70.33 ఎకరాలు కాదు.. 85.19

Published: Fri, 01 Jul 2022 00:28:06 ISTfb-iconwhatsapp-icontwitter-icon
70.33 ఎకరాలు కాదు.. 85.19   జమునా హేచరీస్‌ వద్ద పోలీసుల బందోబస్తు

జమున హేచరీస్‌ కబ్జాలో ఉన్నట్లుగా రీ సర్వేలో తేల్చిన అధికారులు 

భూములను రీ అసైన్‌ చేసిన అధికారులు 

ఆగమేఘాల మీద పట్టాల పంపిణీ 

 ఆంధ్రజ్యోతి ప్రతినిధి, మెదక్‌, జూన్‌ 30: మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ సతీమణి జమున, కుమారుడు నితిన్‌రెడ్డికి చెందిన జమునా హేచరీస్‌ కబ్జాలో 85.19 ఎకరాల అసైన్డ్‌ భూములు ఉన్నట్టు రెవెన్యూ అధికారులు తేల్చారు. మెదక్‌ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట, హాకీంపేట గ్రామాల్లో జమునా హేచరీస్‌ యాజమాన్యం 70.33 ఎకరాలను కబ్జా చేసినట్లు గత ఏడాది డిసెంబర్‌ 6న కలెక్టర్‌ హరీశ్‌ మీడియా సమావేశంలో వెల్లడించారు. కానీ బుధవారం 85.19 ఎకరాల భూమిని రీఅసైన్డ్‌ చేశారు. దీంతో మిగిలిన 14.86 ఎకరాల భూమి విషయమై గందరగోళంగా మారింది. ఏడు నెలల తరువాత మళ్లీ ఈటల భూ వివాదం తెరపైకి వచ్చింది. ఇంతకాలం సైలెంట్‌గా ఉన్న ప్రభుత్వ పెద్దలు ఆగమేఘాల మీద జమునా హేచరీస్‌ కబ్జాలో ఉన్న భూములను తిరిగి పాతవారికే పంపిణీ చేయడం చర్చనీయాంశంగా మారింది.  


తహసీల్దార్‌ నేతృత్వంలో రీ సర్వే

హైకోర్టు ఆదేశాల మేరకు మాసాయిపేట తహసీల్దార్‌ మాలతి నేతృత్వంలో రీ సర్వే చేశారు. ముందుగా చేసిన సర్వేలో 70.33 ఎకరాల అసైన్డ్‌ భూమి గుర్తించారు. ప్రాథమిక సర్వే అనంతరం మరికొందరు అసైనీలు తమ భూముల హద్దులను తొలగించడం వల్ల గుర్తించలేకపోతున్నామని తహసీల్దార్‌ మాలతికి ఫిర్యాదు చేసినట్లు ఉన్నతాధికారులు చెబుతున్నారు. కోర్టు ఆదేశాలతో తహసీల్దార్‌ నిర్వహించిన సర్వేలో అచ్చంపేట, హాకీంపేట గ్రామాల్లో జమున హేచరీస్‌ యాజమాన్యం కబ్జాలో మొత్తం 85.19 ఎకరాల అసైన్డ్‌ భూమి ఉన్నట్టు గుర్తించినట్లు ఓ అధికారి ‘ఆంధ్రజ్యోతి’కి వివరించారు. ఈ మేరకు కబ్జాకు గురైన అసైన్డ్‌ భూములను గతంలో పట్టాలు పొందిన 65 మంది లబ్ధిదారులకు రీ అసైన్డ్‌ చేస్తూ ప్రొసీడింగ్‌ కాపీలను అందజేశారు. మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే మదన్‌ రెడ్డి హడావుడిగా కొంతమందికి పట్టాలు పంచి వెళ్లిపోయారు. మిగిలినవారికి రెవెన్యూ అధికారులు పట్టాలు అందజేశారు. 


రిజిస్ర్టేషన్‌ చేసినా కూడా పంచారు!

