3 జిల్లాల్లో 777 మందికి కరోనా పాజిటివ్‌

May 9 2021 @ 00:21AM

సిద్దిపేట, మే 8: సిద్దిపేట జిల్లాలో శనివారం 2 వేల మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 483 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. జిల్లావ్యాప్తంగా ఒకేరోజు 14 మంది కరోనాతో మృతిచెందారు. జిల్లాలో వివిధ ఆస్పత్రులు, పీహెచ్‌సీల పరిధిలో చేస్తున్న కరోనా టెస్టుల వివరాలు, నమోదవుతున్న కేసులు, మృతుల వివరాలను జిల్లా వైద్యాధికారులు అధికారికంగా వివరాలు వెల్లడించడం లేదు.


మెదక్‌ జిల్లాలో 12 వేలు దాటిన కేసులు

మెదక్‌ అర్బన్‌, మే 8: మెదక్‌ జిల్లాలో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నది. శనివారం గుర్తించినవాటితో కలిసి జిల్లాలో ఇప్పటి వరకు మొత్తం 12,155 కేసులు నమోదయ్యాయి. జిల్లావ్యాప్తంగా శనివారం 685 మందికి ర్యాపిడ్‌ పరీక్షలు నిర్వహించగా 173 మందికి వైరస్‌ సోకినట్టు తేలింది. అత్యధికంగా మెదక్‌లో 32, తూప్రాన్‌లో 25 కేసులు నమోదయ్యాయి. జిల్లా కేంద్ర ఆస్పత్రిలో ముగ్గురు గర్భిణులకు కరోనా నిర్ధారణ అయ్యింది. 


సంగారెడ్డి జిల్లాలో 121 మందికి కరోనా

సంగారెడ్డి అర్బన్‌, మే 8: జిల్లాలో కొత్తగా 121 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్‌ ప్రకారం శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి శనివారం ఉదయం 8 గంటల వరకు 121 మందికి కరోనా సోకింది. అత్యధికంగా పటాన్‌చెరులో 25, జోగిపేటలో 20 కేసులు నమోదయ్యాయి. పాజిటివ్‌ వచ్చినవారంతా హోంఐసోలేషన్‌లోనే ఉన్నారు. జిల్లాలో మొత్తం 1,342 మందికి ర్యాపిడ్‌ టెస్టులు చేశారు. ఆర్టీపీసీఆర్‌ పరీక్షల నిమిత్తం సంగారెడ్డి జిల్లా ఆస్పత్రి నుంచి 126, పటాన్‌చెరు ఆస్పత్రి నుంచి 118 శాంపిళ్లు సేకరించి గాంధీ ఆస్పత్రికి పంపినట్టు వైద్యాధికారులు తెలిపారు.  


ఒకేరోజు 23 మంది మృతి

సిద్దిపేట, మే 8: సిద్దిపేట జిల్లాలో శనివారం 14 మంది మృతిచెందారు. సిద్దిపేట జీజీహెచ్‌లో ఏడుగురు, అరబ్‌గల్లీలో ఒకరు, ఎన్‌జీవో కాలనీలో ఒకరు, శివాజీనగర్‌లో ఒకరు, రాయపోల్‌ మండలం వడ్డెపల్లిలో ఇద్దరు, దొడ్లపల్లిలో ఒకరు, మద్దూరు మండలంలోని గాగిళ్లాపూర్‌లో ఒకరు కరోనాతో మృతి చెందారు.


మెదక్‌ జిల్లాలో ఎనిమిది మంది..

మెదక్‌ అర్బన్‌/పాపన్నపేట, మే 8: మెదక్‌ జిల్లాలో కరోనాతో మరో ఎనిమిదిమంది మృత్యువాతపడ్డారు. కౌడిపల్లి మండలంలో ఓ మాజీ సర్పంచ్‌(58) కరోనాతో సంగారెడ్డిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. నిజాంపేట మండలంలో ఒకరు, తూప్రాన్‌లో ఒకరు కరోనాతో మృతిచెందారు. పాపన్నపేట మండలంలో ఒకేరోజు ముగ్గురు మృత్యువాతపడ్డారు. పాపన్నపేటలో వృద్ధురాలు (65), వృద్ధుడు (60), కొత్తపల్లిలో వృద్ధుడు (70)  మృతిచెందారు. పాపన్నపేట మండలంలో ఇప్పటివరకు కరోనాతో 20 మంది మృతిచెందారు. 


మొన్న అన్న.. నేడు తమ్ముడు..

అల్లాదుర్గం, మే 8: కరోనా మహమ్మారి ఐదు రోజుల వ్యవధిలో అన్నదమ్ములను బలితీసుకుంది. మెదక్‌ జిల్లా అల్లాదుర్గం మండలం గడిపెద్దాపూర్‌కు చెందిన ఆర్‌ఎంపీ వైద్యుడు (45) కరోనా సోకడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ నెల 4న మృతిచెందారు. ఈ విషాదం నుంచి కుటుంబం కోలుకోకముందే శనివారం ఆయన తమ్ముడు (36) కరోనాతో మృతిచెందారు. ఆయనకూడా ఆర్‌ఎంపీగా సేవలందిస్తున్నారు.


కొవిడ్‌తో వృద్ధురాలి మృతి.. మన్సిపల్‌ సిబ్బందిచే అంత్యక్రియలు 

జోగిపేట (వట్‌పల్లి), మే 8: కొవిడ్‌తో మృద్ధురాలు మృతిచెందగా ఇరుగుపొరుగవారు దగ్గరికి రాకపోవడంతో అంత్యక్రియలు చేయలేక ఆమె భర్త రోధిస్తుండగా మున్సిపల్‌ సిబ్బంది అంతాతామై అంత్యక్రియలు నిర్వహించారు. జోగిపేట పట్టణంలోని 15వ వార్డులో వృద్ధ దంపతులు ఒంటరిగా నివాసముంటున్నారు. వృద్ధురాలు కొవిడ్‌తో శనివారం ఉదయం మృతిచెందారు. అంత్యక్రియలు చేయలేక భర్త మృతదేహం వద్దనే ఏడుస్తూ కూర్చున్నారు. విషయం తెలుసుకున్న మున్సిపల్‌ మున్సిపల్‌ పారిశుధ్య సిబ్బంది పీపీఈ కిట్లు ధరించి అంత్యక్రియలు జరిపించారు.

Follow Us on: