68 వసంతాల ఎస్వీయూ

ABN , First Publish Date - 2022-06-22T06:40:02+05:30 IST

68 ఏళ్లలో ఎంతోమంది గొప్పవారిని సమాజానికి ఎస్వీయూ వర్సిటీ అందించింది.

68 వసంతాల ఎస్వీయూ

రేపటి  58, 59, 60, 61, 62వ కంబైన్డ్‌ స్నాతకోత్సవానికి ముస్తాబు


తిరుపతి(విద్య), జూన్‌ 21: ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన రాయలసీమ ప్రాంతంలోని విద్యార్థులకు ఉన్నత విద్యను అందించాలన్న ఉద్దేశంతో 1954 సెప్టెంబరు రెండో తేదీన తిరుపతిలో శ్రీవారి పాదాల చెంత  శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఈ వర్సిటీ ఏర్పాటు కోసం టీటీడీ రెండు భవనాలు, రెండు వసతి గృహాలతోపాటుగా 1000 ఎకరాల స్థలాన్ని 99 సంవత్సరాలకు లీజుగా ఇచ్చింది. ఈ 68 ఏళ్లలో ఎంతోమంది గొప్పవారిని సమాజానికి వర్సిటీ అందించింది. ఇక్కడ చదివిన ఎందరో దేశ, విదేశాల్లో వివిధ రంగాల్లో ఉన్నత కొలువులు చేపట్టారు. వర్సిటీ ఏర్పాటులో మాజీ భారత రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి, మాజీ సీఎం టంగుటూరి ప్రకాశం పంతులు కృషి ఎంతో ఉంది. మొదటిస్నాతకోత్సవం 1958 ఫిబ్రవరి 14న నిర్వహించారు. 1960లో వర్సిటీ రెండోస్నాతకోత్సవాన్ని జరుపుకోగా.. అప్పటి నుంచి ఏటా నిర్వహించేవారు. కాగా 2007నుంచి స్నాతకోత్సవాలను కంటిన్యూగా నిర్వహించడంలేదు. 2007సెప్టెంబరు 7న 49వ స్నాతకోత్సవం నిర్వహించగా..2010 మార్చి12న 50వ స్నాతకోత్సవం, అదేఏడాది అక్టోబరు 27న 51వ స్నాతకోత్సవం, 2011 జూలై1న 52, 2012ఆగస్టు 22న 53, 2015 జూన్‌22న 54, 2018 జూన్‌ 30న 55వ స్నాతకోత్సవం జరిగింది. అదేఏడాది సెప్టెంబరు 21న 56, 57వ కంబైన్డ్‌ స్నాతకోత్సవాన్ని జరుపుకున్నారు. ఈక్రమంలో మళ్లీ నాలుగేళ్ల తర్వాత ఒకేసారిగా గురువారం 58, 59, 60, 61, 62వ కంబైన్డ్‌ స్నాతకోత్సవాన్ని జరుపుకునేందుకు వర్సిటీ సిద్ధమైంది.   


నేడు చిత్తూరుకే పరిమితం

వర్సిటీ ప్రారంభమైన తొలినాళ్లలో రాయలసీమలోని కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరుతోపాటు నెల్లూరు జిల్లాలకు విస్తరించి ఉండేది. కాగా 1983లో అనంతపురంలో ఎస్కే యూనివర్సిటీ ఏర్పాటు చేయగా..మిగతా జిల్లాల్లో 2008లో వివిధ కొత్త యూనివర్సిటీలు ఏర్పాటయ్యాయి. దాంతో ప్రస్తుతం ఈవర్సిటీ ఉమ్మడి చిత్తూరు జిల్లావరకే పరిమితమైంది. దీని పరిధిలో ప్రస్తుతం 142 డిగ్రీ కాలేజీలు, 32పీజీ, 36బీఎడ్‌, ఆరు న్యాయ, 23 ఎంబీఏ అండ్‌ ఎంసీఏ, 10ఎంపీఈడీ, బీపీఈడీ కళాశాలలు ఉన్నాయి.


వర్చువల్‌గా హాజరుకానున్న గవర్నరు: వీసీ రాజారెడ్డి వెల్లడి

ఎస్వీయూలోని శ్రీనివాస ఆడిటోరియంలో గురువారం ఉదయం 11.30 గంటలకు 58, 59, 60, 61, 62వ కంబైన్డ్‌ స్నాతకోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు వీసీ రాజారెడ్డి తెలిపారు. తన చాంబర్‌లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ స్నాతకోత్సవంలో చాన్సలర్‌ హోదాలో గవర్నరు బిశ్వభూషణ్‌ హరిచందన్‌ వర్చువల్‌గా హాజరు కానున్నారని తెలిపారు. ముఖ్య అతిథిగా నూతన జాతీయ విద్యావిధానం (ఎన్‌ఈపీ) చైర్మన్‌ డాక్టర్‌ కె.కస్తూరి రంగన్‌ పాల్గొని స్నాతకోత్సవ ఉపన్యాసం చేస్తారన్నారు. 2015-2019 విద్యాసంవత్సరానికి సంబంధించి యూజీ, పీజీ, ఎంఫిల్‌, పీహెచ్‌డీ కోర్సులు పూర్తిచేసిన వారికి డిగ్రీలు ప్రదానం చేయనున్నట్లు వెల్లడించారు. వీరిలో నేరుగా 2471మందికి, ఇన్‌ఆబ్సెనియా పద్ధతిలో 8,563మందికి, ఇన్‌అడ్వాన్స్‌ పద్ధతిలో 15,018మందికి మొత్తం 26,052మందికి డిగ్రీలు ప్రదానం చేస్తారని చెప్పారు. స్నాతకోత్సవంలో 2015-2019లో  పీజీ, ప్రొఫెషనల్‌, ఎంఫిల్‌, పీహెచ్‌డీ కోర్సులు చదివిన 2,471మందికి నేరుగా డిగ్రీలు ప్రదానం చేస్తామన్నారు. 340మందికి గోల్డ్‌మెడల్స్‌, 213మందికి ప్రైజులు అందజేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే వివిధరంగాలకు చెందిన ముగ్గురు ప్రముఖులకు వర్సిటీ గౌరవడాక్టరేట్లు ప్రదానం చేస్తామన్నారు.  వీరిలో ఒడిశాకు చెందిన ఫిలాంథ్రపిస్ట్‌ డాక్టర్‌ చంద్రభాను సత్పతి, ప్రొద్దుటూరుకు చెందిన ప్రముఖ అవధాని నరాల రామారెడ్డి, విజయవాడకు చెందిన ప్రముఖ మానసిక వ్యాధి నిపుణుడు డాక్టర్‌ ఇండ్ల రామసుబ్బారెడ్డి ఉన్నారన్నారు. కొన్ని సాంకేతిక కారణాలు, కొవిడ్‌తో నాలుగేళ్లుగా కాన్వొకేషన్‌ నిర్వహించలేక పోయినట్లు మీడియాకు వివరించారు. రెక్టార్‌ ప్రొఫెసర్‌ వి.శ్రీకాంత్‌రెడ్డి, రిజిస్ర్టార్‌ ప్రొఫెసర్‌ మహ్మద్‌ హుస్సేన్‌, మీడియా కమిటీ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ దేవప్రసాద్‌రాజు, పీసీ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. 



Updated Date - 2022-06-22T06:40:02+05:30 IST