జమునా హేచరీస్‌ యాజమాన్యం అచ్చంపేటలో కొనుగోలు చేసి రిజిస్ర్టేషన్‌ చేయించుకున్న అసైన్డ్‌, సీలింగ్‌ భూములను కూడా బుధవారం అసైనీలకు రీ అసైన్డ్‌ చేశారు. అయితే ఇందులో నిర్మాణాలు ఉన్నాయి.  వాటిని కూల్చాలని రెవెన్యూ అధికారులు ముందుగా భావించారు. కానీ కోర్టు అనుమతి తీసుకున్న తరువాతే కూల్చాలని ఉన్నతాధికారులు చెప్పడంతో వెనక్కి తగ్గారు. జమునా హేచరీస్‌ నిర్మాణాల్లో పట్టాలు అందుకున్న అసైనీలు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా హేచరీస్‌ సిబ్బంది అడ్డుకున్నారు. అయితే అచ్చంపేటలోని సర్వే నెంబర్‌ 81లోని 5 ఎకరాలు, సర్వే నెంబర్‌ 130లోని 3 ఎకరాల అసైన్డ్‌, సీలింగ్‌ భూములు నిషేధిత జాబితాలో ఉన్నప్పటికీ జమునా హేచరీస్‌ యాజమాన్యం అక్రమంగా రిజిస్ర్టేషన్‌ చేయించుకున్నదని అధికారులు తేల్చారు. తెలంగాణ స్టాంపులు రిజిస్ర్టేషన్‌ చట్టం 1908లోని రూల్‌ 243 ప్రకారం రిజిస్ర్టేషన్లను రద్దు చేయాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. సర్వే నెంబర్‌ 130లోని భూములకు సంబంధించిన  ఆధారాలు దొరికాయని, దీనిపై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్లు ఓ ఉన్నతాధికారి చెప్పారు. వ్యవసాయేతర ప్రయోజనాల కోసం మార్పిడి చట్టం 2006 ప్రకారం  నాలా పొందకుండా అచ్చంపేట గ్రామ శివారులోని సర్వే నెంబర్‌ 78,81,130లో భారీ పౌల్ర్టీషెడ్లు, ప్లాబ్‌ఫారాలు, రోడ్లు, ఇతర నిర్మాణాలు చేపట్టారని వివరించారు. అసైన్డ్‌, సీలింగ్‌ భూముల రిజిస్ర్టేషన్‌ను రద్దు చేయాలని సంబంధిత శాఖ ఉన్నతాధికారులు లేఖ రాసినట్లు ఆ అధికారి తెలిపారు. రిజిస్ర్టేషన్‌ అధికారులు కూడా జమునా హేచరీస్‌ యాజమాన్యం చేసుకున్న అక్రమ రిజిస్ర్టేషన్‌ రద్దు చేసినట్టేనని తెలిపారు. అందుకే హేచరీస్‌ నిర్మాణాలను కూడా అసైనీలకు రీ అసైన్డ్‌ చేసినట్లు ఆ అధికారి వివరించారు. 


అప్పుడేం చేశారు? 

అచ్చంపేటలో జమునా హేచరీస్‌ యాజమాన్యం అసైన్డ్‌, సీలింగ్‌ భూముల్లో భారీ నిర్మాణాలు చేపట్టారు. పౌల్ర్టీ షెడ్లు, ప్లాబ్‌ ఫారాలు, రోడ్లు, ఇతర నిర్మాణాలు చేపట్టారు. అయితే ఇవి నిర్మించిన సమయంలో గ్రామ పంచాయతీ అధికారులు, విద్యుత్‌, నీటి కనెక్షన్లకు ఎలా అనుమతి ఇచ్చారన్నది ప్రశ్నార్థకంగా మారింది. అసైన్డ్‌, సీలింగ్‌ భూముల్లో నిర్మాణాలు జరుగుతున్న విషయం అధికారులందరికీ తెలుసు. కానీ అప్పుడు ఏ అధికారి వాటి జోలికి వెళ్లలేదు. అన్ని రకాల అనుమతులు ఇచ్చిన తరువాత కూడా నిబంధనల పేరిట పూర్తిస్థాయిలో జరిగిన నిర్మాణాలను కూల్చి వేస్తున్న అధికారులు అప్పట్లో జమునా హేచరీస్‌ యాజమాన్యంపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.  


రీ అసైన్డ్‌ చేసిన భూములు ఇలా..

మాసాయిపేట మండలం అచ్చంపేటలో 84.19 ఎకరాలు, హాకీంపేటలో 1 ఎకరం భూమి. మొత్తం 85.19 ఎకరాల అసైన్డ్‌ భూములను 65 మంది లబ్ధిదారులకు రీ అసైన్డ్‌ చేశారు. అచ్చంపేటలో 53 మంది బీసీలు, ఆరుగురు ఎస్సీలు, ముగ్గురు ఎస్టీలకు ప్రొసీడింగ్స్‌ అందజేశారు. హాకీంపేటలోని ఒక ఎకరా అసైన్డ్‌భూమిని ముగ్గురు ఎస్సీలకు రీ అసైన్డ్‌ చేశారు. 


 బై నెంబర్ల తేడాతో ఆందోళనలో రైతులు 

మాసాయిపేట, జూన్‌ 30: మండలంలోని అచ్చంపేటలో ఈటల రాజేందర్‌కు చెందిన జమునా హేచరీస్‌ భూముల పంపిణీకి సంబంధించి లబ్ధిదారుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. గతంలో ఉన్న ప్రభుత్వం జారీ చేసిన పట్టా సర్టిఫికెట్ల బై నెంబర్లకు,  ప్రస్తుతం జారీ చేసిన పట్టా సర్టిఫికెట్ల బైనెంబర్లు తేడాయే ఇందుకు కారణం. వివరాల్లోకి వెళ్తే.. గత ప్రభుత్వం అందజేసిన  పట్టా సర్టిఫికెట్ల బై నెంబర్లు ప్రస్తుత బై నెంబర్లు తేడా ఉండటంతో ఒక చోట ఉండాల్సిన భూమి మరో చోట ఉందని రైతులు ఆందోళనకు గురవుతున్నారు. తమ భూమి రోడ్డు పక్కనే ఉండేదని ప్రస్తుత నెంబర్‌తో దూరంగా ఉందని అచ్చంపేటలో పట్టా పొందిన రైతులు వాపోతున్నారు. వెంటనే రెవెన్యూ అధికారులు వచ్చి తాము గతంలోనే సాగు చేసిన ప్రదేశంలోనే భూమి కేటాయించాలని అచ్చంపేట, హాకీంపేట రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.  

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.