అత్యున్నత స్థాయికి ఎదిగిన ఆ ఏడుగురు ఆర్థిక మంత్రులు

ABN , First Publish Date - 2022-02-01T16:35:17+05:30 IST

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దేశ సాధారణ..

అత్యున్నత స్థాయికి ఎదిగిన ఆ ఏడుగురు ఆర్థిక మంత్రులు

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దేశ సాధారణ బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. మహిళా ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్‌కి ఇది నాలుగవ బడ్జెట్. 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఇది 10వ బడ్జెట్. అయితే ఆర్థిక మంత్రుల స్థాయి నుంచి ప్రధాని, రాష్ట్రపతి పదవుల వరకూ ఎదిగిన ఏడుగురు ప్రముఖుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.  



మొరార్జీ దేశాయ్

మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ ఆర్థిక మంత్రిగా 10 సార్లు కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇప్పటి వరకు అత్యధిక బడ్జెట్‌లను సమర్పించిన వ్యక్తిగా ఆయన రికార్డు సృష్టించారు. దేశాయ్ 1958 నుండి 1963 వరకు ఆర్థిక మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత మార్చి 1967 నుండి జూలై 1969 వరకు ఇందిరా గాంధీ మంత్రివర్గంలో ఆర్థిక మంత్రిగా పనిచేశారు. అనంతరం మొరార్జీ దేశాయ్ మార్చి 1977 నుండి జూలై 1979 వరకు ప్రధానమంత్రిగా ఉన్నారు. మొరార్జీ దేశాయ్ భారతదేశానికి నాలుగవ ప్రధానమంత్రి.

చరణ్ సింగ్

మాజీ ప్రధాని చరణ్ సింగ్ 1979లో జనవరి నుండి జూలై వరకు ఆర్థిక మంత్రిగా ఉన్నారు. అనంతరం జూలై 1979 నుండి జనవరి 1980 వరకు భారతదేశ ప్రధాన మంత్రిగా కూడా పనిచేశారు. 

విశ్వనాథ్ ప్రతాప్ సింగ్

కేంద్ర ఆర్థికమంత్రిగా బాధ్యతలు నిర్వహించాక దేశానికి ప్రధాని అయిన ప్రముఖుల జాబితాలో విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ పేరు కూడా ఉంది. డిసెంబర్ 1984 నుంచి జనవరి 1987 వరకు ఆయన ఆర్థిక మంత్రిగా దేశానికి సేవలందించారు. డిసెంబర్ 1989 నుండి నవంబర్ 1990 వరకు భారతదేశ ప్రధాన మంత్రిగా విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ వ్యవహరించారు.


ఇందర్ కుమార్ గుజ్రాల్

ఇందర్ కుమార్ గుజ్రాల్ భారతదేశ 12వ ప్రధానమంత్రి. ప్రధానమంత్రిగా ఆయన పదవీకాలం ఏప్రిల్ 1997 నుండి మే 1997 వరకు కొనసాగింది. ఇందర్ కుమార్ గుజ్రాల్ ప్రధానమంత్రి పదవిలోకి రాకముందు ఆర్థిక మంత్రిగా కూడా పని చేశారు. ఆయన అతి తక్కువ కాలం అంటే కేవలం 11 రోజులు మాత్రమే దేశ ఆర్థిక మంత్రిగా ఉన్నారు.

మన్మోహన్ సింగ్

మన్మోహన్ సింగ్ 1991 నుండి 1996 వరకు దేశ ఆర్థిక మంత్రిగా పనిచేశారు. భారతదేశపు అత్యుత్తమ ఆర్థిక మంత్రులలో ఒకరిగా ఆయనను పేర్కొంటారు. మన్మోహన్ సింగ్ 1982 నుండి 1985 వరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్‌గా కూడా పనిచేశారు. 2004 నుంచి 2014 వరకు యూపీఏ ప్రభుత్వంలో మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నారు.

ఆర్ వెంకటరామన్

ఆర్ వెంకటరామన్ జనవరి 1980 నుండి జనవరి 1982 వరకు ఆర్థిక మంత్రిగా దేశానికి సేవలందించారు. ఆర్ వెంకటరామన్ ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు మూడుసార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. దీని తరువాత ఆయన ఆగస్టు 1984 నుండి జూలై 1987 వరకు ఉఫరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత జూలై 1987 నుండి జూలై 1992 వరకు రాష్ట్రపతిగా దేశానికి సేవలు అందించారు.

ప్రణబ్ ముఖర్జీ

ఆర్ వెంకటరామన్ మాదిరిగానే మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూడా అంతకుముందు ఆర్థిక మంత్రిగా పనిచేశారు. ముఖర్జీ జూలై 2012లో భారతదేశానికి 13వ రాష్ట్రపతి అయ్యారు. 1982 నుంచి 1984 వరకు ఆయన ఆర్థిక మంత్రిగా పనిచేశారు. 2009 నుంచి 2012 వరకు మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేశారు. ప్రణబ్ ముఖర్జీ ఎనిమిదిసార్లు పార్లమెంటులో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 

Updated Date - 2022-02-01T16:35:17+05:30 IST