పథకం ప్రకారమే గొడవ పెట్టి.. చంపేశారు

ABN , First Publish Date - 2022-05-17T06:29:45+05:30 IST

పథకం ప్రకారమే వైసీపీ నాయకుడు వర్రే నాగేంద్ర హత్య జరిగినట్టు ఏలూరు డీఎస్పీ జీవీఎస్‌ పైడేశ్వరరావు తెలిపారు.

పథకం ప్రకారమే గొడవ పెట్టి.. చంపేశారు
హత్య కేసు వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ పైడేశ్వరరావు

వైసీపీ నాయకుడి హత్య కేసులో ఎనిమిది మంది అరెస్టు

కైకలూరు, మే 16: పథకం ప్రకారమే వైసీపీ నాయకుడు వర్రే నాగేంద్ర హత్య జరిగినట్టు ఏలూరు డీఎస్పీ జీవీఎస్‌ పైడేశ్వరరావు తెలిపారు. సోమవారం ఏలూరు జిల్లా కైకలూరు సర్కిల్‌ కార్యాలయంలో ముదినేపల్లి హత్య కేసు వివరాలను వెల్ల డించారు. ముదినేపల్లి మార్కెట్‌ వద్ద నివాసముండే షేక్‌ ఇర్ఫాన్‌ ఆటో డ్రైవర్‌. తన ఆటోను ఇంటి ముందు రోడ్డుపై అడ్డంగా పెట్టాడు. ఈ ప్రాంత ప్రజల రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయని ఈ నెల 13న మృతుడు నాగేంద్ర తల్లితో ఇర్ఫాన్‌కు వివాదం జరిగింది. ఆటో తీసివేయాలని చుట్టుపక్కల ప్రజలతో కలిసి మందలించారు. దీనితో నాగేంద్రతోపాటు ఇతని సోదరుడు వర్రే శివన్నారాయణపై కక్ష పెట్టుకున్నాడు. ఆ సమయంలో పెయ్యేరుకు చెందిన ఇర్ఫాన్‌ బావ మరదులు దుబ్బా శ్రీకాంత్‌, దుబ్బా చంద్రకాంత్‌తోపాటు వారి స్నేహితులు తోకల డేవిడ్‌, గంజి గంగరాజు, బొల్లు సాయి, బొల్లు రవితేజ, వీర్ల రామసాయికృష్ణలను హత్య చేసేందుకు సాయం కోరినట్లు తెలి పారు. అదేరోజు రాత్రి 10 గంటలకు నాగేంద్ర ఇంటి వద్దకు వెళ్లి అతని తల్లి మరియమ్మతో గొడవపడ్డారు. అప్పుడే వచ్చిన నాగేంద్రను, అతని అల్లుడు మహేష్‌ను చంద్రశేఖర్‌, ఇర్ఫాన్‌ కత్తితో పొడిచారు. వీరి అరుపులకు స్థానికులు రావడంతో ఇర్ఫాన్‌తో పాటు మిగిలిన ఏడుగురు ఆటోలో పరారయ్యారు. వీరిరువురిని గుడివాడ, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం విజయవాడ తీసుకువెళ్లారు. చికిత్స పొందుతూ 14వ తేదీ ఉదయం నాగేంద్ర మృతి చెందినట్లు తెలిపారు. నిందితులను అరెస్టు చేసి ఆటో, హత్యకు ఉపయోగించిన ఆయుధాలను సీజ్‌ చేసినట్లు తెలిపారు. వీరిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చినట్లు తెలిపారు.

Updated Date - 2022-05-17T06:29:45+05:30 IST