8 గంటలే..

ABN , First Publish Date - 2022-07-05T04:49:17+05:30 IST

గంటలు ఉచిత విద్యుత్‌ ఇస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతుండగా, వాస్తవంగా ఏడు నుంచి ఎనిమిది గంటలు మాత్రమే సరఫరా అవుతోంది.

8 గంటలే..
అరకొర కరెంటు వల్ల నీరందక ఎండుతున్న పత్తి మొలకలు

వ్యవసాయానికి 24 గంటల కరెంటుకు మంగళం

రెండు నెలలుగా అప్రకటిత కోతలు

జోగుళాంబ గద్వాల జిల్లాలో 25 వేల ఎకరాల్లో ముందస్తు సాగు

నీరందక ఎండుతున్న మొలకలు

కరుణించని వరుణుడు..  

ఆందోళనలో రైతన్న


వ్యవసాయానికి 24 గంటలు ఉచిత విద్యుత్‌ ఇస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతుండగా, వాస్తవంగా ఏడు నుంచి ఎనిమిది గంటలు మాత్రమే సరఫరా అవుతోంది. డిమాండ్‌ కు తగ్గ ఉత్పత్తి లేకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బోర్ల కింద ముందస్తు సాగు చేపట్టిన రైతులు మొలకలు ఎండుతుండటంతో ఆందోళన చెందుతున్నారు. జోగుళాంబ గద్వాల జిల్లాలో ఈ పరిస్థితి నెలకొన్నది.

- అలంపూర్‌ చౌరస్తా 


గద్వాల జిల్లాలో అప్రకటిత విద్యుత్‌ కోతలతో పంటలు ఎండుతున్నాయని రైతులు వాపోతున్నారు. ఈ జిల్లాలో మే మొదటి వారం నుంచి జూన్‌ 15 వరకు సుమారు 25 వేల ఎకరాల్లో బోరుబావుల కింద రైతులు పంటలు సాగు చేశారు. పత్తి, పొద్దుతిరుగుడు, కంది, ఉల్లి, మిరప తదితర పంటలు వేశారు. అయితే విద్యుత్‌ ఉత్పత్తి సరిగా లేకపోవడంతో మే రెండో వారం నుంచే వ్యవసాయానికి ఇచ్చే విద్యుత్‌పై లోపాయికారి కోతలు మొదలు పెట్టారు.


మే రెండో వారం నుంచి పెరిగిన కోతలు

మే రెండో వారానికి ముందు సాయంత్రం ఐదు గంటలకు తీసి రాత్రి 11 గంటలకు వ్యవసాయానికి కరెంటు ఇచ్చేవాళ్లు. దాంతో బావులు ఉన్న రైతులు రాత్రుళ్లు బోర్లలోని నీటిని బావుల్లో నింపుకుని, ఉదయం బావుల్లోని నీరు, బోరు నీరు పొలానికి పారించుకునేవారు. మే రెండో వారం నుంచి అర్ధరాత్రి 12 గంటలకు, ఆ తర్వాత ఒంటి గంటకు, ఆ తర్వాత రెండు గంటలకు ఇవ్వడం మొదలు పెట్టారు. ఇలా పెంచుకుంటూ పోయి ప్రస్తుతం ఉదయం ఆరు తర్వాత కరెంటు ఇచ్చి, సాయంత్రం 3:30 వరకు ఆపేస్తున్నారు. ఈ మధ్యలో మరమ్మతుల కోసం పలుమార్లు ఎల్‌సీలు తీసుకుంటారు. ఈ నేపథ్యంలో ఏడు నుంచి ఎనిమిది గంటలు మాత్రమే త్రీ ఫేస్‌ కరెంటు రావడంతో రోజుకు పది సాళ్లు కూడా తడవడం లేదని రైతులు వాపోతున్నారు.


అతిక్రమించిన వారికి మెమోలు

టీఎస్‌సీపీడీసీఎల్‌ కార్యాలయం నుంచి రాష్ట్రంలో అన్ని పవర్‌ సబ్‌స్టేషన్లకు త్రీఫేస్‌ ఆన్‌ ఆఫ్‌ మెసేజ్‌ వస్తుంది. ఆ ప్రకారమే త్రీఫేస్‌ కరెంటు ఇవ్వాలి. దీనిని అతిక్రమించిన సబ్‌స్టేషన్ల పరిధిలోని అధికారులకు మెమోలు కూడా జారీ చేసినట్లు తెలిసింది.  కరెంటు కోతల వల్ల పంటలకు నీరందడం లేదు. మొలకలు చనిపోతున్నాయని, మొలకెత్తని విత్తనాలను పురుగులు తింటున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విత్తనాలు మొలకెత్తని చోట మళ్లీ విత్తాల్సి రావడంతో ఖర్చు పెరుగుతుందని అంటున్నారు. వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఇస్తున్నామని గొప్పలు చెప్పుకునే పాలకులు ఇలా అప్రకటిత కోతలు విధిస్తే రైతులు ఏం కావాలని పలు రైతు సంఘాలు నాయకులు ప్రశ్నిస్తున్నారు.


నాలుగు సార్లు విత్తనాలు వేశాం 

నాలుగు ఎకరాల్లో పత్తి ముందస్తుగా సాగు చేశాం. మే నెలకు ముందు రాత్రి 11 గంటలకు త్రీఫేస్‌ కరెంటు ఇచ్చి, మరుసటి రోజు సాయంత్రం ఐదు గంటలకు తీసేవారు. మే నుంచి క్రమంగా తగ్గిస్తూ, ప్రస్తుతం ఉదయం నుంచి మధ్యహ్నం మూడు గంటల వరకే ఇస్తున్నారు. టైం చాలక పది సాళ్లు మాత్రమే తడుస్తున్నాయి. ఎకరం పొలం తడవలంటే నాలుగు రోజులు పడుతుంది. 

- ఆర్‌.గణేష్‌, చెన్నిపాడు గ్రామం, మానవపాడు మండలం


మా చేతుల్లో లేదు

త్రీ ఫేస్‌ కరెంటు ఎప్పుడు తీయాలో ఎప్పుడు ఉంచాలో మా చేతుల్లో లేదు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే వ్యవసాయానికి కరెంటు ఇస్తున్నాం. విద్యుత్‌ సరఫరాలో అంతరాయం వల్ల కాస్త ఇబ్బంది ఉన్నమాట వాస్తవమే. త్వరలో సమస్యలన్నీ తీరితే వ్యవసాయానికి పూర్తి స్థాయిలో కరెంటు ఇస్తాం. 

- చిన్న మగ్బుల్‌బాష, ఏడీఏ

Updated Date - 2022-07-05T04:49:17+05:30 IST