాహ వయసు, హార్మోన్లు, అసమతుల్యత, పునరుత్పత్తి అవయవాల్లో ఇన్ఫెక్షన్‌, లోపాలు, స్త్రీలలో అండాలు విడుదల కాకపోవడం, పురుషుల్లో వీర్యకణాలు తక్కువగా ఉండడం, సెక్స్‌ సమస్యలు తదితర కారణాలు గర్భం దాల్చడంపైన ప్రభావం చూపుతాయని వైద్య నిపుణులు అంటున్నారు. ఈ సమస్యలన్నింటినీ నివృత్తి చేసేలా ఏఆర్‌టీ కేంద్రాలు పనిచేయనున్నాయి. పిల్లలు కలగక మానసికంగా వత్తిడికి గురువుతున్న తల్లిదండ్రులు కలెక్టర్‌ అధ్యక్షతన పనిచేయనున్న సరోగసీ కమిటీని, జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖను సంప్రదించాల్సి ఉంటుంది.


జిల్లాలో నాలుగు ఏఆర్‌టీ కేంద్రాలు

- డాక్టర్‌ నాగరాజు, డీఎం అండ్‌ హెచ్‌వో

సంతానం లేక చాలామంది మహిళలు, దంపతులు ఇతర రాష్ట్రాలకు, ఇతర జిల్లాలకు వెళ్లి వైద్య పరీక్షలు చేసుకుంటున్నారు. అలాంటి వారందరికీ అమ్మతనం కల్పించే సరోగసీ (అద్దెగర్భాలు) కేంద్రాలు రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం మేరకు కడప, ప్రొద్దుటూరులో రెండు రెండు చొప్పున ఏర్పాటు కానున్నాయి. గుర్తించిన నాలుగు ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో అన్ని వైద్య సౌకర్యాలుంటే, రాష్ట్ర బృదం పరిశీలన మేరకు అనుమతులు లభించనున్నాయి.

Updated Date - 2022-09-25T06:13:19+05:30 IST