Krishna in Nidhivan: రాత్రిపూట శ్రీకృష్ణుడు నృత్యం చేసే నిధివన్‌లో కృష్ణుని 6 రహస్యాలు.

ABN , First Publish Date - 2022-08-19T16:52:14+05:30 IST

శ్రీకృష్ణుడు ప్రతి రోజూ రాత్రి సమయంలో రాధను కలుసుకోవడానికి ఇక్కడకు వస్తాడని స్థానికులు నమ్ముతారు.

Krishna in Nidhivan: రాత్రిపూట శ్రీకృష్ణుడు నృత్యం చేసే నిధివన్‌లో కృష్ణుని 6 రహస్యాలు.

బృందావనంలోని నిధివన్‌లో శ్రీకృష్ణుడికి సంబంధించి ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని ద్వాపర యుగంలో రాధా కృష్ణులు కలిసి తిరిగిన ప్రదేశంగా వారి ఆటలు, పాటలు, కేళీ వినోదం ఇక్కడే సాగిందని అక్కడి ప్రజల విశ్వాసం. శ్రీకృష్ణుడు ప్రతి రోజూ రాత్రి సమయంలో రాధను కలుసుకోవడానికి ఇక్కడకు వస్తాడని స్థానికులు నమ్ముతారు.


రాధాకృష్ణులు గోపికలతో కలిసి ఇక్కడ నాట్యం చేస్తారని ఆ సమయంలో భక్తులు అటుగా సంచరించకూడదని, భటులు రక్షణగా కావలి కాస్తూ ఈ ప్రాంతం చుట్టూ తిరుగుతారని నమ్ముతారు. వారి ఏకాంతానికి భంగం కలిగితే స్వామి శపిస్తాడని ఇక్కడి నమ్మకం. 


1. సూర్యాస్తమయం కాగానే నిధివన్ చుట్టుపక్కల ఎవరూ తిరగరు. ప్రధాన ఆలయ ద్వారాలను మూసివేస్తారు. మరో విశేషం ఏమిటంటే ఆ సమయంలో మనుషులే కాదు జంతువులు కూడా నిధివన్ పక్కలకు రావు. ఈ రాసలీలలను చూడాలని దొంగతనంగా ప్రయత్నించినవారికి పిచ్చితనం, ప్రాణాల మీదకు రావడం జరుగుతుందట. 


2. మరో వింత ఏమంటే నిధివన్ చుట్టుపక్కల స్థానికంగా నివసించే వారి ఇళ్ళు ఉంటాయి.. ఆ ఇళ్ళకు వాళ్ళెవరూ కిటికీలను పెట్టుకోరు.. ఒకవేళ కిటికీలు పెట్టుకున్నా వాటిని రాత్రి సమయాలలో తెరవరు. అలా తెరచి నిధివన్ లో జరిగే రాసలీలలను చూడాలనే ఆలోచన రావడమే పాపంగా భావిస్తారు. 


3. ఇంకో రహస్యం ఏమంటే ఆ లీలానాథుని వేణుగానం రాత్రి సమయాలలో వినిపిస్తుందని, ఆడవారు ధరించే పట్టీల శబ్ధాలు కూడా అప్పుడప్పుడూ వినిపిస్తాయని చుట్టుపక్కల వారు చెపుతారు. 


4. అలాగే నిధివన్ ఆలయం చుట్టూ ఉన్న వనంలో పెరిగే వన తులసి చెట్లు చిన్నవిగా ఉన్నా ప్రతి రెండు చెట్లూ పెనవేసుకుని ఉంటాయి. ఈ చెట్లే రాత్రి వేళల్లో గోపికలుగా మారతాయని చెపుతారు.


5. ఈ వన తులసి వనంలో ఉన్న రంగమహల్‌లోనే రాధామాధవులు ఏకాంతంగా కలుస్తారని ఇక్కడి పూజారులు చెపుతారు. రాత్రి పూట ఆలయం మూసివేసిన తరువాత అలంకరించి ఉంచిన మంచం, ఓ వెండి గ్లాసు నిండా పాలను ఉంచుతారు, వీటితో పాటు తీపి పదార్థాలను నైవేద్యంగా పెడతారు, తాంబూలం, పళ్ళు తోముకోవడానికి రెండు వేప పుల్లలు, చీర, గాజులతో పాటు అలంకారంగా చాలా వస్తువులను గర్భగుడిలో ఉంచుతారు.


6. ఉదయం తలుపులు తెరిచే సమయానికి తాంబూళం నమిలి ఉమ్మిన గుర్తులు, పాలు తాగిన ఆనవాళ్ళూ కనిపిస్తాయి. వీరికోసం ఏర్పాటు చేసిన పానుపు నలిగి దుప్పట్లు చెదిరి ఉంటాయి. ఇక స్వీట్లు, పండ్లు సగం తిన్న ఆనవాళ్ళు కనిపిస్తాయి. ఇది చాలా సంవత్సరాలుగా జరుగుతున్న చిత్రం. 


ఈ నిధివన్ రహస్యం ఛేదించాలని చూసే నాస్తికులను, హేతువాదులను కూడా ఆశ్చర్యపరిచింది. అంతుచిక్కని రహస్యంగా మాత్రమే మిగిలిపోయిన నిధివన్ శ్రీకృష్ణాష్టమి వేడుకలలో అందంగా ముస్తాబైంది. 


Updated Date - 2022-08-19T16:52:14+05:30 IST