75.27 శాతం

ABN , First Publish Date - 2021-01-24T05:26:22+05:30 IST

ప్రపంచాన్ని గడగడలాడించిన కొవిడ్‌ వైరస్‌ మహమ్మారికి చెక్‌ పెట్టేందుకు నిర్వహించిన తొలివిడత వ్యాక్సినేషన్‌ విజయవంతంగా ముగిసింది.

75.27 శాతం

  • తొలివిడత వికారాబాద్‌ జిల్లాలో వ్యాక్సినేషన్‌
  • ప్రభుత్వ హెల్త్‌ కేర్‌ సిబ్బందికి పూర్తి
  • పాలిచ్చే తల్లులు, బాలింతలు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు టీకాకు దూరం
  • వేసుకోని వారికి మలివిడతలో వ్యాక్సిన్‌ 
  • వ్యాక్సిన్‌ వేసుకోవాల్సిన వారు : 4,020 
  • వేసుకున్న వారు  : 3,026 మంది

ప్రపంచాన్ని గడగడలాడించిన కొవిడ్‌ వైరస్‌ మహమ్మారికి చెక్‌ పెట్టేందుకు నిర్వహించిన తొలివిడత వ్యాక్సినేషన్‌ విజయవంతంగా  ముగిసింది. మొదటి దశలో భాగంగా జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో సూపరింటెండెంట్లు, డాక్టర్లు, పారామెడికల్‌, హెల్త్‌కేర్‌, 108, 104 వాహనాల సిబ్బందికి వ్యాక్సిన్‌ ఇచ్చారు.  సోమవారం నుంచి రెండో విడత వ్యాక్సినేషన్‌ ప్రారంభం కానుంది. 

(ఆంధ్రజ్యోతి, వికారాబాద్‌): వికారాబాద్‌ జిల్లాలో మొదటిరోజు తాండూరు జిల్లా ఆసుపత్రి, వికారాబాద్‌ ఏరియా ఆసుపత్రి, పరిగి సీహెచ్‌సీలో మొత్తం 90 మంది డాక్టర్లు, పారామెడికల్‌, హెల్త్‌కేర్‌ సిబ్బందికి కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ వేయాల్సి ఉండగా, ఆ రోజు నమోదైన అందరికీ వేశారు. గత సోమవారం జిల్లాలో మొత్తం ఆరు కేంద్రాల్లో ఒక్కో కేంద్రంలో 50 మంది వంతున 300 మందికి వ్యాక్సిన్‌ ఇవ్వాల్సి ఉండగా 266 మందికి మాత్రమే ఇవ్వగలిగారు. పాలిచ్చే తల్లులు, గర్భిణులు, అనారోగ్య లక్షణాలతో మిగిలిన 34 మంది వ్యాక్సిన్‌ తీసుకోవడానికి నిరాకరించారు. ఆ తరువాత మంగళ, గురు, శుక్రవారాల్లో జిల్లాలోని అన్ని ప్రభుత్వాసుపత్రులు, పీహెచ్‌సీల్లో వ్యాక్సినేషన్‌ ప్రారంభించారు. జిల్లాలో శుక్రవారం వరకు ప్రభుత్వాసుపత్రుల్లో పనిచేస్తున్న డాక్టర్లు, పారా మెడికల్‌, హెల్త్‌కేర్‌ సిబ్బందిలో 4,020 మందికి కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ చేయాల్సి ఉండగా, వారిలో 3,026 మందికి వ్యాక్సిన్‌ ఇచ్చారు. మిగిలిన 994 మంది వ్యాక్సిన్‌ తీసుకోవడానికి నిరాకరించారు. వ్యాక్సిన్‌ తీసుకున్న వారిలో  కొద్ది మందిలో జ్వరం, తలనొప్పి వంటి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తప్ప తీవ్ర ఇబ్బందులు ఉత్పన్నం కాలేదు. సోమవారం నుంచి రెండో విడత వ్యాక్సినేషన్‌ ప్రారంభం కానుంది. ఈ విడతలో ప్రైవేట్‌ ఆసుపత్రులు, క్లినిక్‌లు, డయాగ్నొస్టిక్‌ సెంటర్లలో పనిచేస్తున్న డాక్టర్లు, హెల్త్‌కేర్‌ సిబ్బందికి వ్యాక్సిన్‌    చేయనున్నారు. 

అనారోగ్య సమస్యలతోనే..

జిల్లాలో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రారంభించిన తొలిరోజు వంద శాతం టీకాలు ఇచ్చారు. అందరి కంటే ముందుగా డాక్టర్లు, హెల్త్‌కేర్‌ సిబ్బంది వ్యాక్సిన్‌ తీసుకుంటే మిగతా వర్గాలవారు ఎలాంటి భయం లేకుండా ముందుకు వస్తారని భావించిన ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టింది. మొదట ప్రభుత్వాసుపత్రుల్లో విధులు నిర్వహించే వారిలో 75.27 శాతం మాత్రమే వ్యాక్సిన్‌ వేసుకున్నారు. నమోదుచేసుకున్నవారిలో 24.73 శాతం మంది వివిధ కారణాలతో వ్యాక్సిన్‌ తీసుకోలేదు. అయితే ఈ పరిస్థితుల్లో వ్యాక్సిన్‌ వేసుకోవడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చేలా మరింత అవగాహన కల్పించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. 

భయం వీడాలి

ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల మేరకు నమోదు చేసుకున్న వారు వ్యాక్సిన్‌ తీసుకోవాలని కొవిడ్‌ జిల్లా నిఘా అధికారి డాక్టర్‌ జి.అరవింద్‌కుమార్‌ అన్నారు. వ్యాక్సిన్‌ తీసుకోవడానికి భయపడాల్సిన అవసరం లేదన్నారు. కొవిడ్‌ మహమ్మారిని తరిమికొట్టే మహాయజ్ఞంలో అన్నివర్గాల ప్రజలు తమవంతు సహకారం అందించాలని ఆయన కోరారు. 

రంగారెడ్డి జిల్లాలో 60శాతం ..

(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌): కరోనా వైర్‌సను అంతమొందించేందుకు రంగారెడ్డి జిల్లాలో ఐదురోజుల పాటు సాగిన కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ సాఫీగా సాగింది. మొదటి రోజు 9 కేంద్రాల్లో 30 మందికి చొప్పున టీకా వేశారు. 87 శాతం వైద్య ఆరోగ్యసిబ్బంది, ఆశా, అంగన్‌వాడీ టీచర్లకు టీకా వేశారు. తొలి రోజు వ్యాక్సినేషన్‌ విజయవంతం కావడంతో రెండోరోజు 14 కేంద్రాల్లో రోజుకు 50 మందికి చొప్పున టీకా వేశారు. మూడోరోజు 48 కేంద్రాల్లో టీకా వేశారు. ఒక్కోకేంద్రంలో వంద మందికి చొప్పున టీకా వేయాలని లక్ష్యంగా పెట్టుకోగా 61 శాతం విజయవంతమైంది. ఇక నాల్గోరోజు 50 శాతం, ఐదోరోజు 34 శాతం మంది టీకా వేసుకున్నారు. ఐదు రోజుల పాటు 6,991 మందికి టీకా వేయాలని లక్ష్యంగా పెట్టుకోగా 4,177 మందికి టీకా వేశారు. 60 శాతం టీకా వేసుకున్నారు. టీకా వేసుకున్న వారికి ఇప్పటి వరకు ఎలాంటి సైడ్‌ఎఫెక్ట్స్‌ రాలేదని అధికారులు పేర్కొన్నారు.

Updated Date - 2021-01-24T05:26:22+05:30 IST