హైదరాబాద్‌లో ఈ ఆరుగురు ఎటెళ్లిపోయారో...!

ABN , First Publish Date - 2021-03-02T14:20:49+05:30 IST

భాగ్యనగరంలోని వివిధ పోలీ‌స్‌స్టేషన్ల పరిధుల్లో ఆరుగురు అదృశ్యమయ్యారు...

హైదరాబాద్‌లో ఈ ఆరుగురు ఎటెళ్లిపోయారో...!

హైదరాబాద్/మదీన : భాగ్యనగరంలోని వివిధ పోలీ‌స్‌స్టేషన్ల పరిధుల్లో ఆరుగురు అదృశ్యమయ్యారు. భర్తతో కలిసి వెళ్తున్న ఓ మహిళ మార్గమధ్యంలో అదృశ్యమైంది. ఫలక్‌నుమా వట్టేపల్లికి చెందిన మహ్మద్‌ నయీమ్‌ వివాహం పదహారేళ్ల క్రితం ఫర్జానా బేగం (32)తో జరిగింది. గత డిసెంబర్‌లో విడాకులు తీసుకున్నారు. మనసు మార్చుకుని 15 రోజుల క్రితం మరోసారి వివాహం చేసుకున్నారు. పెళ్లయిన 10 రోజుల తర్వాత ఇద్దరూ కలిసి బైక్‌పై బండ్లగూడ నూరినగర్‌లో ఉండే బావమరిది ఇంటికి వెళ్లారు. అనంతరం బైక్‌పై ఇంటికి తిరుగు పయనమయ్యారు. రాత్రి 8 గంటలకు నౌ నంబర్‌ చౌరస్తా వద్దకు రాగానే బైక్‌పై నుంచి దిగి ఎటో వెళ్లిపోయింది. భర్త పరిసరాల్లో వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో చాంద్రాయణగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.


- చాంద్రాయణగుట్ట ఇంద్రానగర్‌ బస్తీకి చెందిన షేక్‌ చాంద్‌ కుమారుడు షేక్‌ ఫారూక్‌(40) ఆటోడ్రైవర్‌. ఫిబ్రవరి 26న ఉదయం పనికి వెళ్తున్నానని చెప్పి బయటికి వెళ్లాడు. రాత్రయినా తిరిగి రాకపోవడంతో భార్య జరీనాబేగం చాంద్రాయణగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది.  

- కాలాపత్తర్‌ ఇందిరానగర్‌ కాలనీకి చెందిన మహ్మద్‌అస్లమ్‌ కుమార్తె అర్షియా బేగం(27) ఇటీవల భర్తతో విడాకులు తీసుకుంది. ఏడేళ్ల కుమారుడితో కలిసి తల్లిదండ్రుల వద్దనే ఉంటోంది. కొన్ని రోజుల నుంచి మానసికంగా కుంగిపోతోంది. సోమవారం తెల్లవారుజామున ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయింది. కుటుంబసభ్యులు కాలాపత్తర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

- ఉప్పుగూడ నరహరి నగర్‌కు చెందిన టి.లింగమయ్య కుమార్తె టి.భవాని(19) ఫిబ్రవరి 26న ఉదయం 11-30 గంటలకు ఇంట్లో ఎవరూ లేని సమయంలో బ్యాగులో బట్టలు సర్దుకుని వెళ్లిపోయింది. ఆమె వెళ్లడం చూసిన పక్కింటివారు ఆమె తల్లికి ఫోన్‌ చేసి చెప్పారు. సోమవారం ఛత్రినాక పోలీసులకు తల్లి ఫిర్యాదు చేసింది. 

- కాటేదాన్‌ హౌసింగ్‌బోర్డు కాలనీకి చెందిన సిద్దప్ప కుమారుడు కె.అనిల్‌(35) ఫిబ్రవరి 27న ఉదయం ఇంటినుంచి బయటికి వెళ్లి తిరిగి రాలేదు. మైలార్‌దేవ్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

- రాజేంద్రనగర్ ‌: లక్ష్మీగూడ హౌసింగ్‌ బోర్డు కాలనీకి చెందిన కె.అనిల్‌(35) ఫిబ్రవరి 27న ఉదయం ఇంటి నుంచి బయటకెళ్లి తిరిగి రాలేదు. సోదరుడు చరణ్‌ మైలార్‌దేవ్‌పల్లి పోలీసులకు ఫిర్యాదుచేశాడు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-03-02T14:20:49+05:30 IST