కొత్త కేసులు 60 వేలు

ABN , First Publish Date - 2021-06-16T06:23:35+05:30 IST

దేశంలో కరోనా కొత్త కేసులు రోజురోజుకు తగ్గుతున్నాయి. సోమవారం 60,471 మందికి వైరస్‌ నిర్ధారణ అయింది. గత 75 రోజుల్లో ఇవే అతి తక్కువ పాజిటివ్‌లు. కొవిడ్‌తో మరో 2,726 మంది ప్రాణాలు కోల్పోయారు.

కొత్త కేసులు 60 వేలు

కరోనా వైరస్‌తో మరో 2,726 మంది మృతి 


న్యూఢిల్లీ, జూన్‌ 15: దేశంలో కరోనా కొత్త కేసులు రోజురోజుకు తగ్గుతున్నాయి. సోమవారం 60,471 మందికి వైరస్‌ నిర్ధారణ అయింది. గత 75 రోజుల్లో ఇవే అతి తక్కువ పాజిటివ్‌లు. కొవిడ్‌తో మరో 2,726 మంది ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన వివరాల్లో.. మహారాష్ట్రలో 1,592 మంది మరణించినట్లు పేర్కొంది. కాగా, సోమవారం దేశంలో 17.51లక్షల పరీక్షలే చేశారు. పాజిటివ్‌ రేటు 3.45కు తగ్గింది. ప్రస్తుతం 9.13 లక్షల యాక్టివ్‌ కేసులున్నాయి. కాగా, మహారాష్ట్రలో సెకండ్‌ వేవ్‌ దాదాపు అదుపులోకి వచ్చినట్లే కనిపిస్తోంది. కొత్తగా 8 వేల కేసులే వచ్చాయి. మార్చి 2 తర్వాత ఇవే అత్యల్పం. ముంబైలో ఫిబ్రవరి 16 అనంతరం అతి తక్కువగా 530 పాజిటివ్‌లే నమోదయ్యాయి. ఏప్రిల్‌ నెలలో నిర్వహించిన ఆరో సీరో సర్వే ఫలితాలను ఢిల్లీ యం త్రాంగం ప్రభుత్వానికి సమర్పించింది. పదివేల మందిపైగా నమూనాలు సేకరించి ఈ సర్వే చేపట్టారు. జనవరిలో చేసిన ఐదో సీరో సర్వేలో 56 శాతం పైగా ఢిల్లీ ప్రజల్లో యాంటీబాడీలున్నట్లు స్పష్టమైంది. సెకండ్‌ వేవ్‌ తీవ్రంగా ఉన్న సమయంలో చేసిన ఆరో సర్వేలో ఫలితం ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది.


గిరిజన జిల్లాల్లో మెరుగ్గా టీకా పంపిణీ

ప్రతి పది లక్షల జనాభాకు.. 176 గిరిజన జిల్లాలకు గాను 128 జిల్లాల్లో టీకా పంపిణీ జాతీయ సగటు కంటే మెరుగ్గా ఉందని కేంద్రం వివరించింది. ప్రస్తుతం రాష్ట్రాల వద్ద 1.05 కోట్ల టీకాలు నిల్వ ఉన్నాయని.. మూడు రోజుల్లో 47.3 లక్షల టీకాలు పంపిణీ చేయనున్నట్లు తెలిపింది. మంగళవారం ఉదయం వరకు ప్రజలకు 25.67 కోట్లపైగా డోసులు ఇచ్చినట్లు పేర్కొంది. 


‘డెల్టా ప్లస్‌’పై ఆందోళన వద్దు

డెల్టా స్ట్రెయిన్‌ కొత్త వేరియంట్‌ డెల్టా ప్లస్‌ (ఏవై.1) ప్రస్తుతానికి ఆందోళన అవసరం లేదని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఈ వేరియంట్‌ తీరు తెన్నులను పరిశీలించాల్సి ఉందని తెలిపింది. కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌, నీతీ ఆయోగ్‌ సభ్యుడు వీకే పాల్‌ మంగళవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. డెల్టా ప్లస్‌ను యూర్‌పలో మార్చిలోనే గుర్తించారని.. ఈ నెల 13న బయటకు వెల్లడించారని వీకే పాల్‌ తెలిపారు. మే 7 నాటితో పోలిస్తే కేసులు 85 శాతం తగ్గాయని లవ్‌ అగర్వాల్‌ పేర్కొన్నారు. 20 రాష్ట్రాలు/యూటీల్లో యాక్టివ్‌ కేసులు 5 వేలలోపే ఉన్నట్లు వివరించారు.

 

20 ఏళ్లలోపు వారిలో ఒకేలా ఇన్ఫెక్షన్‌ రేటు

రెండు వేవ్‌లలో వివిధ వయో వర్గాల్లో ఇన్ఫెక్షన్‌ రేటు ఒకేలా ఉందని లవ్‌ అగర్వాల్‌ పేర్కొన్నారు. ఫస్ట్‌ వేవ్‌లో పదేళ్లలోపు పిల్లలో 3.28 శాతం మంది వైర్‌సకు గురికాగా, సెకండ్‌ వేవ్‌లో ఇది 3.05 శాతంగా ఉందన్నారు. 11-20 ఏళ్ల మధ్యవారిలో ఫస్ట్‌ వేవ్‌లో 8.03శాతం మంది, సెకండ్‌ వేవ్‌లో 8.5శాతం మంది వైరస్‌ బారినపడినట్లు తెలిపారు. కుంభమేళా సమయంలో హరిద్వార్‌లో జరిగిన సందేహాస్పద పరీక్షల నివేదికలపై చర్యలు ప్రారంభమయ్యాయన్నారు.

Updated Date - 2021-06-16T06:23:35+05:30 IST