తెరపైకి ఆప్షన 4

ABN , First Publish Date - 2022-06-30T06:44:11+05:30 IST

జగనన్న కాలనీల్లో మొదటి దశ గృహాల నిర్మాణాల లక్ష్యం పూర్తికాని నేపథ్యంలో ప్రభుత్వం కొత్త మార్గాల అన్వేషణలో పడింది. అందులో భాగంగా మరో కొత్త ఆప్షన్‌ను తెర మీదకు తెచ్చింది. ప్రభుత్వం గతంలో జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణానికి మూడు విధాలుగా ప్రణాళిక రూపొందించింది.

తెరపైకి ఆప్షన 4

  • జగనన్న కాలనీల్లో నత్తనడకన గృహాల నిర్మాణం
  • మొదటి దశ లక్ష్య సాధనకు ప్రభుత్వ వ్యూహం
  • సొంత స్థలంలో ఇల్లు కట్టుకునేందుకు అవకాశం
  • అయినా ముందుకు రాని లబ్ధిదారులు

ఉప్పలగుప్తం, జూన్‌ 29: జగనన్న కాలనీల్లో మొదటి దశ గృహాల నిర్మాణాల లక్ష్యం పూర్తికాని నేపథ్యంలో ప్రభుత్వం కొత్త మార్గాల అన్వేషణలో పడింది. అందులో భాగంగా మరో కొత్త ఆప్షన్‌ను తెర మీదకు తెచ్చింది. ప్రభుత్వం గతంలో జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణానికి మూడు విధాలుగా ప్రణాళిక రూపొందించింది. మొదటిది లబ్ధిదారులకు ప్రభుత్వమే గృహాలు నిర్మించి ఇవ్వడం, రెండవది లబ్ధిదారులే స్వయంగా గృహాలు నిర్మించుకోవడం, మూడవది లబ్ధిదారుల పర్యవేక్షణలో కాంట్రాక్టరు నిర్మించడం. అనంతరం ప్రభుత్వమే ఇల్లు నిర్మించే ఆప్షన్‌ను పక్కనబెట్టి మిగిలిన రెండు విధానాలకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. అయితే నిర్మాణ సామగ్రి ధరలు విపరీతంగా పెరగడంతో లబ్ధిదారులు నిర్మాణానికి వెనుకడుగు వేశారు. కాంట్రాక్టర్లు సైతం తమవల్ల కాదన్నారు. దీంతో అదనంగా రూ.50 వేలు డ్వాక్రా రుణంగా అందించే ఏర్పాట్లు చేశారు. ఆర్డీవో ఆధ్వర్యంలో అధికారులు తరచూ లబ్ధిదారులతో సమావేశాలు నిర్వహించి గృహాలు నిర్మించుకోవాలని ఒత్తిడి తెచ్చినప్పటికీ ఫలితం లేకపోయింది. అమలాపురం నియోజకవర్గంలో జగనన్న కాలనీల్లో మొదటి దశలో 3,850 ఇళ్లను ఆన్‌లైన్‌ చేస్తే కేవలం ఇప్పటికి 209 మాత్రమే పూర్తి చేశారు. దీంతో జగనన్న కాలనీ జాబితాలో ఉన్న లబ్ధిదారుడు అక్కడ ఇష్టం లేకపోతే అదే రుణంతో సొంత స్థలంలో ఇల్లు కట్టుకునే వెసులుబాటు కల్పించారు. అయితే వెంటనే సదరు లబ్ధిదారులకు ప్రభుత్వం ఇచ్చిన స్థలం రద్దు చేస్తారు. ఇలా నిర్మించుకున్న గృహాలను కూడా జగనన్న కాలనీల్లో చేర్చి మొదటి దశలో గట్టెక్కాలన్నది ప్రభుత్వ వ్యూహం. ఇది కూడా ఫలించలేదు. సొంత స్థలాల్లో ఇల్లు కట్టుకునేందుకు ఒక్క ఉప్పలగుప్తం మండలంలో మాత్రమే సుముఖత వ్యక్తం చేశారు. జగనన్న కాలనీల్లో మాత్రమే ఇళ్లు నిర్మించుకోవాలన్న నిబంధన సడలించినప్పటికీ ప్రయోజనం లేకపోవడంతో అధికారులు ఆలోచనలో పడ్డారు.

నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి

శ్రీనివాస్‌, హౌసింగ్‌ ఈఈ

అమలాపురం నియోజకవర్గంలో మొదటి దశలో 3,850 గృహాలు నిర్మించాలన్నది లక్ష్యం. ఇప్పటి వరకు 209 పూర్తయ్యాయి. 2,029 వివిధ దశల్లో ఉన్నాయి. 1,612 ప్రారంభం కాలేదు. జగనన్న కాలనీల్లో నివాసానికి ఇష్టపడని వారు  సొంత స్థలాల్లో ఇళ్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఉప్పలగుప్తం మండలం కిత్తనచెరువు జగనన్న కాలనీ లబ్ధిదారులు కొంత మంది  దీనికి ముందుకు వచ్చారు.

Updated Date - 2022-06-30T06:44:11+05:30 IST