తేనాంపేట-సైదాపేట మధ్య రూ.485 కోట్లతో ఫ్లై ఓవర్‌

ABN , First Publish Date - 2022-04-14T15:57:49+05:30 IST

నగరంలో ట్రాఫిక్‌ రద్దీని నియంత్రించేలా స్థానిక తేనాంపేట నుండి సైదాపేట వరకు రూ.485 కోట్ల వ్యయంతో ఫ్లై ఓవర్‌ ఏర్పాటుచేయనున్నట్లు ప్రజాపనుల శాఖ

తేనాంపేట-సైదాపేట మధ్య రూ.485 కోట్లతో ఫ్లై ఓవర్‌

పెరంబూర్‌(చెన్నై): నగరంలో ట్రాఫిక్‌ రద్దీని నియంత్రించేలా స్థానిక తేనాంపేట నుండి సైదాపేట వరకు రూ.485 కోట్ల వ్యయంతో ఫ్లై ఓవర్‌ ఏర్పాటుచేయనున్నట్లు ప్రజాపనుల శాఖ మంత్రి ఏవీ వేలు తెలిపారు. శాసనసభలో రహదారుల శాఖ పద్దుపై జరిగిన చర్చలో మంత్రి ఏవీ వేలు మాట్లాడారు. నగరంలో 400 ఏళ్ల ప్రాచీనమైన రోడ్డుగా అన్నాశాలై ఉంది. అన్నాశాలైలో దక్షిణ భారత సైనిక ప్రధాన కార్యాలయం, ఓమందూర్‌ ప్రభుత్వ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి, ఎల్‌ఐసీ కార్యాలయం, అమెరికా రాయబార కార్యాలయం, డీఎంఎస్‌ ప్రాంగణంలో ఆరోగ్యశాఖ సహా పలు శాఖల ప్రధాన కార్యాలయాలు, విద్యా సంస్థలు, వాణిజ్య సముదాయాలు, వివిధ బ్యాంకుల ప్రధాన కార్యాలయాలు, ప్రముఖ ప్రైవేటు ఆసుపత్రులు, నక్షత్ర హోటళ్లు, కర్మాగారాలుండడంతో   నిత్యం ట్రాఫిక్‌ రద్దీ అధికంగా ఉంటోంది. ముఖ్యంగా, తేనాంపేట నుంచి సైదాపేట వరకు 3.5 కి.మీ దూరం వెళ్లాలంటే సుమారు 30 నుంచి 40 నిముషాలు పడుతోంది. ఈ మార్గంలో పలు జంక్షన్లు ఉండడంతో సిగ్నల్స్‌ వద్ద వాహనాలు బారులుతీరి కనిపిస్తుంటాయి. నందనం, సీఐటీ నగర్‌ జంక్షన్‌ ప్రాంతాల్లో ఉదయం, సాయంత్రం వేళల్లో సుమారు 2 కి.మీ మేర వాహనాలు నిలిచిపోతుంటాయి. ఈ ప్రాంతంలో నెలకొన్న ట్రాఫిక్‌ రద్దీని నియంత్రించేలా ముఖ్యమంత్రి స్టాలిన్‌ ఆదేశాలతో ఫ్లై ఓవర్‌ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది. అన్నాశాలైలోని తేనాంపేట నుండి ఎల్డామ్స్‌ రోడ్డు జంక్షన్‌, ఎస్‌ఐఈటీ కళాశాల జంక్షన్‌, సెండాప్‌ జంక్షన్‌, నత్తనం జంక్షన్‌, సీఐటీ జంక్షన్‌ నుండి సైదాపేట బస్టాండ్‌ వరకు రూ.485 కోట్ల వ్యయంతో ఫ్లె ఓవర్‌ ఏర్పాటుతో, ట్రాఫిక్‌ రద్దీ నియంత్రించవచ్చని మంత్రి వేలు తెలిపారు.

Updated Date - 2022-04-14T15:57:49+05:30 IST