40 కోట్ల ‘రియల్‌’ మోసం

ABN , First Publish Date - 2022-01-25T07:27:59+05:30 IST

ఇదో భారీ రియల్‌ఎస్టేట్‌ మోసం..! రైతులతో ఒప్పందం చేసుకున్నాడు.. కొంత భూమిని

40 కోట్ల ‘రియల్‌’ మోసం

  • 300 మందికి కుచ్చుటోపీ..
  • రిజిస్ట్రేషన్‌ కాకుండానే రియల్టర్‌ పేరిట నాలా కన్వర్షన్‌
  •  44 ఎకరాల భూమిలో వెంచర్‌ అభివృద్ధి
  •  10 ఎకరాలకు రిజిస్ట్రేషన్‌ లేకుండానే ప్లాట్లు
  •  పదేళ్ల క్రితం వరకు జోరుగా విక్రయాలు
  •  ఇప్పుడు రైతు కంచె వేయడంతో..
  • లబోదిబోమంటున్న కొనుగోలుదారులు


గద్వాల, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): ఇదో భారీ రియల్‌ఎస్టేట్‌ మోసం..! రైతులతో ఒప్పందం చేసుకున్నాడు.. కొంత భూమిని రిజిస్ట్రేషన్‌ చేసుకోకుండానే.. మొత్తం భూమికి నాలా కన్వర్షన్‌ హక్కులు పొందాడు..! వెంచర్‌ వేశాడు..! ప్లాట్లు చేశాడు..! వాటిని అమ్మేశాడు..! ఇలా 300 మందికి ఓ రియల్టర్‌ రూ. 40 కోట్ల మేర కుచ్చుటోపీ వేశాడు. జోగులాంబ గద్వాల జిల్లా.. ఉండవల్లి మండలం పుల్లూరు రెవెన్యూ పరిధిలో 248/ఆ, 247, 248/అ, 249/అ, 276, 247/ఆ సర్వే నెంబర్లలో చల్లా వెంకట్రామిరెడ్డి, శ్రీరాంరెడ్డి, దామోదర్‌రెడ్డి, సదానందరెడ్డిలకు 44 ఎకరాల వ్యవసాయ భూమి ఉండేది.


2008 నుంచి 2013 మధ్యలో ఏపీలోని కృష్ణా జిల్లా బల్లిపర్రుకు చెందిన వాకా వాసుదేవరావు ఆ భూముల కొనుగోలుకు ఒప్పందం చేసుకున్నాడు. 248/ఆ, 247, 248/అ, 249అ గల సర్వే నెంబర్లలో సుమారు 34 ఎకరాలను రిజిస్టర్‌ చేయించుకున్నాడు. సర్వేనంబరు 276లో 5 ఎకరాలు, 247/ఆలో 5.12 ఎకరాలు మొత్తం 10.12 ఎకరాలను రిజిస్ట్రేషన్‌ చేయించకుండా.. మొత్తం భూమిని నాలా కన్వర్షన్‌ చేయించి, వెంచర్‌ వేశాడు. కర్నూల్‌ కేంద్రంగా రియల్‌ఎస్టేట్‌ కార్యాలయాన్ని ఓపెన్‌ చేసి, వాయిదాల పద్ధతి/నేరుగా విక్రయాలు జరిపాడు. కర్నూలుకు చెందినవారే ఎక్కువగా ఇక్కడ ప్లాట్లు కొనుగోలు చేశారు. . వాయిదా పద్ధతులు అయిపోగానే.. వాసుదేవరావు బోర్డు తిప్పేసి ఉండాయించాడు.


కొనుగోలుదారులంతా మంచి ధర వచ్చాక ఇల్లు కట్టుకోవడమో.. విక్రయించడమో చేయొచ్చనే ఉద్దేశంతో ఆ వైపు రాలేదు. ఇటీవల ఆ వెంచర్‌ పక్కనే 100 పడకల ఆస్పత్రి నిర్మాణం ప్రారంభమవ్వడంతో డిమాండ్‌ పెరిగింది. సెంటు భూమి ధర రూ. 8లక్షలనుంచి. 15 లక్షలకు పెరిగింది. దీంతో.. ప్లాటు వద్దకు వచ్చిన కొనుగోలుదారులు ఒక్కసారిగా షాక్‌ తినేలా అక్కడి పరిస్థితులు కనిపించాయి. వాసుదేవరావు రిజిస్ట్రేషన్‌ చేయించుకోని 10 ఎకరాల స్థలంలో ఉన్న ప్లాట్ల హద్దురాళ్లను చెదరగొట్టిన రైతులు ఆ స్థలం చుట్టూ కంచెకట్టి.. పంట వేశారు. దీంతో.. నిత్యం కొనుగోలుదారులు.. రైతులతో వాగ్వాదానికి దిగుతున్నారు. వెంచర్‌ వేసి, ప్లాట్లు అమ్మేప్పుడు ఎందుకు అభ్యంతరం చెప్పలేదని నిలదీస్తున్నారు.


ధరలు పెరగడంతో కంచెవేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. 10 ఎకరాల స్థలం తమదేనని, వాసుదేవరావుకు అమ్మలేదని రైతులు చెబుతున్నారు. దీంతో బాధితులు ఇటీవల హైదరాబాద్‌లో వాసుదేవరావును కలవగా.. డబ్బులిస్తానని మాయమాటలు చెప్పి.. ఖాళీ చెక్కులు ఇచ్చాడు. నెల తర్వాత పత్తాలేకుండా పోయాడు. వాసుదేవరావు స్థానిక రిజిస్ట్రేషన్‌, రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై తమను మోసం చేశాడని బాధితులు వాపోతున్నారు. పట్టా రిజిస్ట్రేషన్‌ కాకుండా.. నాలా కన్వర్షన్‌ను వాసుదేవరావు పేరిట ఎలా చేస్తారని ప్రభుత్వాధికారులను ప్రశ్నిస్తున్నారు. అప్పట్లోనే అధికారులు హెచ్చరించి ఉంటే.. తాము మోసపోయేవాళ్లం కాదని వాపోతున్నారు. 300 మంది బాధితులు రూ. 40 కోట్ల మేర మోసపోయినట్లు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.





కూలి పనులు చేసి కొనుక్కున్నా..

నాకు తోడెవరూ లేరు. నేను కర్నూల్‌ నగరంలోని ఏన్టీఆర్‌ నగర్‌లో కిరాయి ఇంట్లో ఉంటాను. పదేళ్ల క్రితం మా గేరిలో ఉండే వాళ్లు ప్లాట్లు కొంటుంటే.. కూలినాలీ చేసిన పైసలకు తోడు అప్పుచేసిన డబ్బులతో అలంపూర్‌ చౌరస్తా వీవీఆర్‌ వెంచర్‌లో 2.75 సెంట్ల స్థలం కొన్నాను. ఇంతకాలం కిరాయి ఇంట్లో ఉన్న నేను చిన్న గుడిసె వేసుకుందామని ఇక్కడకు వచ్చాను. చుట్టూ కంచె వేశారు. నా ప్లాటు ఎక్కడుందో తెలియదు. ఇదంతా అప్పుడు అమ్మలేదని వేరేవాళ్ల ఆధీనంలో ఉందని చెబుతున్నారు.

- తెలుగు గంగవ్వ, ఎన్టీఆర్‌ కాలనీ, కర్నూలు 




మేము కుడా వెూసపోయాం

మేం(పట్టాదారులం) అంతా ఒకే కుటుంబానికి చెందిన వాళ్లం. 2008లో వాకా వాసుదేవరావు అనే వ్యక్తికి అలంపూర్‌ చౌరస్తాలో ఉండే పలు సర్వేనెంబర్లలోని 44 ఎకరాల పొలాన్ని అమ్మేందుకు అగ్రిమెంటు చేసుకున్నాం. విడతలవారీగా చెల్లిస్తూ.. భూమి రిజిస్ట్రేషన్‌ చేయించుకుంటూ వచ్చి, 10.12 ఎకరాలు మాత్రం రిజిస్టర్‌ చేయించుకోలేదు. అయినా అందులో  ప్లాట్లు అమ్మేసి వెళ్లిపోయాడు. అప్పటికే రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న భూమికి సంబంధించి సుమారు రూ.70 లక్షలు బాకీ ఉండగా.. 10.12 ఎకరాలకు డబ్బులు చెల్లించలేదు. లీగల్‌గా రికార్డు పరంగా ఆ పొలం మాది కాబట్టి ఫెన్సింగ్‌ వేశాం.

- చల్లా వెంకట్రామిరెడ్డి, పట్టాదారు


Updated Date - 2022-01-25T07:27:59+05:30 IST