
కొందరి ప్రవర్తన చూస్తే.. ఈ వయసులో వీడికి ఇదేం పోయే కాలం.. అని అనిపిస్తుంది. వయసు, వరసలు మరచి ప్రవర్తించే ప్రబుద్ధులు.. తరచూ ఎక్కడో చోట తారసపడుతూనే ఉంటారు. ఉత్తరప్రదేశ్‌లో ఇటీవల ఇలాంటి ప్రబుద్ధుడి ఉదంతం వెలుగులోకి వచ్చింది. 40ఏళ్ల వయసున్న అతను.. 14 బాలికపై కన్నేశాడు. బాలిక తండ్రికి రూ.30వేలు ఇచ్చి మరీ.. సభ్యసమాజం తల దించుకునే పని చేశాడు. వివరాల్లోకి వెళితే..
బీహార్ రాష్ట్రం కోసి, సీమాంచల్ తదితర ప్రాంతాల్లో పేదరికం.. ఆడపిల్లలకు శాపంగా మారింది. ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడంతో ఇక్కడి వారికి ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేయడం భారంగా మారింది. దీన్ని అవకాశం తీసుకున్న మధ్యవర్తులు.. డబ్బులు తీసుకుని ఇతర రాష్ట్రాలకు చెందిన వారితో పెళ్లి సంబంధాలు కుదుర్చుతుంటారు. ఈ విషయం తెలుసుకున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రం షామ్లీ పరిధికి చెందిన జ్వాలా సింగ్ (40) అనే వ్యక్తి.. జులేఖా ఖాతూన్ అనే మధ్యవర్తిని సంప్రందించాడు. అతడి సహకారంతో 14 ఏళ్ల బాలికను పెళ్లి చేసుకునేందుకు సిద్ధపడ్డాడు. ఇందుకోసం బాలిక తల్లిదండ్రులకు రూ.30,000 ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారు. పేదరికం కారణంగా బాలిక తల్లిదండ్రులు కూడా ఇందుకు ఒప్పుకొన్నారు.
ఎవరికీ తెలీకుండా రహస్యంగా పెళ్లి చేసేందుకు సిద్ధమయ్యారు. బాలికను తన మేనమామ ఇంటికి తీసుకెళ్లి, అక్కడ పెళ్లి ఏర్పాట్లు చేశారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు.. గ్రామ పెద్దకు విషయం తెలియజేశారు. అంతా కలిసి చైల్డ్ లైన్ అధికారులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న అధికారులు, పోలీసులు పెళ్లిని నిలిపేశారు. ఈ ఘటనలో మొత్తం ఆరుగురిపై కేసులు నమోదు చేశారు. బీహార్ రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు చెందిన బాలికలు, యువతులను.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ వయస్సుల వారికి ఇలాగే కట్టబెట్టినట్లు విచారణలో తెలిసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి