ఉక్రెయిన్‌ నుంచి క్షేమంగా.. ఇప్పటి వరకు భారత్ చేరిన 634 మంది తెలంగాణ విద్యార్థులు

ABN , First Publish Date - 2022-03-08T13:26:51+05:30 IST

యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్‌లో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కాలం గడిపిన హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు, నల్లగొండ జిల్లాకు చెందిన నలుగురు విద్యార్థులు సోమవారం క్షేమంగా స్వస్థలం చేరుకున్నారు.

ఉక్రెయిన్‌ నుంచి క్షేమంగా.. ఇప్పటి వరకు భారత్ చేరిన 634 మంది తెలంగాణ విద్యార్థులు

ఉక్రెయిన్‌ నుంచి క్షేమంగా.. ఇప్పటి వరకు భారత్ చేరిన 634 మంది తెలంగాణ విద్యార్థులు 

ఇళ్లకు చేరిన ఏడుగురు విద్యార్థులు

భావోద్వేగానికి గురైన తల్లిదండ్రులు 

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌): యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్‌లో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కాలం గడిపిన హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు, నల్లగొండ జిల్లాకు చెందిన నలుగురు విద్యార్థులు సోమవారం క్షేమంగా స్వస్థలం చేరుకున్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్‌ గంగలో భాగంగా వీరంతా మొదట ఢిల్లీకి, అట్నుంచి హైదరాబాద్‌కు వచ్చారు. అక్కడి నుంచి ఇళ్లకు చేరుకున్నారు. ఇంటికి చేరిన వీరిని చూడగానే వారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు. కాగా, ఉక్రెయిన్‌ నుంచి ఇప్పటి వరకు 634 మంది తెలంగాణ విద్యార్థులు ఇండియాకు క్షేమంగా వచ్చారు. సోమవారం మరో 9మంది చేరుకున్నారు. ఉక్రెయిన్‌ సరిహద్దు దేశా ల నుంచి వీరంతా న్యూఢిల్లీ/ముంబై విమనాశ్రయాలకు చేరుకున్నట్లు ప్రభుత్వ అధికారులు తెలిపారు. న్యూఢిల్లీ, ముంబై నుంచి విద్యార్థులను హైదరాబాద్‌కు రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా బాంబు పేలుళ్లు, క్షిపణి దాడుల నేపథ్యంలో భయాందోళనలతో క్షణమొక యుగంగా గడిపి, సోమవారం ఇంటికి చేరుకున్న విద్యార్థులు అక్కడి భీకర పరిస్థితులను ఆంధ్రజ్యోతికి వివరించారు. 


ఐదు రోజులు బంకర్లలో గడిపాం: ప్రవళిక

భారత్‌కు తిరిగొస్తానని కలలో కూడా అనుకోలేదని నల్లగొండ జిల్లాకు చెందిన విద్యార్థిని సభావట్‌ ప్రవళిక సోమవారం హైదరాబాద్‌ శ్రీనిధి కాలనీలోని బాబా యి నివాసంలో ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ ఉక్రెయిన్‌లోని పరిస్థితులను వెల్లడించింది. బంకర్లలో విద్యుత్‌ సౌకర్యం లేదని, రోజుకు ఒకసారి బ్రెడ్‌, గ్లాసు నీళ్లు ఇచ్చేవారని తెలిపింది. భారత ప్రభుత్వ చొరవతో సోమవారం కుటుంబ సభ్యులను కలుసుకున్నానని, ఇంటికి వచ్చిన తర్వాతనే కడుపునిండా భోజనం చేశానని కన్నీటి పర్యంతమైంది. 


ఊపిరి బిగపట్టుకుని ఉన్నాం: హైమావతి

బంకర్లలో గంటలు రోజుల్లా గడిచాయని, సైరన్‌ మోగినప్పుడల్లా భయంతో ఒణికిపోయేవాళ్లమని అల్వాల్‌ ప్రాంతానికి చెందిన మాజీ సైనికుడు ఆదినారాయణ కుమార్తె హైమావతి పేర్కొంది. ఆమె జెప్రోజియా స్టేట్‌ మెడికల్‌ యూనివర్సిటీలో వైద్య విధ్య అభ్యసిస్తోంది. ఈ సందర్భంగా ఆమె తన అనుభవాలను ఆంధ్రజ్యోతితో పంచుకుంది. జెఫ్రోజియా నుంచి రైలులో  ఉక్రెయిన్‌ సరిహద్దు హంగేరీకి మార్చి 2న చేరుకున్నాం. అక్కడే 3 రోజులున్నాం. 5న విమానం ఎక్కి 6న ఢిల్లీకి చేరుకున్నాం. ఆ తర్వాత హైదరాబాద్‌ వచ్చాను్‌ అని హైమావతి వివరించారు. 


గంగతో ఇంటికి చేరాం: ఎర్ర మేఘన

యుద్ధం జరిగే ప్రాంతానికి 600కి.మీ. దూరంలో ఉన్నా భయంగా ఉండేదని హయత్‌నగర్‌ బృందావన్‌ కాలనీకి చెందిన ఎర్ర మేఘన తెలిపింది. కానీ, క్షణక్షణం భయంభయంగా గడపాల్సి వచ్చిందనిపేర్కొంది. 


ప్రాణాలతో వస్తామనుకోలేదు: నవనీత్‌

యుద్ధం నేపథ్యంలో తనకు బతుకుతానన్న భరోసా లేకుండా పోయిందని నల్లగొం డ జిల్లా కేతేపల్లి మండలం కొత్తపేటకు చెందిన విద్యార్థి నవనీత్‌ తెలిపాడు.  ప్రాణాలతో ఇంటికి చేరతామో లేదోనని అనిపించిందని నల్లగొండ జిల్లా తిప్పర్తికి చెందిన జాన్సన్‌, గోలి రాజకుమారి అన్నారు. సుదీర్ఘంగా సాగిన ప్రయాణంలో నీరు, ఆహారం లేక ఇబ్బందులు పడ్డామని నల్లగొండ జిల్లా ఆత్మకూర్‌(ఎస్‌) మండలం నెమ్మికల్‌కు చెందిన బీరవెల్లి సంపత్‌రెడ్డి తెలిపాడు. 

Updated Date - 2022-03-08T13:26:51+05:30 IST