7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సూపర్ డూపర్ గుడ్‌న్యూస్!

ABN , First Publish Date - 2022-09-14T01:02:58+05:30 IST

దసరా పండుగ ముందు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇది నిజంగా పండుగలాంటి వార్తే. పర్యటనలు/శిక్షణ/ బదిలీ/

7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సూపర్ డూపర్ గుడ్‌న్యూస్!

న్యూఢిల్లీ: దసరా పండుగ ముందు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇది నిజంగా పండుగలాంటి వార్తే. పర్యటనలు/శిక్షణ/ బదిలీ/ రిటైర్మెంట్ వంటి సమయాల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇకపై ఎంచక్కా తేజస్ ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణించొచ్చు. ఈ మేరకు ఆర్థిక మంతిత్వశాఖ పేర్కొంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను ఇకపై తేజస్ రైళ్లలో ప్రయాణానికి అనుమతించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిపింది. తేజస్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ప్రయాణ అర్హత శతాబ్ది రైళ్లకు సమానంగా ఉంటుందని వివరించింది. తేజస్-రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలు సెమీ హైస్పీడ్ రైలు. 


అధికారిక పర్యటనలో తేజస్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ప్రయాణ అనుమతికి సంబంధించిన అంశాన్ని సోమవారం(12న) విడుదల చేసిన ఆఫీస్ మెమొరాండం (O.M)లో పేర్కొంది. 13-07-2017 నాటి డిపార్ట్‌మెంట్ ఓఎం పేరా 2 A (ii)లో పేర్కొన్న రైళ్లతో పాటు టూర్/ట్రైనింగ్/బదిలీ/రిటైర్‌మెంట్‌ సమయంలో అదనంగా తేజస్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ప్రయాణించేందుకు అనుమతించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు అందులో వివరించింది. తేజస్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ప్రయాణ అర్హత 13.07.2017 నాటి డిపార్ట్‌మెంట్ ఓఎం పేరా 2 A (ii)లో పేర్కొన్న విధంగా శతాబ్ది రైళ్లకు సమానంగా ఉంటుందని వివరించింది. 


13 జులై 2017 నాటి మెమో చెబుతున్న దాని ప్రకారం.. ఉద్యోగి ప్రయాణం పే మ్యాట్రిక్స్‌లో అతడి వేతన స్థాయిపై ఆధారపడి ఉంటుంది. ప్రీమియం రైళ్లు/ప్రీమియం తత్కాల్ రైళ్లు/ రాజధాని/శతాబ్ది వంటి సువిధ రైళ్లు/దురంతో రైళ్లలో ప్రయాణించేందుకు ఇది అనుమతిస్తుంది. సోమవారం నాటి నోటీసు ద్వారా కేంద్ర ప్రభుత్వ అధికారులు అధికారికంగా ప్రయాణించగలిగే ప్రీమియం రైళ్ల జాబితాలో తేజస్ రైళ్లను మంత్రిత్వ శాఖ చేర్చినట్టు అధికారి ఒకరు తెలిపారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 148(5) ప్రకారం భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్‌తో సంప్రదించిన తర్వాతే ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. 


ప్రభుత్వ తాజా ఉత్తర్వుల ప్రకారం ఎవరు ఎలా ప్రయాణించవచ్చంటే? 

* పే మ్యాట్రిక్స్‌లో వేతన స్థాయి 12 అంతకంటే ఎక్కువ ఉంటే ప్రీమియం/ప్రీమియం తత్కాల్/సువిధ/శతాబ్ది/రాజధాని రైళ్లలో ఎగ్జిక్యూటివ్/ఏసీ ఫస్ట్ క్లాస్‌లో ప్రయాణించవచ్చు. అయితే ఆ సమయంలో అవి అందుబాటులో ఉండాలి.

* పే మ్యాట్రిక్స్‌లో వేతన స్థాయి 6 నుంచి 112 మధ్య ఉంటే శతాబ్ది రైళ్లలో ఏసీ సెకండ్ క్లాస్/చైర్ కార్‌లో ప్రయాణించవచ్చు. 

* వేతన స్థాయి 5 అంతకంటే ఎక్కువ ఉంటే ఏసీ థర్డ్ క్లాస్/చైర్ కార్‌లో ప్రయాణించవచ్చు. 

* రైళ్లు ద్వారా చేరుకోలేని ప్రదేశాల విషయంలో మరో వెసులుబాటు కూడా ఉంది. ఏసీ టు టైర్, అంతకంటే ఎక్కువ క్లాస్‌లో ప్రయాణించే అర్హత ఉన్నవారు ఏసీ బస్సుల్లో, ఇతరులు డీలక్స్/ఆర్డినరీ బస్సులో ప్రయాణించవచ్చు. 

Updated Date - 2022-09-14T01:02:58+05:30 IST