ఆర్టీసీ నుంచి 400 బస్సుల్లో జనం తరలింపు

ABN , First Publish Date - 2022-09-23T06:54:00+05:30 IST

కుప్పంలో జగన్‌ సభకు జనాన్ని తరలించడం కోసం సుమారు 1400కు పైగా బస్సులను అధికార యంత్రాంగం నిర్బంధంగా సమీకరించింది.

ఆర్టీసీ నుంచి 400 బస్సుల్లో జనం తరలింపు
కుప్పం సభకు వాహనాల సమీకరణలో బిజీగా అధికారయంత్రాంగం

ప్రైవేటు విద్యా సంస్థలు, ట్రావెల్స్‌, టౌన్‌ సర్వీసులూ కలిపి మరో వెయ్యి బస్సుల సమీకరణ

తిరుపతి, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): కుప్పంలో  జగన్‌ సభకు జనాన్ని తరలించడం కోసం సుమారు 1400కు పైగా బస్సులను అధికార యంత్రాంగం నిర్బంధంగా సమీకరించింది. తిరుపతి జిల్లాలో ప్రైవేటు స్కూళ్ళు, కాలేజీలకు అధికారికంగా 1400 బస్సులున్నాయి. వీటిలో సగం బస్సుల్ని  రవాణా శాఖ అధికారులు నిర్బంధంగా కుప్పం సభకు మళ్ళించారు. అలాగే ప్రైవేటు ట్రావెల్స్‌, టౌన్‌ సర్వీసులతో కలిపి మొత్తం వెయ్యి బస్సులను బహిరంగసభకు జన సమీకరణ కోసం కేటాయించారు. గురువారం మధ్యాహ్నం నుంచే ఆ శాఖకు చెందిన నలుగురు అధికారులు చంద్రగిరి పట్టణ శివార్లలోని ఫ్లై ఓవర్‌ సమీపానికి బస్సులను రప్పించారు. అక్కడ వున్న పెట్రోలు బంకుల్లో వాహనాలకు డీజిల్‌ పట్టించి వచ్చిన వాటిని వచ్చినట్టే ఉమ్మడి జిల్లాలోని నిర్దేశిత ప్రాంతాలకు పంపిస్తూ కనిపించారు. గురువారం సాయంత్రానికి కూడా వందల సంఖ్యలో బస్సులు నిలిచి వుండగా వాటిని వేర్వేరు రూట్లకు పంపిస్తూ అధికారులు బిజీగా కనిపించారు.ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో మొత్తం 1500 ఆర్టీసీ బస్సులుండగా అందులో 400 బస్సుల్ని సీఎం సభకు కేటాయించారు.నగరి, పుత్తూరు, చిత్తూరు, పలమనేరు, కుప్పం, పుంగనూరు, మదనపల్లె, పీలేరు, తిరుపతి ఆర్టీసీ డిపోల నుంచీ వీటిని కేటాయించారు. అద్దె ప్రాతిపదికన బస్సుల్ని కేటాయించామని అధికారులు చెబుతున్నప్పటికీ నమ్మలేని పరిస్థితి కనిపిస్తోంది. సీఎం సభ పుణ్యమా అని సుమారు లక్ష మందికి పైగా విద్యార్థులు, ప్రయాణీకులకు తీవ్ర అసౌకర్యం కలగనుంది. కేవలం తిరుపతి జిల్లా పరిధిలోని విద్యా సంస్థలకు చెందిన 500-600 బస్సులను జన సమీకరణకు వినియోగిస్తున్న నేపధ్యంలో వీటిని గురువారం మధ్యాహ్నం నుంచే అధికార యంత్రాంగానికి అప్పగించాల్సి వచ్చింది. ఒకో వాహనంలో 30 చొప్పున లెక్కించినా రోజుకు ఈ బస్సుల ద్వారా 15 వేల నుంచీ 18 వేల మంది విద్యార్థులను స్కూళ్ళకు, కాలేజీలకు తరలించాల్సివుంది. ఆ లెక్కన గురు, శుక్రవారాల్లో కనీసమంటే 30 వేల మంది విద్యార్థులకు తీవ్ర అసౌకర్యం కలగనుంది. స్కూలు, కాలేజీ బస్సులు అందుబాటులో వుండనందువల్ల వీరంతా విద్యా సంస్థలకు వెళ్ళడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాల్సి వస్తోంది.