స్థానిక సంస్థల్లో 510 వార్డులకు ఉప ఎన్నికలు

ABN , First Publish Date - 2022-07-10T13:10:07+05:30 IST

రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థల్లో ఖాళీగా ఉన్న 510 స్థానాలకు శనివారం ఉదయం నిర్వహించిన ఉప ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. ఈ ఎన్నికల్లో

స్థానిక సంస్థల్లో 510 వార్డులకు ఉప ఎన్నికలు

చెన్నై, జూలై 9 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థల్లో ఖాళీగా ఉన్న 510 స్థానాలకు శనివారం ఉదయం నిర్వహించిన ఉప ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. ఈ ఎన్నికల్లో నగర పాలక వార్డు సభ్యుల పదవులకు పార్టీపరంగా ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ పదవులకు అన్నాడీఎంకే తరఫున పోటీ చేసే అభ్యర్థులు రెండాకుల చిహ్నానికి బదులుగా ఇండిపెండెంట్లకు కేటాయించే చిహ్నాలపై పోటీచేస్తున్నారు. 498 గ్రామ పంచాయతీ వార్డు సభ్యుల పదవులకు, 12 నగర పాలక వార్డు సభ్యుల పదవులకుగాను ఈ ఎన్నికలు జరిగాయి. పంచాయతీ వార్డు సభ్యుల ఎన్నికలకు సంబంధించి 1022 పోలింగ్‌ కేంద్రాలు, నగరపంచాయతీ వార్డు సభ్యుల ఎన్నికలకుగాను 19 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ పోలింగ్‌ కేంద్రాల వద్ద పోలీసులు   భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. శనివారం ఉదయం ఆరుగంటలకే పోలింగ్‌ ప్రారంభమైంది. అన్ని పోలింగ్‌ కేంద్రాల వద్ద కరోనా నిరోధక నిబంధనలు పాటించారు. ఓటు వేయడానికి వచ్చినవారికి థర్మల్‌స్కాన్‌ పరీక్షలు జరిపి, చేతులను శుభ్రం చేసుకునేందుకు శానిటైజర్‌ను అందజేశారు. ఈ పోలింగ్‌ విధుల్లో 291 మంది సిబ్బంది పాల్గొన్నారు. గ్రామపంచాయతీ వార్డు సభ్యుల పదవులకు బ్యాలెట్‌ పత్రాల ద్వారా, నగర పంచాయతీ వార్డు సభ్యుల పదవులకు ఎలక్ర్టానిక్‌ ఓటింగ్‌ యంత్రాలను ఉపయోగించారు. ఉదయం ఆరు గంటల నుంచి పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. సాయంత్రం ఆరు గంటలకు పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసినట్లు ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు జిల్లాల్లో 15 మంది వార్డు సభ్యులను ఎన్నుకునేందుకు పోలింగ్‌ నిర్వహించారు. తిరుప్పూరు, కడలూరు జిల్లాలోనూ నగరపాలక వార్డు సభ్యుల పదవులకుగాను  పోలింగ్‌ ప్రశాంతంగా నిర్వహించారు. ఈ నెల 12న ఓట్ల లెక్కింపు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం అధికారులు తగు ఏర్పాట్లు చేపడుతున్నారు.

Updated Date - 2022-07-10T13:10:07+05:30 IST