కరోనా రోగుల కోసం ఎంజీఎంలో 440 పడకలు

ABN , First Publish Date - 2020-09-22T06:23:58+05:30 IST

కరోనా రోగులకు మెరుగైన వైద్య సేవలందించేందుకు ఎంజీఎం ఆస్పత్రిలో 440 పడకలను ఏర్పాటు చేశామని

కరోనా రోగుల కోసం ఎంజీఎంలో 440 పడకలు

సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కె.నాగార్జునరెడ్డి


హన్మకొండ అర్బన్‌, సెప్టెంబరు 16: కరోనా రోగులకు మెరుగైన వైద్య సేవలందించేందుకు ఎంజీఎం ఆస్పత్రిలో 440 పడకలను ఏర్పాటు చేశామని సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నాగార్జునరెడ్డి తెలిపారు. ఎంజీఎం ఆస్పత్రిలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కరోనా రోగుల కోసం తొలుత 340పడకలను ఏర్పాటు చేయగా అదనంగా మరో 100పడకలను అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. కరోనా లక్షణాలున్న ప్రతీఒక్కరికి పరీక్షలు చేస్తున్నామని, కొవిడ్‌ బాధితులకు ప్రత్యేక వైద్యపరికరాలతో చికిత్స అందించి సత్వరమే కోలుకునేలా చూస్తున్నామని వివరించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో 134మంది కరోనా రోగులు చికిత్స పొందుతున్నారని తెలిపారు. వైరస్‌ లక్షణాలతో వచ్చేవారిని బయటకు పంపించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. ట్రయాలజీ ఏరియాలో రోగుల కోసం సుమారు 60ఆక్సిజన్‌ బెడ్లను సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు.


కరోనా లక్షణాలున్నవారికి అప్పటికప్పుడు పరీక్షలు చేసి పాజిటివ్‌ రిపోర్టు వస్తే వెంటనే ఆస్పత్రిలో చేర్చుకొని వైద్యసేవలందిస్తున్నామని పేర్కొన్నారు.  24గంటల పాటు కరోనా పరీక్షలు నిర్వహిస్తుండడం రోగులకు శుభపరిణామమని ఆయన తెలిపారు. ఆక్సిజన్‌ సరఫరాలో వేగం పెంచేందుకు వేపరేషన్‌ అనే నూతన పరికరాన్ని తెప్పించామని, దీంతో ఆక్సిజన్‌ ప్రెషర్‌ అధికంగా వస్తుందని, ఫలితంగా మరో 13కిలోలీటర్ల లిక్విడ్‌ ఆక్సిజన్‌ ట్యాంక్‌ ఎంజీఎంలో, కేఎంసీలో 15రోజుల్లో వచ్చే అవకాశముందని ఆయన తెలిపారు. ఎంజీఎంలో ఇప్పటివరకు సుమారు 5,590 మందికి పరీక్షలు నిర్వహించగా అందులో 2,212మందికి పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని వివరించారు.


ప్రస్తుతం 134 మంది కరోనా పేషెంట్లు, 68మంది ‘సారి’ పేషెంట్లు చికిత్స పొందుతున్నారన్నారు. ఇంకా ఆస్పత్రిలో 234 బెడ్లు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. కాగా ఆస్పత్రిలో ఇతర వ్యాధులతో 500 మంది చికిత్స పొందుతున్నారని వివరించారు. కేఎంసీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సంధ్య మాట్లాడుతూ పీఎంఎస్‌ఎస్‌వై కింద కేఎంసీలో 250 పడకల సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి పనులు 95 శాతం పూర్తయ్యాయని తెలిపారు. మితగా పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి త్వరలోనే ఆస్పత్రిని అందుబాటులోకి తీసుకొస్తామని ఆమె స్పష్టం చేశారు. సమావేశంలో ఆర్‌ఎంవో డాక్టర్‌ రమణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-09-22T06:23:58+05:30 IST