అంతటా.. కరోనా భయ‘మే’!

ABN , First Publish Date - 2021-06-01T05:13:25+05:30 IST

మే నెలలో కరోనా విజృంభించింది. రికార్డు స్థాయిలో పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అదేరీతిలో మరణాలూ సంభవించాయి. మే నెలలో మొత్తంగా 40,913 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, కొవిడ్‌ బారిన పడి 160 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో అటు జిల్లావాసుల్లో, ఇటు అధికారుల్లో.. అంతటా భయాందోళన కనిపించింది.

అంతటా.. కరోనా భయ‘మే’!

- మే నెలలో 40,913 పాజిటివ్‌ కేసులు
- 160 మంది మృతి.. తాజాగా మరో ఏడుగురు
(శ్రీకాకుళం, ఆంధ్రజ్యోతి/కలెక్టరేట్‌)

మే నెలలో కరోనా విజృంభించింది. రికార్డు స్థాయిలో పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అదేరీతిలో మరణాలూ సంభవించాయి. మే నెలలో మొత్తంగా 40,913 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, కొవిడ్‌ బారిన పడి 160 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో అటు జిల్లావాసుల్లో, ఇటు అధికారుల్లో.. అంతటా భయాందోళన కనిపించింది. మే నెల మొదటి వారం జిల్లాలో కరోనా ప్రభావం తీవ్రరూపం దాల్చింది. రోజుకు రెండువేలకు అటు.. ఇటుగా పాజిటివ్‌ కేసులు నమోదయ్యేవి. ఈ ఏడాది మార్చి నెలాఖరు నాటికి జిల్లాలో కరోనా 47,016 పాజిటివ్‌ కేసులు ఉండేవి. ఏప్రిల్‌లో 21,350 మందికి పాజిటివ్‌ నిర్ధారణ కాగా, బాధితుల సంఖ్య 68,366కి చేరింది. ఇక మే నెలలో రికార్డు స్థాయిలో 40,913  పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. కరోనా కట్టడిలో భాగంగా ప్రభుత్వం కర్ఫ్యూ విధించడంతో కాస్త కేసులు తగ్గుముఖం పట్టాయి. మే నెల  5 నుంచి కర్ఫ్యూ అమల్లోకి   వచ్చింది. ఇరవైరోజులు దాటాక కొంతమేర కేసులు తగ్గాయి. మే నెలాఖరున కేవలం 231 పాజిటివ్‌ కేసులు మాత్రమే నమోదయ్యాయి. దీంతో కర్ఫ్యూ సత్ఫలతాలిచ్చినట్టు తెలుస్తోంది. మరికొద్దిరోజులు ఇదే ఆంక్షలు కొనసాగిస్తే కేసులు గణనీయంగా తగ్గే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

 ఏడుగురి మృతి.. 231 మందికి పాజిటివ్‌
కొవిడ్‌ మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. జిల్లాలో తాజాగా 24 గంటల వ్యవధిలో కొవిడ్‌ బారిన పడి ఏడుగురు మృతి చెందారు. మృతుల సంఖ్య 575కు చేరింది. పాజిటివ్‌ కేసులు విషయానికొస్తే.. సోమవారం 2,773 మందికి కరోనా పరీక్షలు చేయగా, కేవలం 231 మందికి మాత్రమే పాజిటివ్‌ నిర్ధారణ అయింది. చాలా రోజుల తర్వాత అత్యల్పంగా కేసులు నమోదు కావడం ఇదే ప్రథమం. శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటివరకు 12,59,775 నమూనాలు సేకరించగా.. కరోనా బాధితుల సంఖ్య 1,09,279కు చేరింది. వీరిలో చాలామంది కోలుకున్నారు. సోమవారం 1,143 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు 8,665 మాత్రమే ఉన్నాయి. హోం ఐసోలేషన్‌లో 6,680 మంది, కొవిడ్‌ కేర్‌ సెంటర్లలో 798 మంది, కొవిడ్‌ ఆస్పత్రుల్లో 1,187 మంది చికిత్స పొందుతున్నారు.

 మరో 10 రోజులు.... కర్ఫ్యూ పొడిగింపు
కరోనా కట్టడిలో భాగంగా జిల్లాలో అమలు చేస్తున్న కర్ఫ్యూ మరో పది రోజులు పొడిగించారు. ఎటువంటి సడలింపులు లేకుండా యథావిధిగా ఈ ఆంక్షలు కొనసాగించనున్నారు. 144 సెక్షన్‌ సైతం అమలు చేయనున్నారు. కరోనా మహమ్మారి రెండో దశ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం గత నెల 5 నుంచి కర్ఫ్యూ అమలు చేస్తోంది. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు మాత్రమే కార్యకలాపాలకు అనుమతి ఇచ్చింది. ఈ గడువులోగా  వాణిజ్య సంస్థలు, బార్లు, రెస్టారెంట్‌లు తెరిచేందుకు, రాకపోకలు సాగించేందుకు అవకాశమిచ్చింది. ముందుగా రెండువారాలపాటు కర్ఫ్యూ అమలు చేయనున్నట్టు ప్రకటించింది. రెండువారాల అనంతరం కేసులు తగ్గుముఖం పట్టకపోవడంతో గత నెలాఖరు వరకూ కర్ఫ్యూ కొనసాగించింది. ఇప్పటికీ పరిస్థితులు పూర్తిస్థాయిలో అదుపులోకి రాకపోవడంతో మళ్లీ ఈ నెల 10వ తేదీ వరకూ కర్ఫ్యూ ను పొడిగించింది. దీంతో యథావిధిగా మధ్యాహ్నం 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలుకానుంది. ఉదయం ఆరు గంటల పాటు మాత్రమే వ్యాపార, వాణిజ్యసంస్థలు, దుకాణాలు, కార్యాలయాలు, రవాణా, హోటళ్లు... వివిధ వర్గాలకు అనుమతించారు. ఆ సమయంలోనూ 144 సెక్షన్‌ కొనసాగించనున్నారు.

 ఆంక్షల సడలింపు లేదు
కరోనా ఆంక్షల కారణంగా నిత్యావసరాల దుకాణాలు, మాంసాహారం, కూరగాయల మార్కెట్లలో జోరుగా విక్రయాలు సాగుతుండగా... ఇతరత్రా వ్యాపారాలు దెబ్బతిన్నాయి. కేవలం ఆరుగంటలు మాత్రమే అనుమతి ఉండడంతో  హోటళ్లు, రెస్టారెంట్లు, భవన నిర్మాణ రంగానికి చెందిన దుకాణాలు పెద్దగా తెరవడం లేదు. దీంతో చాలామందికి ఉపాధి కరువవుతోంది. ఈ నేపథ్యంలో కనీసం మధ్యాహ్నం మరో గంట వరకైనా ఆంక్షలు సడలించాలని వ్యాపారులు ప్రజాప్రతినిధులను కోరారు. రవాణా రంగానికి సంబంధించి కొన్ని వాహనాలకు మినహాయింపు ఇవ్వాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. కానీ ఆంక్షలు సడలించకపోవడంతో కార్మికులు, వ్యాపారులు నిరాశ చెందుతున్నారు.

Updated Date - 2021-06-01T05:13:25+05:30 IST