మానవతను హరిస్తున్న అసమానతలు

ABN , First Publish Date - 2022-08-11T09:55:08+05:30 IST

భారత స్వాతంత్ర్య అమృత సంవత్సరాన్ని (75వ ఏడాది) మనం ఎలా పండుగ చేసుకోవాలి? స్వేచ్ఛా భారత 75వ వసంతం ఆగమనాన్ని మహదానందం, మహోత్సాహంతో..

మానవతను హరిస్తున్న అసమానతలు

భారత స్వాతంత్ర్య అమృత సంవత్సరాన్ని (75వ ఏడాది) మనం ఎలా పండుగ చేసుకోవాలి? స్వేచ్ఛా భారత 75వ వసంతం ఆగమనాన్ని మహదానందం, మహోత్సాహంతో ఆహ్వానిస్తూ వేడుకలు చేసుకోవడమా లేక 1947తో సరిపోల్చుతూ ఈ 75వ సంవత్సరాన్ని మదింపు వేస్తూ ఆత్మశోధన చేసుకోవడమా? ఇదే కాలం (1947–2022)లో ఇతర ఆసియా దేశాలు, అభివృద్ధి చెందిన దేశాలతో భారత్‌ను బేరీజు వేయండి. మనం మన సంబురాన్ని సెన్సెక్స్, సంపద సృష్టికి పరిమితం చేయడమా లేక ఆరోగ్యం, విద్య సంబంధిత మానవాభివృద్ధి సూచీలను తులనాత్మకంగా పరిశీలించడమా? మరింత స్పష్టంగా చెప్పాలంటే ఈ అమృత వర్ష సంబురం పరిమాణాత్మకంగా ఉండాలా లేక గుణాత్మకంగా ఉండాలా? మానవ జీవిత సమస్త రంగాల– ఆర్థిక, ఆధ్యాత్మిక, సామాజిక – లో మనం నిర్దేశించుకున్న లక్ష్యాల పరిపూర్తిలో మన నిర్వర్తన గురించి మనం మాట్లాడుకోవద్దూ? పత్రికలో స్థలా భావం కారణంగా నా విశ్లేషణను ఆదాయం, సంపదలో అసమానతలకు పరిమితం చేస్తున్నాను.


స్వాతంత్ర్యానంతరం మనం స్వయంగా రూపొందించుకున్న రాజ్యాంగాన్ని 1950 జనవరి 26న అమలులోకి తెచ్చుకున్నాం. జాతి ఐశ్వర్యం మనకు అంటే సమస్త భారత పౌరులకు సంక్రమించిందని, ఆ కలిమికి మనమే సంపూర్ణ అనుభోగ కర్తలమని భావించాం. రాజ్యాంగ లక్ష్యాలుగా మనకు మనమే వాగ్దానం చేసుకున్న వేమిటి? మన దేశం లౌకిక, సామ్యవాద రాజ్యంగా ఉంటుంది; సౌభ్రాతృత్వం, చట్టబద్ధ పాలన, అస్పృశ్యత నిర్మూలన, సకల పౌరులకు సమాన అవకాశాలు, దేశ సిరిసంపదలలో ప్రతి ఒక్కరికీ భాగస్వామ్యం. సమున్నత లక్ష్యాలు, సందేహం లేదు. వలస పాలన నుంచి విముక్తమయినప్పుడు ఆదాయం, సంపదలో ఉన్న అసమానతలను తగ్గించేందుకు, భవిష్యత్తులో ఆదాయం, సంపద కొద్ది మంది వ్యక్తుల లేదా వర్గాల చేతుల్లోనే కేంద్రీకృతమవడాన్ని నిరోధించేందుకు భారత రాజ్యాంగం హామీ ఇచ్చింది. అధికరణ 38(2) ఇలా ఘోషించింది: ‘వ్యక్తుల మధ్య ఆదాయ అసమానతను తగ్గించుట కొరకు, హోదాలలోని అసమానతలను నిర్మూలించుటకు రాజ్యం ప్రత్యేక కృషి చేయవలెను. అదే విధంగా వేరు వేరు వృత్తులలో ఉన్న వారి మధ్య, వేర్వేరు ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజల మధ్య ఆర్థిక పరిస్థితులలోనూ పని, ఉద్యోగావకాశాలలోనూ ఉన్న అసమానతలను నివారించేందుకు కృషి చేయాలి’. అధికరణ 39(సి) ఇలా నొక్కి చెప్పింది: ‘ఆర్థిక విధాన ఆచరణలో ఉత్పాదక వనరులు ఏ ఒక్కరిలోనూ, లేక కొద్దిమందిలోనూ కేంద్రీకృతం అవ్వకుండా చూచుట, పరిపాలన, ఉత్పాదక వనరుల కేంద్రీకృతం వలన ఉత్పన్నమయ్యే హాని నుంచి సంఘాన్ని రక్షించుట’.