ఇప్పటికే పలు విద్యా సంస్థలు విద్యార్థులను ఇబ్బంది పెట్టడం ఎందుకన్న ఆలోచనతో శుక్రవారం సెలవు ప్రకటించేయగా మరికొన్ని సంస్థలు విద్యార్థులను పంపడానికి సొంత ఏర్పాట్లు చేసుకోవాలని తల్లిదండ్రులకు మెసేజీలు పంపించాయి. కాగా పలు విద్యా సంస్థలు తమ బస్సులను సీఎం బహిరంగసభ కోసం జిల్లా అధికార యంత్రాంగం స్వాధీనం చేసుకున్నాయంటూ తల్లిదండ్రులకు పంపిన మెసేజీల్లో పేర్కొనడం గమనార్హం. మరోవైపు ఆర్టీసీకి చెందిన 400 బస్సుల విషయానికొస్తే రోజుకు ఒకో బస్సు 4-5 ట్రిప్పులు తిరుగుతాయి. ఆ మేరకు 400 బస్సలు రోజుకు 2 వేల ట్రిప్పులు నడుస్తాయి. ఆ ప్రకారం రోజుకు ఈ బస్సుల్లో 70 వేల మంది దాకా ప్రయాణిస్తారు. కుప్పంలో సీఎం సభ కోసం గురువారం మధ్యాహ్నం నుంచే బస్సులను పంపించివేయడంతో గురు, శుక్రవారాల్లో మొత్తం 4 వేల ట్రిప్పులు కోత పడ్డాయి. అంటే ఈ రెండు రోజుల్లో లక్షన్నర మంది ప్రయాణికులకు అసౌక్యం ఎదురు కానుంది. ఈ 400 బస్సులు నడిచే మార్గాల్లో అవసరమైన చోట్ల అద్దె బస్సుల్ని నడిపేందుకు అర్టీసీ అధికారులు యత్నించగా అద్దె బస్సుల ఆపరేటర్లు తాము కొత్త రూట్లలో బస్సులను నడపలేమని ఖరాఖండీగా చెప్పినట్టు సమాచారం. దీనికి ప్రైవేటు ట్రావెల్స్‌, టౌన్‌ సర్వీసు బస్సులను కలుపుకుంటే గురు, శుక్రవారాల్లో రెండు లక్షల మంది విద్యార్థులు, ప్రయాణీకులకు అవస్థలు తప్పడం లేదు.ముఖ్యమంత్రుల సభలకు వాహనాలు కేటాయించి జనాన్ని తరలించిన ఘటనలు గతంలోనూ జరిగాయి. అయితే ఎక్కడో 200-250 కిలోమీటర్ల దూరాన వున్న కుప్పం సభకు ఇరుగుపొరుగు జిల్లాల నుంచీ బస్సులు నిర్బంధంగా స్వాధీనం చేసుకోవడం మాత్రం ఇదే తొలిసారి. మొత్తానికి గంట రెండు గంటల సీఎం బహిరంగసభ సంబరానికి రెండు రోజుల పాటు రెండు లక్షల మందిని ఇక్కట్ల పాలు చేస్తుండడం పట్ల జనం నుంచీ తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి.

మహిళల ఖాతాల్లోకి నేడు రూ. 208.89కోట్ల జమ  

తిరుచానూరు,సెప్టెంబరు 22: వైఎస్సార్‌ చేయూత పథకం కింద జిల్లాలో 45-60సంవత్సరాల మధ్య వయస్సుగల 1,11,408మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల మహిళలకు రూ. 18.750చొప్పున మొత్తం రూ. 208.89కోట్లు జమకానుందని  కలెక్టర్‌ వెంకటరమణారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.శుక్రవారం సీఎం జగన్‌ కుప్పంలో జరిగే కార్యక్రమంలో ఈ నిధులు జమ చేస్తారని తెలిపారు. 

Updated Date - 2022-09-23T06:54:00+05:30 IST