అడ్డాకూలీలను యజమానులుగా చిత్రీకరించి.. రూ. 40 కోట్ల స్థలం కబ్జా.. చివరికి..

ABN , First Publish Date - 2022-05-23T20:48:41+05:30 IST

ఖరీదైన ప్రాంతంలోని ఖాళీ స్థలంపై కబ్జాదారుల కన్ను పడింది

అడ్డాకూలీలను యజమానులుగా చిత్రీకరించి.. రూ. 40 కోట్ల స్థలం కబ్జా.. చివరికి..

  •  ముఠా అరెస్టు.. పరారీలో సూత్రధారులు


హైదరాబాద్ సిటీ/బంజారాహిల్స్‌ : ఖరీదైన ప్రాంతంలోని ఖాళీ స్థలంపై కబ్జాదారుల కన్ను పడింది. దాన్ని చేజిక్కించుకోవడానికి అడ్డా కూలీలను యజమానులుగా చిత్రీకరించారు. బోగస్‌ పత్రాలను సృష్టించారు. రిజిస్ట్రేషన్‌ కూడా చేయించేసుకున్నారు. అసలు యజమాని మేల్కొని బంజారాహిల్స్‌ పోలీసులను ఆశ్రయించడంతో కబ్జా ముఠా ఆట కట్టింది. పోలీసుల కథనం ప్రకారం.. పూర్ణచందర్‌రావు ఎన్‌ఆర్‌ఐ. అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ కన్సల్టెన్సీ నిర్వహిస్తున్నారు. నగరంలో సాఫ్ట్‌వేర్‌ కంపెనీ పెట్టేందుకు బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 13 సర్వే నెంబర్‌ 129/40/1లో 2,538 గజాల స్థలం కొనుగోలు చేశారు. యజమాని విదేశాల్లో ఉన్నట్టు తెలుసుకున్న రేవ ఇన్‌ఫ్రా ఎండీ బాలా ప్రవీణ్‌ కన్ను ఖాళీ స్థలంపై పడింది.


టి. ప్రతా‌ప్‌తో కలిసి నకిలీ ఆధార్‌ కార్డులను, మనుషులను సృష్టించాడు. అడ్డా కూలీలను తీసుకొచ్చి ఖదీర్‌ బేగం అనే మహిళ నుంచి ఆ స్థలాన్ని కొన్నట్లు నకిలీ పత్రాలు తయారుచేయించాడు. తర్వాత అడ్డా కూలీలతో తన పేరుపై రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నాడు. రూ. 40 కోట్ల విలువైన స్థలం కబ్జా వ్యవహారంలో మరికొందరు అతడికి సహకరించారు. విషయం తెలుసుకున్న స్థల యజమాని పూర్ణచందర్‌ బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశా రు. కబ్జా, నకిలీ పత్రాల సృష్టిలో సంబంధాలు ఉన్న ఎండీ మొయినుద్దీన్‌, పరాంకుశం, సురేందర్‌, దొంతు సుధాకర్‌, సింగిరెడ్డి వీర హనుమరెడ్డి, బూరుగు సత్యనారాయణ గౌడ్‌, హరికృష్ణా రెడ్డి, దీప్‌ దేఖ్‌ముఖ్‌ తదితరులను అరెస్ట్‌ చేశారు. సూత్రధారులు బాలాప్రవీణ్‌తో పాటు ఖదీర్‌బేగం, ప్రతాప్‌ తదితరులు పరారీలో ఉన్నారు. వారి కోసం ప్రత్యేక బృందాన్ని పోలీసులు రంగంలోకి దింపారు.

Updated Date - 2022-05-23T20:48:41+05:30 IST