1947లో బ్రిటన్ నుంచి స్వాతంత్ర్యం పొందినప్పుడు మనం ఆశించిందేమిటి? వంద సంవత్సరాలుగా పరాయి పాలకులు తస్కరిస్తున్న దేశ సమస్త సంపద నుంచి ప్రతి ఒక్కరు లబ్ధి పొందేందుకు వీలుగా ఆ సిరి సమస్త భారతీయులకూ అందు బాటులోకి వస్తుందని కదా. మరి నిజంగా జాతి జనుల జీవితాలలో అది నిజంగా సంభవించిందా? బ్రిటిష్ పాలకవర్గాలు మన దేశం నుంచి దోపిడీ చేసిన సమస్త ఆస్తుల విలువ 45 ట్రిలియన్ డాలర్లు లేక రూ.358 కోట్ల కోట్లు! విఖ్యాత ఫ్రెంచ్ ఆర్థికవేత్త థామస్ పికెటీ, లూకాస్ చాన్స్‌లు 2017 జూలైలో సంయుక్తంగా ప్రచురించిన ఒక పరిశోధనా పత్రం (‘ఇండియన్ ఇన్‌కమ్ ఇనిక్వాలిటీ 1922–2014: ఫ్రమ్ బ్రిటిష్ రాజ్ టు బిలియనీర్ రాజ్’?)లో 1922 – 2014 సంవత్సరాల మధ్య భారతీయ శ్రీమంతుల సంపద, ఆదాయాల సమాచారాన్ని వారు విశ్లేషించారు. ఆ 92 సంవత్సరాల కాలంలో ఆదాయాలలో అసమానతలు తీవ్రమయ్యాయని, అవి మరింతగా విషమిస్తున్నాయని వారు నిర్ధారించారు. ఈ కారణంగానే వారు తమ అధ్యయనానికి ‘ఫ్రమ్ బ్రిటిష్ రాజ్ నుంచి బిలియనీర్ రాజ్’గా నామకరణం చేశారు. ఇంతకంటే యుక్తమైన శీర్షికను ఎవరూ ఊహించలేరు.


ఇప్పుడు పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. ‘ఆక్స్‌ఫామ్ ఇండియా నివేదిక–2022’ ప్రకారం దేశంలో మహా సంపన్నులయిన 98మంది కుబేరుల ఆస్తుల విలువ 65,700కోట్ల డాలర్లు. ఇది, దేశ జనాభాలో 40శాతం (55.50 కోట్లు) మంది ప్రజల సమస్త ఆస్తుల విలువతో సమానం. ప్రపంచ కోటీశ్వరులలో అత్యధికులు చైనా, అమెరికా తరువాత భారత్‌లోనే ఉన్నారు. 2021లో భారత్‌లో బిలియనీర్ల సంఖ్య 39 శాతం పెరిగింది. కొవిడ్ మహమ్మారి ప్రారంభ దశలోనే భారత్‌లో 84 శాతం కుటుంబాల ఆదాయం తగ్గిపోయింది. మన రాజ్యాంగం నిర్దేశించిన విధంగా ‘ఉత్పాదక వనరులు ఏ ఒక్కరిలోనూ లేక కొద్ది మందిలోనూ కేంద్రీకృతం కాకుండా నిరోధించాలని’ (అధికరణ 39సి), ‘వ్యక్తుల మధ్య ఆదాయ అసమానతలను తగ్గించాలని’ (అధికరణ 38–2) ప్రపంచంలోని ఏ దేశ రాజ్యాంగమైనా ఆదేశించిందా అన్న విషయం నాకు తెలియదు.


