మగతోడు లేకుండా గుడ్లు పెట్టిన 62 ఏళ్ల కొండచిలువ

ABN , First Publish Date - 2020-09-11T21:05:02+05:30 IST

వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. రెండు దశాబ్దాలుగా మగ కొండచిలువ తోడు లేని 62 ఏళ్ల ఓ బాల్ పైతాన్ తాజాగా

మగతోడు లేకుండా గుడ్లు పెట్టిన 62 ఏళ్ల కొండచిలువ

సెయింట్ లూయిస్: వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. రెండు దశాబ్దాలుగా మగ కొండచిలువ తోడు లేని 62 ఏళ్ల ఓ బాల్ పైతాన్ తాజాగా ఏడు గుడ్లు పెట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. మిస్సౌరీలోని సెయింట్ లూయిస్‌ జూలో జరిగిందీ ఘటన. కొండచిలువ గుడ్లు పెట్టడంతో ఆశ్చర్యపోయిన జూ కీపర్లు ఇది ఎలా సాధ్యమంటూ ఆరా తీసే పనిలో పడ్డారు.


జూలోని సరీసృపశాస్త్ర (హెర్పెటాలజీ) మేనేజర్ మార్క్ వానెర్ మాట్లాడుతూ.. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయమని, అయితే, బాల్ పైథాన్ల విషయంలో ఇది అసాధారణమేమీ కాదని పేర్కొన్నారు. ఈ కొండచిలువలు అలైంగికంగా పునరుత్పత్తి చేస్తాయని అన్నారు. కొమోడో డ్రాగన్స్‌తోపాటు ర్యాటెల్ స్నేక్స్ జాతికి చెందిన ఇతర జీవులు అలైంగికంగానే పునరుత్పత్తి చేస్తాయని వానెర్ వివరించారు.


ఈ కొండచిలువ గుడ్లు పెట్టడం కూడా అసాధారణమేనని, బాల్ పైథాన్‌లు సాధారణంగా 60 ఏళ్ల వయసు వచ్చేసరికి గుడ్లు పెట్టడం ఆపేస్తాయని అన్నారు. గుడ్లు పెట్టిన అతి పెద్ద వయసు కలిగిన కొండ చిలువ ఇదే అవుతుందని వానెర్ పేర్కొన్నారు. 


జులై 23న కొండచిలువ ఈ గుడ్లను పెట్టింది. ఇందులో మూడు ఇంక్యుబేటర్‌లో ఉండగా, రెండింటిని మాత్రం జన్యు నమూనాల కోసం తీసుకున్నారు. మిగతా రెండింటిలో పాము పిల్లలు బతికి లేవని అధికారులు తెలిపారు. జన్యు నమూనా విశ్లేషణ ద్వారా ఆ గుడ్లు లైంగికంగా పునరుత్పత్తి చెందాయా? లేక, అలైంగికంగానా అన్న విషయం తెలుస్తుంది.


ఇక్కడ మరో విషయం ఏమిటంటే ఫలదీకరణను ఆలస్యం చేయడం కోసం పాములు వీర్యాన్ని నిలువ చేసుకుంటాయి. ఇదే జూలో 31 ఏళ్ల మగ బాల్ పైథాన్ కూడా ఉంది. అయితే, వీటిని ప్రదర్శనకు ఉంచడం లేదు. తాజాగా గుడ్లు పెట్టిన ఆడ కొండచిలువను దాని యజమాని 1961లో జూకు అప్పగించాడు.  


Updated Date - 2020-09-11T21:05:02+05:30 IST