NRI duped: వృద్ధురాలికి భారీ షాక్.. నమ్మకస్తుడని కీలక బాధ్యత అప్పగిస్తే..

ABN , First Publish Date - 2022-08-07T01:30:18+05:30 IST

వృద్ధురాలిని మోసగించి రూ.2.5 కోట్లు దోచుకున్న ఓ వ్యక్తిని బెంగళూరు పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు.

NRI duped: వృద్ధురాలికి భారీ షాక్.. నమ్మకస్తుడని కీలక బాధ్యత అప్పగిస్తే..

బెంగళూరు: వృద్ధురాలిని మోసగించి రూ.2.5 కోట్ల విలువైన ఆస్తిని కాజేసిన ఓ వ్యక్తిని బెంగళూరు పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. విమానంలో పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలు ఇచ్చిన డబ్బుతో నిందితుడు తన పేర ప్లాట్ కొనుగోలు చేశాడని పోలీసులు తెలిపారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. అమెరికాలో(USA) ఉండే తిరుమళాయ్ అనే వృద్ధురాలు కొద్ది నెలల క్రితం అమెరికా నుంచి భారత్‌కు వచ్చారు. భర్త చనిపోవడంతో ఆమె స్వదేశానికి తిరిగొచ్చారు. బెంగళూరులోని హుళిమావు ప్రాంతంలో ఓ సర్వీస్ అపార్ట్‌మెంట్‌లో ఆమె నివాసం ఉంటున్నారు. అదే అపార్ట్‌మెంట్‌లో బీహార్‌కు చెందిన యాదవ్ అనే వ్యక్తి హౌస్ కీపింగ్ సూపర్‌‌వైజర్‌గా పనిచేస్తున్నాడు. అయితే.. తిరుమళాయ్ రోజు వారీ పనులు చేయించుకునేందుకు ఎక్కువగా యాదవ్ మీదే ఆధారపడసాగారు. ఈ క్రమంలో ఆమెకు యాదవ్‌ నమ్మకస్తుడన్న అభిప్రాయం కలిగింది. మరోవైపు.. ఆమె ప్లాట్ కొనుగోలు చేసేందుకు నిర్ణయించారు. మొత్తం రూ.2.5 కోట్లను సిద్ధం చేసుకున్నారు. 


అయితే.. ఆమెకు అమెరికాలో ఆపరేషన్ చేయించుకోవాల్సి ఉండటంతో..ప్లాట్(Plot) కొనుగోలు చేసే బాధ్యతను యాదవ్‌కు అప్పగించారు. రూ.2.5 కోట్లను మూడు చెక్కుల్లో అతడి చేతికి ఇచ్చారు. దీన్నే అవకాశంగా తీసుకున్న యాదవ్.. ఆమె లేని సమయంలో జాగా మొత్తాన్ని తన పేర కొనుగోలు చేశాడు. ఆ తరువాత భారత్‌కు తిరిగొచ్చిన ఆమె..  జరిగిన దారుణం గురించి తెలుసుకుని ఒక్కసారిగా అవాక్కైపోయారు. యాదవ్‌ను నిలదీశారు. కానీ.. యాదవ్ ఆమెపై బెదిరింపులకు దిగాడు. ఆ ప్లాట్ గురించి మర్చిపోవాలంటూ వార్నింగ్ ఇచ్చాడు. చివరికి బాధితురాలు హుళిమావు పోలీసులను ఆశ్రయించారు. ఈలోపే తన స్వస్థలానికి పారిపోయిన యాదవ్.. అక్కడే కొన్నేళ్ల పాటు కాలం గడుపుదామని ప్లాన్ చేసుకున్నాడు. కానీ పోలీసులు యాదవ్‌ను తమ ముందు హాజరు కావాలంటూ ఆదేశించారు. దీంతో.. తాను ప్రమాదంలో పడ్డానని గుర్తించిన యాదవ్.. విమానంలో టూర్‌పై వేళ్లేందుకు సిద్ధమయ్యాడు. కానీ పోలీసులు నిందితుడిని ఎయిర్‌పోర్టులోనే అరెస్ట్ చేశారు.

Updated Date - 2022-08-07T01:30:18+05:30 IST