గత 24 గంటల్లో అమెరికాలో కంటే ఎక్కువగా భారత్‌లో కరోనా మరణాలు

ABN , First Publish Date - 2020-07-07T05:42:12+05:30 IST

భారత్‌లో కరోనా మరణాల సంఖ్య కలవరపాటుకు గురిచేస్తోంది. గత 24 గంటల్లో...

గత 24 గంటల్లో అమెరికాలో కంటే ఎక్కువగా భారత్‌లో కరోనా మరణాలు

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా మరణాల సంఖ్య కలవరపాటుకు గురిచేస్తోంది. గత 24 గంటల్లో అమెరికాలో నమోదైన కోవిడ్-19 మరణాల కంటే భారత్‌లో నమోదైన కరోనా మరణాలే ఎక్కువగా ఉండటం మరింత ఆందోళనకు గురిచేసే విషయం. అమెరికాలో గత 24 గంటల్లో కరోనా వల్ల 271 మంది మరణిస్తే.. భారత్‌లో 425 మంది మరణించారు. కరోనా వల్ల తీవ్రంగా ప్రభావితమైన దేశాల్లో 29 లక్షల కరోనా కేసులతో అమెరికా ఒకటవ స్థానంలో ఉండగా.. భారత్ కూడా మూడవ స్థానంలో ఉంది. బ్రెజిల్‌లో పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. బ్రెజిల్‌లో కరోనా మరణాలు కల్లోలం రేపుతున్నాయి. గత 24 గంటల్లో బ్రెజిల్‌లో కరోనా వల్ల 602 మంది మరణించారు. 


అమెరికాలో ఇటీవల కరోనా మరణాలు కాస్త తగ్గుముఖం పట్టినా మొత్తం కరోనా మరణాల సంఖ్య మాత్రం అమెరికాలోనే ఎక్కువ. అమెరికాలో ఇప్పటివరకూ 1,29,947 మంది కరోనా సోకి మరణించారు. బ్రెజిల్‌లో కరోనా మరణాలు 64,867కు చేరగా.. భారత్‌లో కరోనా మరణాల సంఖ్య 19,693కు చేరింది. భారత్‌లో కరోనా మరణాల రేటు క్రమేపి తగ్గుతుండటం కాస్త ఊరట కలిగించే విషయం. రెండు వారాల క్రితం 3.2గా ఉన్న మరణాల రేటు.. వారం క్రితం 3కి తగ్గింది. సోమవారం ఉదయం భారత్‌లో కరోనా మరణాల రేటు 2.8కి తగ్గింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణాల రేటు 4.7 ఉండగా.. అమెరికాలో 4.5గా, బ్రెజిల్‌లో 4.1గా ఉంది.

Updated Date - 2020-07-07T05:42:12+05:30 IST