ltrScrptTheme3

దేశరాజధానిలో దారుణం.. అత్యాచారం జరిగి రక్తమోడుతున్న పాప.. చికిత్స కోసం అయిదు ఆస్పత్రుల చుట్టూ తిరిగిన తండ్రి

Oct 25 2021 @ 07:21AM

దేశరాజధాని ఢిల్లీలో మానవత్వం సిగ్గు పడేలా ఒక ఘటన జరిగింది. ఆరేళ్ల చిన్నారిపై ఒక దుర్మార్గుడు అత్యాచారం చేయగా..  ఆ పాపకు వైద్య చికిత్స అందించడానికి పాప తండ్రి అయిదు ఆస్పత్రుల చుట్టూ నాలుగు గంటలపాటు 15 కిలోమీటర్లు తిరిగాడు. ఆ సమయంలో పాపకు తీవ్ర రక్తస్రావమౌతోంది. అయినా ఆస్పత్రివారు కనికరించలేదు. ప్రస్తుతం పాప ఆస్పత్రి ఐసియూలో ఉన్నా ఆమె పరిస్థితి విషమంగానే ఉంది. 


మీడియా ఆ తండ్రిని.. పాప ఆరోగ్యం గురించి ప్రశ్నించగా.. గుండెలు బాదుకుంటూ ఏడ్చాడు. ఏడుస్తూనే జరిగింది చెప్పాడు. అతను ఒక రిక్షాలాగే పని చేస్తాడు. అతని భార్య.. ఇళ్లలో పనిమనిషిగా చేస్తోంది. రోజూలాగే శుక్రవారం పనిమీద బయటకు వెళ్లగా.. ఉదయం 10 గంటలకు అతడి భార్య ఫోన్ చేసింది. పాపకు యాక్సిడెంట్ జరిగిందని చెప్పగానే.. పరుగు పరుగున  ఇంటికి చేరుకున్నాడు. ఇంటి బయట జనం అప్పటికే గుమిగూడారు. ఇంట్లోకి వెళ్లగానే.. పాపకు రక్తస్రావమౌతోందని తెలిసింది. ఎవరో పాపపై అత్యాచారం చేశారని తెలిసి షాక్‌కు గురయ్యాడు. ఇరుగుపొరుగువారు అతనికి ధైర్యం చెప్పి.. ఆంబులెన్స్‌ని పిలిపించారు.


ఆంబులెన్స్‌లో రక్తమోడుతున్న పాపను తీసుకొని ముందుగా దెగ్గరలోని సర్దార్ పటేల్ ఆస్పత్రికి వెళ్లాడు. అప్పటికి సమయం 11 గంటలు. అక్కడ ఆస్పత్రి సిబ్బంది పాపకు తాము చికిత్స అందించలేమని మరో ఆస్పత్రికి తీసుకెళ్లమని చెప్పారు. ఆ తరువాత పాపను తీసుకొని లేడీ హార్డింగ్ ఆస్పత్రికి వెళ్లాడు. ఒకవైపు ఏడుస్తున్న పాపను ఓదారుస్తూ.. మరోవైపు ధైర్యం కూడగట్టుకొని లేడి హార్డింగ్ ఆస్పత్రికి చేరుకున్నాడు. అప్పటికి సమయం మధ్యాహ్నం 12 గంటలు. లేడీ హార్డింగ్ ఆస్పత్రి సిబ్బంది అతనికి కళావతి ఆస్పత్రికి తీసుకెళ్లమని సలహా ఇచ్చారు. ఆస్పత్రి సిబ్బందిని ఎంత బతిమాలినా వారు వినలేదు.


కళావతి ఆస్పత్రికి వెళ్లగా.. అక్కడి సిబ్బంది ఈ కేసు తమ ప్రాంత పరిధిలోకి రాదని చెప్పి.. తిరిగి లేడీ హార్డింగ్ ఆస్పత్రికి తీసుకెళ్లమన్నారు. పాప నొప్పి భరించలేక ఏడుస్తూనే ఉంది. ఏం చేయాలో తోచక.. మళ్లీ లేడీ హార్డింగ్ ఆస్పత్రికి వచ్చాడు. అప్పటికి సమయం ఒంటి గంట. కానీ అక్కడ మళ్లీ పని జరగక అక్కడి నుంచి డాక్టర్ రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రికి తీసుకు వచ్చాడు. చివరికి డాక్టర్ రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రిలో పాపను చేర్చుకున్నారు. అప్పటికి సమయం దాదాపు 2 గంటల్లైంది. 


ఎలా జరిగింది?

శుక్రవారం పాప తండ్రి రిక్షాపని మీద బయటికి వెళ్లాడు. తల్లి ఇళ్లలో పనికి వెళ్లింది. పాప ఉదయం గురుద్వారా నుంచి ఉచిత భోజనం తీసుకొచ్చింది. ఆ తరువాత మళ్లీ బయటికి వెళ్లింది. మధ్యాహ్నం ఇంటకి వచ్చినప్పుడు ఏడుస్తూ ఉంది. తల్లి ఏమైందని అడగగా.. ఒక అంకుల్ తనను పెన్ను, పుస్తకం ఇస్తానని చెప్పి తనతో ఒక గదిలో తీసుకెళ్లాడని చెప్పింది. తల్లి పాపను గమనించగా పాపకు రక్తస్రావమౌతోంది. 


పోలీసులు ఫిర్యాదు అందిన వెంటనే.. విచారణ మొదలు పెట్టారు. ఒక సీసీటీవి వీడియోలో ఒక యువకుడు పాపను తీసుకెళుతున్నట్లు కనిపించింది. నిందితునికి దాదాపు 25 ఏళ్ల వయసు ఉంటుంది. కానీ అతను ముఖానికి మాస్క్ వేసుకొని ఉండడంతో అతడిని గుర్తించడం కష్టంగా ఉందని పోలీసులు అంటున్నారు.


అత్యాచారం జరిగినట్లు ఫిర్యాదు అందినా.. ఇప్పటివరకు నిందితుడిని ఎందుకు పట్టుకోలేదని.. పాప కుటుంబసభ్యులు, ఇరుగుపొరుగువారు పోలీస్ స్టేషన్ ఎదుట నిరసనకు దిగారు. ఢిల్లీ మహిళా కమీషన్ వారు.. పోలీసులకు ఈ కేసులో నోటీసులు పంపినట్లు సమాచారం. ఘటన జరిగి 36 గంటలు గడిచినా ఇంకా పాప ఆరోగ్యం కుదుట పడలేదని డాక్టర్లు చెబుతున్నారు.
Follow Us on:

ప్రత్యేకంమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.