Police Stationకు వచ్చిన 65 ఏళ్ల మహిళ.. ఏమైందమ్మా అని ఇన్‌స్పెక్టర్ అడగ్గా.. ఆమె చెప్పింది విని అంతా షాక్..

ABN , First Publish Date - 2022-05-24T14:49:35+05:30 IST

అరవై అయిదేళ్ల మహిళ మహిళా పోలీస్‌ స్టేషన్‌కు వచ్చింది. ఏమైందమ్మా అని ఇన్‌స్పెక్టర్‌ అడిగారు...

Police Stationకు వచ్చిన 65 ఏళ్ల మహిళ.. ఏమైందమ్మా అని ఇన్‌స్పెక్టర్ అడగ్గా.. ఆమె చెప్పింది విని అంతా షాక్..

  • మా ముసలాయన వేధిస్తున్నాడు..
  • ఆయనకు కాస్త భయం చెప్పండి సార్‌   
  • నేను చెప్పినట్లు వినమని బెదిరించండి 
  • మహిళా పోలీ‌స్‌స్టేషన్‌ను ఆశ్రయించిన వృద్ధురాలు

హైదరాబాద్‌ సిటీ : అరవై అయిదేళ్ల మహిళ మహిళా పోలీస్‌ స్టేషన్‌కు వచ్చింది. ఏమైందమ్మా అని ఇన్‌స్పెక్టర్‌ అడిగారు. మా ఆయన నన్ను వేధిస్తున్నాడు సర్‌ అని చెప్పింది. ఈ వయసులోనా అంటూ ఒకింత ఆశ్చర్యంగా చూస్తూ మీరేం చేస్తుంటారని అడిగారు. రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ని అని చెప్పగానే మరో షాక్‌. ఆయన ఏం చేస్తుంటారని అడిగితే, ఆయన కూడా రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ అని చెప్పగానే ఇన్‌స్పెక్టర్‌ ఈ సారి గట్టిగానే షాకయ్యారు. మంచి హోదాలో రిటైర్‌ అయిన మీకు ఈ వయసులో వేధింపులేంటి అనడంతో ఆమె జరిగిందంతా చెప్పింది.


వెంకట లక్ష్మమ్మ, వెంకటేశ్వర్లు (పేరు మార్చాం) 65 ఏళ్లకు పైబడిన దంపతులు. ఇద్దరూ వేర్వేరు యూనివర్సిటీల్లో ప్రొఫెసర్లుగా పని చేసి రిటైర్‌ అయ్యారు. వారికి ఇద్దరు పిల్లలు. బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాల్లో సెటిల్‌ అయ్యారు. హైదరాబాద్‌లో ఈ వృద్ధ దంపతులు మాత్రమే ఉంటున్నారు. డబ్బులకు కొదవలేదు. ఆర్థిక ఇబ్బందులు లేవు. అన్యోన్యంగా ఉండాల్సిన దంపతులు ఈ వయసులో ఇగోకు వెళ్తున్నారు. పొద్దున్నే కాఫీ పెట్టి ఇవ్వాలని భర్తకు ఆమె ఆర్డర్‌ వేసింది. అందుకు ఆయన ససేమిరా అన్నాడు. ఇంట్లోకి ఏది కావాలన్నా తీసుకురావాలంటూ హుకుం జారీ చేసింది. దానికీ ఆయన అంగీకరించడం లేదు. ఆమెకు నచ్చిన వంట చేసుకోవడానికీ ఆయన అంగీకరించడం లేదు. దాంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది.


పట్టించుకోని పిల్లలు..

ఈ విషయమై పిల్లలతో మాట్లాడొచ్చు కదా అని పోలీసులు అంటే.. ‘వారు ఎక్కడో బెంగళూరులో ఉంటారు. మా ఇగోలతో వారు ఇబ్బందులు పడుతున్నారు. వారి వద్దకు వెళ్దామంటే బెంగళూరులో ఎక్కడుంటున్నారో అడ్రస్‌ కూడా చెప్పడం లేదు’ అని ఆ పెద్దాయన వాపోయాడు. రోజూ ఫోన్‌లో మాట్లాడతారని, చూడాలనిపించి బెంగళూరు వెళ్తే, ఏదో హోటల్‌లో రూమ్స్‌ బుక్‌చేసి, వారే కుటుంబం పిల్లలతో సహా వచ్చి కలిసిపోతారని చెప్పారు. మరో వైపు దంపతులిద్దరూ ఇగోలకు పోవడంతో వృద్ధ దంపతుల పంచాయితీ పోలీస్‌ స్టేషన్‌కు చేరింది. పోలీసులు ఇద్దరికీ సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. 


ఆమె చెప్పింది విన్న పోలీసులు మీ ఇద్దరిలో ఎవరో ఒకరు సర్దుకుపోవాలని సలహా ఇచ్చారు. ‘మా ముసలాయనకు భయం చెప్పండి. నీ భార్య చెప్పినట్లు వినాల్సిందే అని హెచ్చరించండి. ఇంటి బయట చాలా మంది ఆడవాళ్లతో మాట్లాడుతున్నాడు. ఈ వయసులో పరాయి ఆడవాళ్లతో మాటలేంటి. అలాంటివి చేయొద్దని చెప్పండి. అలా వినకపోతే కేసు బుక్‌చేసి జైలుకు పంపుతామని బెదిరించండి. చట్టాలు మహిళలకే అనుకూలంగా ఉన్నాయని గట్టిగా మందలించండి’ అంటూ ఇన్‌స్పెక్టర్‌కు చెప్పింది. ‘ఇప్పటి వరకు నేనే కష్టపడ్డాను. పెళ్లైనప్పటి నుంచి ఇంటి, వంట పనులు, పిల్లల చదువు, బాధ్యతలు నా మీదేసుకున్నాను. ఇప్పుడు రిటైర్‌ అయ్యాను. కాబట్టి ఇప్పుడు ఇంట్లోని పనులు ఆయనే చేయాలి. ఎన్నో ఏళ్లు నేను సేవలు చేశాను. మరి నేనెప్పుడు ఆయనతో సేవలు చేయించుకోవాలి..?’ అంటోంది. 


ఇదంతా ఎందుకమ్మా పనిమనిషిని పెట్టుకుంటే ఇంటి పనులతో పాటు, కావాల్సిన వంటలు చేసి పెడుతుంది కదా అని ఇన్‌స్పెక్టర్‌ సలహా ఇస్తే అందుకు ఆమె ఒప్పుకోలేదు. ఆయన ఖాళీగానే ఉన్నాడుగా, పనిమనిషి ఎందుకు దండగ అని ప్రశ్నించింది. ఏం చేయాలో పాలుపోని పోలీసులు ఆమె భర్తను పిలిపించారు. ‘ఏంటండీ.. ఈ వయసులో పంతాలకు పోతే ఎలా..? ఆమె చెప్పినట్లు వినొచ్చుకదా’ అని చెప్పారు. అందుకాయన ‘ఆమే నన్ను రోజూ వేధిస్తోంది. ఆమె చెప్పిందే వినాలి. చేయమన్న పని చేయాలి. పెట్టింది తినాలి. పొద్దున్నే కాఫీ కలిపి ఇవ్వాలి. నేనేం చేయాలో మీరే చెప్పండి. వృద్ధాప్యంలో నన్ను బాధపెట్టడం కరెక్టేనా’ అని ముసలాయన పోలీసుల ముందు వాపోయారు.

Updated Date - 2022-05-24T14:49:35+05:30 IST