International Kissing Day 2022 : అక్కడ ముద్దు వద్దే వద్దు.. మీరెప్పుడైనా అక్కడికి వెళ్తే జాగ్రత్త సుమా..

ABN , First Publish Date - 2022-07-06T21:58:27+05:30 IST

ప్రేమను వ్యక్తపరచడంలో విస్తృత ఆమోదం పొందిన సాధకం ‘ముద్దు’(Kiss). ఎదుట ఉన్న వ్యక్తి ఎంతటి విలువైనవారో ఒక్క ముద్దుతో తెలియజేయవచ్చు.

International Kissing Day 2022 : అక్కడ ముద్దు వద్దే వద్దు.. మీరెప్పుడైనా అక్కడికి వెళ్తే జాగ్రత్త సుమా..

ఇంటర్నెట్‌ డెస్క్ : ప్రేమను వ్యక్తపరచడంలో విస్తృత ఆమోదం పొందిన రూపమే ‘ముద్దు’(Kiss). ఎదుట ఉన్న వ్యక్తి ఎంతటి విలువైనవారో ఒక్క ముద్దుతో తెలియజేయవచ్చు. ఎన్నో మాటలు చెప్పలేని భావాన్ని ఒక్క కిస్ ద్వారా చెప్పొచ్చు. చుంబనాలను బట్టి వేర్వేరు భావాలు ఉంటాయి. బుగ్గలపై ముద్దు అప్యాయత.. నుదుటిపై ముద్దు గౌరవానికి సూచికలుగా ఉన్నాయి. ముద్దులతో ఆప్యాయతే కాదు.. ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఇంతకీ ముద్దుల గురించి ఇంతలా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే.. నేడు అంతర్జాతీయ ముద్దుల దినోత్సవం(International Kissing Day).


చుంబనాలపై అవగాహన, రోజువారి జీవితంలో వాటి ప్రాముఖ్యతలను తెలియజేసేందుకు ప్రతి ఏడాది జులై 6న ఇంటర్నేషనల్ కిస్సింగ్ డేని నిర్వహిస్తారు. ముద్దుల దినోత్సవం తొలుత యూకేలో ప్రారంభమైంది. ఆ తర్వాత ప్రపంచమంతటా వ్యాపించింది. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న ముద్దులపై ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో ఆంక్షలు ఉన్నాయి. ఆ ప్రాంతాలేవీ.. ఎలాంటి భావనలు ఉన్నాయో ఒక లుక్కేద్దాం..


దుబాయ్(యూఏఈ)..

దుబాయ్‌(Dubai)లో బహిరంగ ప్రదేశాల్లో ముద్దులు చట్టవిరుద్ధం. అక్కడ మనుషులకే కాదు.. పెంపుడు జంతువులకు కూడా ముద్దు పెట్టడానికి వీల్లేదు. కాదూ కూడదని నిబంధనలను అతిక్రమిస్తే ఫలితాన్ని అనుభవించాల్సి ఉంటుంది.


చైనాలో ముద్దు కట్టుబాటు కాదు..

చైనా(China) సంప్రదాయాలు, PDA(పబ్లిక్ డిస్‌ప్లే ఆఫ్ ఎఫెక్షన్) ప్రకారం అక్కడ ముద్దు కట్టుబాటు కాదు. అందుకే చైనీయులు చుంబనాన్ని నిషిద్ధంగా భావిస్తారు. కాబట్టి డ్రాగన్ కంట్రీలో ముద్దు జోలికెళ్లకపోవడం మంచిది.


యూనివర్సిటీ ఆఫ్ జింబాబ్వే..

బహిరంగ ప్రదేశాల్లో ప్రేమను వ్యక్తపరిచే విషయంలో యూనివర్సిటీ ఆఫ్ జింబాబ్వే(Univertity Of Zimbambwe) విద్యార్థులు కఠిన నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. అసభ్యకరంగా ఆలింగనాలు, ముద్దులు, పబ్లిక్ ప్రదేశాల్లో లైంగిక చర్యలకు పాల్పడుతూ పట్టుబడితే యూనివర్సిటీ నుంచి గెంటేస్తారు.


గ్రామీణ వియత్నాం(Rural vietnam)..

వియత్నాం(vietnam) ప్రజల సంస్కృతి విషయంలో ఇటివలి కాలంలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. కానీ బహిరంగ ప్రదేశాల్లో ఆప్యాయత(PDA) విషయంలో వారిలో ఎలాంటి మార్పూ రాలేదు. ప్రధాన నగరాలైన హనోయ్, సిగోన్ మినహా గ్రామీణ వియత్నాం ప్రజలు ముద్దుని నిషిద్ధంగా భావిస్తారు.


కేథలిక్ చర్చిల వద్ద..

కేథలిక్ చర్చి(Cathelic churches)ల్లో ప్రార్థనలకు వెళ్లేవారు ముద్దులకు దూరంగా ఉండాలని కేథలిక్‌లకు వాటికన్ సూచిస్తోంది. వాస్తవానికి కేథలిక్ కుటుంబ సభ్యుల మధ్య షేక్ హ్యాండ్ లేదా ముద్దులు అనేవి సంప్రదాయంగా కొనసాగుతూ వస్తున్న విషయం తెలిసిందే.


భారత్..

భారత్‌(India)లో బహిరంగ ప్రదేశాల్లో అప్యాయత(PDA) విషయంలో కాస్త తగ్గి ఉండడమే బెటర్. ఎందుకంటే ఇండియన్ పీనల్ కోడ్‌(ఐపీసీ)లోని సెక్షన్ 294 ప్రకారం.. ఇతరులకు ఇబ్బంది కలిగించేలా.. 1) బహిరంగ ప్రదేశాల్లో అశ్లీల చర్యలు, లేదా 2) అశ్లీలకర పాటలు, పద ప్రయోగాలు శిక్షార్హం. వివరణ ఇచ్చుకోవడమే కాదు.. 3 నెలల జైలుశిక్ష లేదా జరిమానా పడే అవకాశాలు ఉన్నాయి. అశ్లీలతకు సరైన నిర్వచనమేమీ లేదు. కాబట్టి వివరణ ఆధారంగా శిక్ష ఉంటుంది.


ఇండోనేసియా..

ఇండోనేసియా(Indonesia) బీచుల్లో(Beach) ఆడామగ ముద్దు పెట్టుకోవడాన్ని అక్కడివారు ఆమోదించరు. బీచ్‌లలో చేయిపట్టుకుని నడవడం వరకు ఫర్వాలేదు. కానీ ముద్దు పెట్టుకోవడాన్ని వ్యతిరేకిస్తారు.


థాయ్‌లాండ్(Thailand)..

అందమైన బీచ్‌లు, సెక్స్ టూరిజానికి థాయ్‌లాండ్(Thailand) కేరాఫ్ అడ్రస్. సెక్స్ టూరిజం నడుస్తోంది కదా అని ముద్దుల విషయంలో హద్దుల దాటడానికి వీల్లేదు. బహిరంగ ప్రదేశాల్లో ఆప్యాయతను తెలియజేసే విషయంలో అక్కడ ఆంక్షలు ఉన్నాయి. మెట్రోపాలిటన్ సిటీ బ్యాంకాక్ మినహా మిగతా బహిరంగ ప్రాంతాల్లో ముద్దులు పెట్టడం ఆమోదయోగ్యం కాదు. అయితే చేతులు పట్టుకుని నడవచ్చు...

Updated Date - 2022-07-06T21:58:27+05:30 IST