డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ మేడం గారి ఆవుకి చికిత్స కోసం ఏడుగురు డాక్టర్లకు డ్యూటీ

ABN , First Publish Date - 2022-06-12T22:45:06+05:30 IST

ప్రభుత్వ వనరులు, యంత్రసామాగ్రి దుర్వినియోగానికి సంబంధించి ఉత్తరప్రదేశ్‌(Uttarpradesh)లోని ఫతేపూర్‌లో వెలుగులోకి వచ్చిన ఓ ఘటన చర్చనీయాంశంగా మారింది.

డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ మేడం గారి ఆవుకి చికిత్స కోసం ఏడుగురు డాక్టర్లకు డ్యూటీ

ఫతేపూర్, ఉత్తరప్రదేశ్ : ప్రభుత్వ వనరులు, యంత్రసామాగ్రి దుర్వినియోగానికి సంబంధించి ఉత్తరప్రదేశ్‌(Uttarpradesh)లోని ఫతేపూర్‌లో వెలుగులోకి వచ్చిన ఓ ఘటన చర్చనీయాంశంగా మారింది. ఫతేపూర్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్(DM) అపూర్వ దుబే సాకుతున్న ఆవు(Cow)కి జాగ్రత్తగా చికిత్స అందించేందుకు ఏడుగురు పశువైద్యుల(veterinary doctor)కు డ్యూటీ విధిస్తూ ఆదేశాలు(Orders) వెలువడ్డాయి. రోజుకు ఒకరి చొప్పున వారం రోజులపాటు ఆవుకు చికిత్స అందించేందుకు వీలుగా వెటర్నరీ డాక్టర్లకు బాధ్యతలు అప్పగిస్తూ డిస్ట్రిక్ట్ చీఫ్ వెటర్నరీ ఆఫీసర్(సీవీవో) ఎస్‌కే తివారీ ఈ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఆదేశాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ మేడం గారి ఆవుకి చికిత్స అందించే క్రమంలో సూచించిన ఏడుగురు వెటర్నరీ ఆఫీసర్లకు ఉదయం, సాయంత్రం విధులు అప్పగిస్తున్నామని పేర్కొన్నారు. అయితే వైద్యులు ఆవుకి జాగ్రత్తగా చికిత్స అందించడమే కాదు చికిత్సకు సంబంధించిన రిపోర్ట్‌ను తయారుచేయాలి. సంబంధిత వైద్యుల మధ్య సమన్వయం, చికిత్స ఫాలో-అప్‌ వ్యవహారాల పర్యవేక్షణ బాధ్యతలను డా.దినేష్ కుమార్ అనే డాక్టర్‌కి అప్పగిస్తున్నామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రతి రోజూ సాయంత్రం 6 గంటలకు రిపోర్ట్‌ని ఆఫీస్‌ వద్ద సమర్పించాలని షరతు విధించారు.


అనివార్య కారణాల వల్ల ఎవరైనా వైద్యుడు డ్యూటీకి రాలేకపోతే ప్రత్యమ్నాయంగా మరో డాక్టర్ సురేష్ కుమార్‌ కన్నోజియా సిద్ధంగా ఉండాలని అప్రమత్తం చేశారు. బాధ్యతారాహిత్యం క్షమార్హం కాదు అని ఉత్తర్వు చివరిలో పేర్కొనడం గమనార్హం. కాగా ఈ ఆదేశాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రభుత్వ వనరుల దుర్వినియోగం ఈ స్థాయిలో జరగడాన్ని నెటిజన్లు నిరసిస్తున్నారు.

Updated Date - 2022-06-12T22:45:06+05:30 IST