మూడేళ్లలో 8 లక్షల కోట్ల అప్పు

ABN , First Publish Date - 2022-05-19T08:56:22+05:30 IST

జగన్‌ ప్రభుత్వం మూడేళ్లలో రూ.8 లక్షల కోట్ల అప్పుల భారం మోపిందని టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలోని కడప జిల్లాలో బుధవారం ఆయన పర్యటించారు.

మూడేళ్లలో 8 లక్షల కోట్ల అప్పు

  • పులివెందుల ఆర్టీసీ బస్టాండ్‌ కట్టలేదు
  • మూడు రాజధానులు కడతారంట!
  • సీమలో ఒక్క పరిశ్రమా రాలేదు
  • చంద్రబాబు ఆగ్రహం


కడప, మే 18 (ఆంధ్రజ్యోతి): జగన్‌ ప్రభుత్వం మూడేళ్లలో రూ.8 లక్షల కోట్ల అప్పుల భారం మోపిందని టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలోని కడప జిల్లాలో  బుధవారం ఆయన పర్యటించారు. కడప చేరుకున్న ఆయనకు  కనీవినీ ఎరుగని రీతిలో టీడీపీ కార్యకర్తలు  ఘనస్వాగతం పలికారు. నగర శివారులో డీఎ్‌సఆర్‌ ఫంక్షన్‌ హాల్లో జరిగిన ఉమ్మడి వైఎస్సార్‌ కడప జిల్లా కార్యకర్తల సమావేశంలో ప్రసంగించారు. కమలాపురంలో బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా రాత్రి ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. నవ్యాంధ్రను విద్య, ఆరోగ్య, మౌలిక వసతుల్లో నంబర్‌ 1గా మార్చాలని విజన్‌-2029కు రూపకల్పన చేశానని, అయితే ఇప్పుడు ఆంధ్ర అప్పుల్లో నంబర్‌వన్‌గా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. పులివెందులలో ఆర్టీసీ బస్టాండ్‌ కట్టలేనివారు మూడు రాజధానులు కడతారంట అని ఎద్దేవా చేశారు. శ్రీలంక ప్రధాని రాజపక్సకు పట్టిన గతి త్వరలో జగన్‌కు పడుతుందని హెచ్చరించారు. బాబాయి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుల తరఫున వాదిస్తున్న నిరంజన్‌రెడ్డిని జగన్‌ రాజ్యసభకు ఎంపిక చేశారని చెప్పారు. 


జగన్‌పై సీబీఐ కేసులు కూడా ఆయనే వాదిస్తున్నారని తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఎంతోమంది నియంతలు గాలిలో కలిసిపోయారని, జగన్‌ లాంటి డిక్టేటర్‌ కూడా కాలగర్భంలో కలిసిపోతారని హెచ్చరించారు.  దేశంలో ఎక్కడా లేని విధంగా పెట్రోల్‌, డీజల్‌, కరెంట్‌ చార్జీలు, ఆస్తి పన్ను, చెత్త పన్ను, రిజిస్ర్టేషన్‌ చార్జీలు, ఆర్టీసీ చార్జీలు, మరుగుదొడ్డి పన్ను ఇలా రకరకాల పన్నులు బాది మన జేబుకు కన్నం వేశారని ధ్వజమెత్తారు. ఈ పోరాటం తన కోసం, పార్టీ కోసం కాదని.. భావి తరాల భవిష్యత్‌ కోసం చేస్తున్నానని చెప్పారు. మూడేళ్ల జగన్‌ పాలనలో ఒక్క రూపాయి అభివృద్ధి జరగలేదన్నారు. ‘రాయలసీమలో ఒక్క పరిశ్రమ రాలేదు. నిరుద్యోగులకు ఉపాధి లేదు. ప్రతి ఏడాది జనవరిలో జాబ్‌లెస్‌ క్యాలెండర్‌ విడుదల చేశారు. పెట్టుబడిదారులు పారిపోతున్నారు. మనం కట్టిన శ్మశానాలు, మరుగుదొడ్లు, అంబులెన్స్‌లకు వైసీపీ రంగులు వేసుకున్నారు.  నవ్యాంధ్రలో నేను ముఖ్యమంత్రి అయ్యేనాటికి 22.5 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ కొరత ఉండేది.


రెండు నెలల్లో లోటు తీర్చాను. ఐదేళ్లు నాణ్యమైన కరెంట్‌ ఇచ్చాను. ఒక్క రూపాయి కూడా చార్జీ పెంచలేదు. జగన్‌ మూడేళ్ల పాలనలో ఏడు సార్లు కరెంట్‌ చార్జీలు పెంచారు’ అని వివరించారు. జగన్‌ పాలన అంతమొందించే జైత్రయాత్ర కడప నుంచే మొదలు కావాలని పిలుపిచ్చారు. హైదరాబాద్‌ నుంచి కడప ఎయిర్‌పోర్టుకు చేరుకున్న చంద్రబాబు ఓపెన్‌ టాప్‌ వెహికల్‌లో బయలుదేరిన ర్యాలీలో దాదాపు 800 కార్లు, ద్విచక్ర వాహనాలు  పాల్గొన్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా చంద్రబాబుకు కార్యకర్తలు స్వాగతం పలికారు.  కడప పర్యటన ముగించుకుని ఉమ్మడి కర్నూలు జిల్లా పర్యటన కోసం చంద్రబాబు బుధవారం రాత్రి కర్నూలు చేరుకున్నారు. 

Updated Date - 2022-05-19T08:56:22+05:30 IST