‘80 వేల ఉద్యోగాల ప్రకటన’ కేసీఆర్‌కే సాధ్యమైంది

ABN , First Publish Date - 2022-03-10T08:41:24+05:30 IST

ఎన్నడూ లేని విధంగా ఒకేసారి 80 వేలకుపైగా ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు భర్తీ చేస్తామని ప్రకటించడం సీఎం కేసీఆర్‌కే సాధ్యమైందని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, జీవన్‌రెడ్డి అన్నారు. బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద వారు మాట్లాడారు.

‘80 వేల ఉద్యోగాల ప్రకటన’ కేసీఆర్‌కే సాధ్యమైంది

ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, జీవన్‌రెడ్డి

హైదరాబాద్‌, మార్చి 9(ఆంధ్రజ్యోతి): ఎన్నడూ లేని విధంగా ఒకేసారి 80 వేలకుపైగా ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు భర్తీ చేస్తామని ప్రకటించడం సీఎం కేసీఆర్‌కే సాధ్యమైందని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, జీవన్‌రెడ్డి అన్నారు. బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద వారు మాట్లాడారు. కేసీఆర్‌ చేసిన  ప్రకటనపై రాష్ట్రంలోని నిరుద్యోగులు అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోందని అన్నారు. మంచి పనిని విమర్శించడం ప్రతిపక్షాల నైజమని, ఎవరెన్ని మోసపూరిత మాటలు చెప్పినా.. రాష్ట్రంలోని యువత నమ్మొద్దని వారు సూచించారు. ప్రభుత్వ ఉద్యోగాల కల్పనపై ప్రతిపక్ష నాయకులకు ఏ మాత్రమూ అవగాహన లేదని గువ్వల బాలరాజు, జీవన్‌రెడ్డి విమర్శించారు. కాగా, నిరుద్యోగులకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీపికబురు చెప్పారని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌ గుప్తా అన్నారు. ఉద్యోగాల కోసం వయో పరిమితిని సడలించారని, దీంతో రాజకీయ నిరుద్యోగులైన కాంగ్రెస్‌, బీజేపీ నాయకులు కూడా ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకోవచ్చని ఎద్దేవా చేశారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం సాధించుకున్న తెలంగాణలో ఆ కలలు ఒక్కొక్కటిగా సాకారం అవుతున్నాయని చెప్పారు.


రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకం: బాల్కసుమన్‌

రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమని, అందుకే ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తోందని ప్రభుత్వ విప్‌ బాల్కసుమన్‌ ఆరోపించారు. ఎల్‌ఐసీ, బీఎ్‌సఎన్‌ఎల్‌, సింగరేణి, తదితర ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేసి.. అందులో పనిచేస్తున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉద్యోగులను రోడ్ల మీద పడేస్తున్నారని ఆయన విమర్శించారు. శాసనసభలో బుధవారం బడ్జెట్‌పై చర్చ సందర్భంగా బాల్కసుమన్‌ మాట్లాడారు. అన్నీ ప్రైవేట్‌పరం చేస్తే రిజర్వేషన్లుండవని చెప్పారు. సింగరేణిని అదానీకి అప్పగించే ప్రయత్నం చేస్తున్నారన్నారు.

Updated Date - 2022-03-10T08:41:24+05:30 IST