60 వేల కోట్లు!

ABN , First Publish Date - 2022-05-24T08:36:23+05:30 IST

రాష్ట్రంలో అదానీ గ్రీన్‌ ఎనర్జీ సంస్థ రూ.60 వేల కోట్ల వ్యయంతో రెండు కాలుష్య రహిత విద్యుత్‌ ప్రాజెక్టులు నెలకొల్పనుంది.

60 వేల కోట్లు!

రాష్ట్రంలో అదానీ గ్రీన్‌ ఎనర్జీ పెట్టుబడి!!

3,700 మెగావాట్ల పంప్డ్‌ హైడ్రో స్టోరేజ్‌ ప్రాజెక్టు

10 వేల మెగావాట్ల సోలార్‌ ప్లాంటు

కాలుష్యం లేని ఇంధన ప్రాజెక్టులపై దావో్‌సలో అవగాహన ఒప్పందం

రెండోరోజూ జగన్‌తో అదానీ భేటీ

ఏయూతో కలిసి టెక్‌మహీంద్రా ప్రత్యేక పాఠ్య ప్రణాళిక

పలు కంపెనీల అధిపతులతో సీఎం సమావేశం

అమరావతి, మే 23 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో అదానీ గ్రీన్‌ ఎనర్జీ సంస్థ రూ.60 వేల కోట్ల వ్యయంతో రెండు కాలుష్య రహిత విద్యుత్‌ ప్రాజెక్టులు నెలకొల్పనుంది. వీటిలో ఒకటి 3,700 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మించే పంప్డ్‌ హైడ్రో స్టోరేజ్‌ ప్రాజెక్టుకాగా.. రెండోది పది వేల మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌ ప్రాజెక్టు. ఆదివారం దావో్‌సలో సీఎం జగన్మోహన్‌రెడ్డితో సమావేశమైన అదానీ గ్రూపు సంస్థల చైర్మన్‌ గౌతమ్‌ అదానీ సోమవారం కూడా ఆయన్ను కలిశారు. పై ప్రాజెక్టులపై సవివరంగా చర్చించి.. అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కూడా కుదుర్చుకున్నారు. వారిద్దరి సమక్షంలో రాష్ట్రప్రభుత్వం తరఫున ప్రత్యేక సీఎస్‌ కరికాల వలవన్‌, అదానీ గ్రీన్‌ ఎనర్జీ తరఫున ఆశిష్‌ రాజవంశీ సంతకాలు చేశారు. ఈ ప్రాజెక్టులతో సుమారు పది వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయని అంచనా. కాగా.. మేజర్‌ టెక్నాలజీ హబ్‌గా విశాఖపట్నాన్ని తీర్చిదిద్దాలని సంకల్పించినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. సోమవారం దావో్‌సలో భాగంగా ఆయన పలు కంపెనీల సీఈవోలు, ఎండీలతో సమావేశమయ్యారు. టెక్‌మహీంద్రా ఎండీ సీపీ గుర్నానీతో మాట్లాడారు. నైపుణ్యాభివృద్ధిలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. కృత్రిమ మేధ(ఏఐ)కు కేంద్రంగా విశాఖను తీర్చిదిద్దాలని, దీనికోసం కలిసిరావాలని ఆహ్వానించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంతో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు గుర్నానీ తెలిపారు.


విశ్వవిద్యాలయంతో కలిసి నైపుణ్యాలను పెంచేందుకు, హై ఎండ్‌ టెక్నాలజీపై వచ్చే మూడు నెలల్లో ప్రత్యేక పాఠ్య ప్రణాళికలను రూపొందిస్తామన్నారు. టెక్‌ మహీంద్రా అనుబంధ సంస్థ అసాగో.. రాష్ట్రంలో రూ.250 కోట్లతో బయో ఇథనాల్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు సుముఖత కనబరచింది. మరోవైపు దస్సాల్ట్‌ సిస్టమ్స్‌ ఎగ్జిక్యూటివ్‌ ఉపాధ్యక్షుడు ఫ్లోరెన్స్‌ వెర్జలెన్‌ను సీఎం కలిశారు. త్రీడీ సంబంధిత ఉత్పత్తులను ఈ ఫ్రెంచ్‌ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ తయారుచేస్తుంది. పోర్టులను పూర్తిస్థాయిలో వినియోగించుకునేందుకు తగిన సహకారం అందించాలని జగన్‌ కోరారు. త్వరలో రాష్ట్రంలో పర్యటిస్తామని, భాగస్వామ్యానికి తమ సంస్థ ఉత్సాహంగా ఉందని ఫ్లోరెన్స్‌ తెలిపారు. స్విస్‌ పార్లమెంటు ప్రతినిధి బృందంతోనూ జగన్‌ సమావేశమయ్యారు. భారత సంతతికి చెందిన స్విస్‌ ఎంపీ నిక్లాజ్‌ శామ్యూల్‌ గుగెర్‌ బృందంతో రాష్ట్రంలో వ్యాపార అవకాశాలపై చర్చించారు. మిత్సుయి ఓఎ్‌సకే లైన్స్‌ లిమిటెడ్‌ ప్రెసిడెంట్‌, సీఈవో తకీషి హషిమొటోతో జగన్‌ భేటీ అయ్యారు. ఓడల ద్వారా అత్యధిక సరుకును రవాణా చేస్తున్న ఈ కంపెనీని.. రాష్ట్రంలో కంటైనర్‌ హబ్‌, లాజిస్టిక్‌ రంగాలపై దృష్టిపెట్టాలని కోరారు. కాకినాడలో వ్యాపార కార్యకలాపాలను ప్రారంభించేందుకు ముందుకొస్తున్నట్లు సదరు సంస్థ వెల్లడించింది.  హీరో గ్రూప్‌ చైర్మన్‌, ఎండీ పవన్‌ ముంజల్‌ సీఎంను కలిశారు. ఎలక్ర్టిక్‌ వాహనాలను ఉత్పత్తిచేస్తున్న అథెర్‌ ఎనర్జీలో 36 శాతం వాటాను హీరో గ్రూప్‌ కొనుగోలు చేసింది. ఈ నేపథ్యంలో ఇరువురి నడుమా చర్చ జరిగింది. తిరుపతి సమీపంలో ఇప్పటికే ఉన్న హీరో కంపెనీకి అవసరమైన నీటిని కండలేరు నుంచి ఇవ్వాలని అధికారులను జగన్‌ ఆదేశించారు. 


2వేల జనాభా ఉన్న ప్రతి గ్రామానికీ విలేజ్‌ క్లినిక్‌

ఆంధ్రప్రదేశ్‌లో రెండువేల జనాభా ఉన్న ప్రతి గ్రామాన్నీ ఒక యూనిట్‌గా తీసుకుని విలేజ్‌ క్లినిక్కులు  ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం తెలిపారు. దావో్‌సలో ఫ్యూచర్‌ ఫ్రూఫింగ్‌ హెల్త్‌ సిస్టమ్స్‌ అనే అంశంపై జరిగిన సెమినార్‌లో ఆయన మాట్లాడారు. కొవిడ్‌ విపత్తును ఎవరూ ఊహించలేదని, కరోనా సమయంలో ఒక దేశం, రాష్ట్రం పరిధిలో చేయగలిగినవన్నీ చేశామన్నారు. వైద్యారోగ్య రంగాన్ని బలోపేతం చేయాలంటే అందుబాటులో సౌకర్యాలు, తేలిగ్గా లభ్యత, అందుబాటు ఖర్చు.. ఈ మూడూ ఉండాలని చెప్పారు. ఇందులో భాగంగానే విలేజ్‌ క్లినిక్కులు ఏర్పాటు చేస్తున్నామని, ప్రతి 30 వేల జనాభా ఉన్న మండలాన్ని తీసుకుని రెండు ప్రైమరీ హెల్త్‌ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని, ఒక్కో పీహెచ్‌సీకి ఇద్దరు చొప్పున  వైద్యులు ఉంటారని, ప్రతి వైద్యుడికీ ఒక 104 వాహనం, ఒక్కో వైద్యుడికి మండలంలోని 4-5 గ్రామాలు కేటాయిస్తామని, వారు ప్రజలను పేరుపేరునా పలకరిస్తూ సేవలందిస్తారని పేర్కొన్నారు.


కరోనాలో పలకని 104...

‘యాక్సెసబిలిటీ’... అంటూ 104 సేవ గురించి కూడా జగన్‌ గొప్పగా చెప్పారు. అత్యంత కీలకమైన కరోనా సంక్షోభ సమయంలో 104 నుంచి ఉలూకూ పలుకూ లేదు. ‘డాక్టర్‌ లైన్‌లోకి వస్తారు’ అంటూ గంటల కొద్దీ లైన్‌లోనే పెట్టారు. 104 కాల్‌ సెంటర్‌ ద్వారా కనీసం 10 శాతం బాధితులకు కూడా ప్రయోజనం కలగలేదు.

Updated Date - 2022-05-24T08:36:23+05:30 IST