Return to Office : 800 మంది ఉద్యోగుల రాజీనామా

ABN , First Publish Date - 2022-05-13T22:37:49+05:30 IST

ముంబై : దాదాపు రెండేళ్లపాటు వర్క్ ఫ్రం హోంకు అలవాటుపడిన టెక్ రంగ ఉద్యోగులు తిరిగి ఆఫీస్ నుంచి పనిచేసేందుకు ( Return to Office) విముఖత వ్యక్తం చేస్తున్నారు.

Return to Office : 800 మంది ఉద్యోగుల రాజీనామా

ముంబై : దాదాపు రెండేళ్లపాటు వర్క్ ఫ్రం హోంకు (Work from Home) అలవాటుపడిన టెక్ ఆధారిత ఉద్యోగులు తిరిగి ఆఫీస్ నుంచి పనిచేసేందుకు ( Return to Office) విముఖత వ్యక్తం చేస్తున్నారు. రాజీనామాలకైనా వెనుకాడడం లేదు. ముంబై కేంద్రంగా పనిచేస్తున్న ఎడ్యుటెక్ కంపెనీ వైట్‌హ్యాట్ జూనియర్‌కు ఈ పరిస్థితి అనుభవమైంది. కంపెనీకి చెందిన 800 మంది ఉద్యోగులు కేవలం 2 నెలల వ్యవధిలోనే స్వచ్ఛంధంగా రాజీనామా చేశారు. వర్క్ ఫ్రం ఆఫీస్ పున:కొనసాగించాలని కంపెనీ కోరడమే ఇందుకు కారణమైంది. మళ్లీ ఆఫీస్ నుంచి పనిచేయాలనుకోవడంలేని ఉద్యోగులు చెబుతున్నారు. 

 

ముంబై, బెంగళూరు, గురుగ్రామ్ వంటి ప్రాంతాల్లోని కంపెనీ యూనిట్ల నుంచి తిరిగి పనిచేయాలని తెలుపుతూ మార్చి 18న ఉద్యోగులకు కంపెనీ ఈ-మెయిల్స్ పంపించింది. ఈ ఆదేశాలను పాటించకపోగా ఉద్యోగులు రాజీనామా లేఖలు పంపారని ఐఎన్‌సీ42 రిపోర్ట్ పేర్కొంది. రాజీనామాల సంఖ్య పెరగొచ్చని అంచనా వేసింది. కాగా సేల్స్ అండ్ సపోర్ట్ ఉద్యోగులను ఏప్రిల్ 18 కల్లా ముంబై ఆఫీస్‌లో రిపోర్టింగ్ చేయాలని కోరామని కంపెనీ వివరించింది. మెడికల్, వ్యక్తిగత అవసరాలకు మినహాయింపులు ఇచ్చాం. రీలొకేషన్ అసిస్టెన్స్‌కు అవకాశం ఇచ్చినా ఉద్యోగుల నుంచి స్పందన లేదని కంపెనీ వివరించింది. తమ టీచర్లు మాత్రం వర్క్ ఫ్రం హోం కొనసాగిస్తారని కంపెనీ వివరణ ఇచ్చింది.


కాగా  కోడింగ్ నేర్పించే వైట్‌హ్యాట్ జూనియర్‌ను ఎడ్యుటెక్ దిగ్గజం బైజుస్ 2021లో కొనుగోలు చేసింది. 300 మిలియన్ డాలర్లకు ఈ ఒప్పందాన్ని కుదుర్చుకుంది.  బైజుస్ కొనుగోలు చేయడానికి ముందు బజాజ్ నిర్వహణలో కంపెనీ బావుండేదని, ఇప్పటి పరిస్థితులు బాగాలేవని ఉద్యోగులు పెదవి విరుస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ ఒరవడి కనిపిస్తోంది. టెక్ దిగ్గజం యాపిల్ కంపెనీకి చెందిన ఉద్యోగి ఒకరు ఇదే కారణంతో రాజీనామా చేశాడు. వర్క్ ఫ్రం ఆఫీస్ పున:ప్రారంభించాలని కోరినందుకు  రూ.8 కోట్ల వార్షిక వేతనం తీసుకునే ఇయాన్ గుడ్‌ఫెలో అనే వ్యక్తి ఈ నెలలోనే రాజీనామా చేశాడు. ఈ విషయంలో గ్లోబల్ టెక్ రంగంలో పెద్ద చర్చనీయాంశమైంది.

Read more