ఆదాయాలు, సంపదలో సమానత్వం ‘ప్రగతిశీల’ పన్ను విధానంతో సాధ్యమవుతుంది. ఈ విధానంలో ఆదాయాలు, సంపద తక్కువగా ఉన్నవారి కంటే అవి ఎక్కువగా ఉన్నవారు అంటే సంపన్నులు ఎక్కువ పన్ను చెల్లిస్తారు. ఆర్థిక అసమానతలను పెంచే ఏ పన్ను విధానమైనా ‘తిరోగామి పన్ను విధానమే’. ఈ విధానంలో పౌరులు అందరూ తమ తమ ఆదాయాలు, పన్ను చెల్లింపు సామర్థ్యాలలో వ్యత్యాసాలకు అతీతంగా ఒకే మాదిరి పన్ను చెల్లిస్తారు. అధిక ఆదాయాలు ఉన్న వారిపై అధిక పన్ను విధించడం, వారసత్వ పన్ను విధించడమనేవి ప్రగతిశీల పన్ను విధానంలో తప్పకుండా ఉండే షరతులు. వస్తు సేవల విక్రయాలకు సంబంధించి సకల ప్రజలపై వారి ఆదాయాలు, చెల్లింపు సామర్థ్యంతో సంబంధంలేకుండా ఏకరీతి పన్ను విధించడమనేది తిరోగామి పన్ను విధానానికి ఒక ప్రామాణిక ఉదాహరణ. అయితే ప్రగతిశీల పన్ను విధానాన్ని మాత్రమే అమలుపరచాలని మన రాజ్యాంగ పీఠిక, దాని అధికరణలు 38, 39 స్పష్టంగా నిర్దేశించాయి. రాజకీయ పార్టీలకు ఆర్థిక వనరులు సమకూరుస్తున్న పెట్టుబడి దారులు ఆ నిర్దేశాలను అమలుపరచకుండా ఉండేలా భారత ప్రభుత్వాన్ని నిరంతరం ప్రభావితం చేస్తున్నారు. ఎంతగా అంటే అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ దేశాల కంటే కూడా ఎక్కువగా తిరోగామి పన్ను విధానాలను అనుసరించేలా చేస్తున్నాయి. వ్యక్తిగత ఆదాయం, కార్పొరేట్ ఆదాయంపై పన్ను రేట్లతో పాటు వారసత్వ పన్ను అనేది అసలు లేకపోవడమనేది మన ప్రభుత్వం ఎంతగా తిరోగామి పన్ను విధానాలను అనుసరిస్తుందో స్పష్టం చేస్తున్నది.


సంపన్న పెట్టుబడిదారీ దేశాలలో కంటే మన దేశంలో పన్ను రేట్లు ఎంత తక్కువగా ఉన్నాయో చూడండి: వ్యక్తిగత ఆదాయంపై పన్ను మన దేశంలో 30 శాతం కాగా సంపన్న దేశాలలో 45నుంచి 64 శాతం మేరకు ఉంది. కార్పొరేట్ ఆదాయంపై మనం వసూలు చేసే పన్ను 22 శాతం కాగా సంపన్న దేశాలలో 19 నుంచి 30 శాతం మేరకు వసూలు చేస్తున్నారు. వారసత్వ ఆస్తులపై పన్ను అనేది మన దేశంలో అసలే లేకపోగా సంపన్న దేశాలలో 15 నుంచి 55 శాతం మేరకు విధిస్తున్నారు. పన్నుల రూపేణా ప్రభుత్వ రాబడి మన దేశ స్థూల దేశీయోత్పత్తిలో 17.87 శాతం కాగా సంపన్న దేశాలలో వాటి జీడీపీలో 24 నుంచి 47 శాతం మేరకు ఉంది.


భారత రాజ్యాంగ నిర్దేశాలను మన ప్రభుత్వాలు ఇంత ఘోరంగా ఉల్లంఘిస్తున్నాయి. ఫలితంగానే దేశ జనాభాలో అత్యధికులు ఇప్పటికీ పేదరికంతో నానా యాతనలు పడు తున్నారు. జీవిత హుందాను కోల్పోతున్నారు. మన దేశంలో ప్రత్యక్ష పన్ను రేట్లను గణనీయంగా తగ్గించారు. పన్ను చెల్లింపు ఎగవేతను, నల్లధనం సృష్టిని నివారించేందుకే ప్రత్యక్ష పన్నులను తగ్గించినట్టు ప్రభుత్వం చెబుతోంది. ఇదెంతవరకు నిజం? తక్కువ పన్నులు, నల్లధనం తగ్గుదల మధ్య పరస్పర సంబంధమున్నట్టు భారత ప్రభుత్వం గానీ, మరేదైనా అంతర్జాతీయ సంస్థ గానీ నిర్వహించిన అధ్యయనాలలో నిర్ధారణ అయిందా? నాకు తెలిసినంతవరకు అటువంటి అధ్యయనమేదీ లేదు.


అవును, ఇప్పుడు కరువుకాటకాలు లేవు. ఆకలి చావులూ లేవు. ఆరోగ్య భద్రతా సదుపాయాలు మెరుగుపడడం, అక్షరాస్యత పెరగడం నిజమే. అత్యాధునిక రహదారులు, నిరంతర విద్యుత్ సరఫరా కూడా నిజమే. అయితే ఆదాయాలలో తీవ్ర అసమానతలను ఇవేవీ తగ్గించలేవు. రాజకీయ అధికారాన్ని కేవలం సంపన్నులు మాత్రమే సదా స్వాయత్తం చేసుకోవడాన్ని నిరోధించలేవు. ఏడున్నర దశాబ్దాలలో స్వతంత్ర భారతదేశం సాధించిన ఈ స్వల్ప పురోగతినే మనం పండుగ చేసుకుంటున్నాం. ఈ దృష్ట్యా మనం ఆదాయాలు, సంపదలో అసమానతలను రూపుమాపేందుకు, ఎన్నికైన ప్రజాప్రతినిధులను తమ స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించుకుంటున్న పెట్టుబడిదారులు, కాంట్రాక్టర్ల ప్రాబల్యాన్ని తొలగించేందుకు మనం చాలా కష్టపడవలసి ఉంది. అకుంఠిత కృషి మాత్రమే వాటిని సాధించగలదు.


ప్రపంచంలోనూ, భారతదేశంలోనూ సంపదపరమైన అసమాన తలకు సంబంధించిన సమగ్ర సమాచారంపై ఆక్స్‌ఫామ్ ఇంటర్నేషనల్ ఏటా నివేదికలు వెలువరిస్తుంది. భారత్‌పై ఆక్స్‌ఫామ్ నివేదిక–2021 ఒక ప్రభావశీల మాటతో ప్రారంభయింది. అది, ప్రపంచవ్యాప్తంగా 50 మంది కుబేరులు తమ సంయుక్త వినతిపత్రంలో చెప్పిన మాట. ‘మా లాంటి సంపన్నులపై మరింత అధిక స్థాయిలో పన్నులు విధించమని మేము మా ప్రభుత్వాలను కోరుతున్నాం. తక్షణమే, గణనీయంగా పన్నులు పెంచాలి. వాటిని శాశ్వతంగా కొనసాగించాలి. పన్నులు పెంచండి. ఇదే సరైన నిర్ణయం. మా సంపదల పరిరక్షణ కంటే మానవాళి శ్రేయస్సే ముఖ్యం’ అని ఆ యాభైమంది కుబేరులు ఘోషించారు. భారత్‌లోని ఒక 100 మంది మహా సంపన్నులు ఇటువంటి మానవతా పూర్ణ వినతిపత్రాన్ని రూపొందించి, తమపై పన్నుల పెంపుదలను ఆహ్వానిస్తూ ప్రధానమంత్రికి నివేదిస్తే మనం హృదయపూర్వకంగా పండుగ చేసుకుందాం. తమ సంపదలోని చెప్పుకోదగిన భాగాన్ని బిల్‌గేట్స్, వారెన్ బఫెట్, అజీమ్ ప్రేమ్‌జీ వలే పేదలకు మరింత మెరుగ్గా విద్యా వైద్య సదుపాయాలు సమకూర్చేందుకై విరాళంగా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని మన దేశంలోని ఒక 1000మంది మహా భాగ్యవంతులు ప్రకటించినప్పుడు మరింత ఆనందంగా, మరింత హృదయపూర్వకంగా పండుగ చేసుకుందాం. అసమానతల తగ్గింపునకు నేను ఎందుకు ఇంతగా ప్రాధాన్యమిస్తున్నాను? ఎందుకంటే రాజ్యాంగం పట్ల అది నా కర్తవ్యం. అసమానతలు మానవతను హతమారుస్తాయి– మౌనంగా, కచ్చితంగా. ఆక్స్‌ఫామ్ నివేదిక–2022 ఈ విషయాన్ని ధ్రువీకరించింది.


కాకి మాధవరావు

ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 

Updated Date - 2022-08-11T09:55:08+05:30 IST