Canada Gangsters: కలకలం రేపుతున్న భారత సంతతి గ్యాంగ్‌స్టర్లు! వారి సమీపానికి వెళ్లొద్దంటూ కెనడా పోలీసుల హెచ్చరిక!

ABN , First Publish Date - 2022-08-04T23:25:53+05:30 IST

అత్యంత ప్రమాదకరమైన గ్యాంగ్‌స్టర్ల జాబితాను కెనడా పోలీసులు తాజాగా విడుదల చేశారు. మొత్తం 11 మంది కరుడుగట్టిన నేరగాళ్ల జాబితాలో తొమ్మిది మంది భారత మూలాలున్న వారే కావడం గమనార్హం.

Canada Gangsters: కలకలం రేపుతున్న భారత సంతతి గ్యాంగ్‌స్టర్లు! వారి సమీపానికి వెళ్లొద్దంటూ కెనడా పోలీసుల హెచ్చరిక!

ఎన్నారై డెస్క్: అత్యంత ప్రమాదకర గ్యాంగ్‌స్టర్ల(Gangsters) జాబితాను కెనడా(Canada) పోలీసులు తాజాగా విడుదల చేశారు. మొత్తం 11 మంది కరుడుగట్టిన నేరగాళ్ల జాబితాలో తొమ్మిది మంది భారత మూలాలున్న వారే కావడం గమనార్హం. ఈ గ్యాంగ్‌స్టర్ల సమీపంలోకి వెళ్లొద్దంటూ బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్‌ పోలీసులు ప్రజలను హెచ్చరించారు. బ్రిటిష్ కొలంబియా(British columbia) పోలీసు విభాగానికి చెందిన స్పెషల్ ఎన్ఫోర్స్‌మెంట్ శాఖ, వాంకూవర్ పోలీస్ డిపార్ట్‌మెంట్, బీసీ రాయల్ కెనేడియన్ మౌంటెడ్ పోలీసు విభాగాలు సంయుక్తంగా బుధవారం నాడు ఈ జాబితాను విడుదల చేశాయి. స్థానిక గ్యాంగ్స్ మధ్య జరిగిన అనేక గొడవల్లో వీరు పాలుపంచుకున్నారని, అసాధారణ రీతిలో హింసకు పాల్పడగలరని తెలిపాయి. ప్రజాభద్రతకు ఈ పదకొండు మంది వల్ల ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించాయి. వీరి సమీపానికి వెళ్లిన వారు తమ జీవితాల్ని ప్రమాదంలో పడేసుకున్నట్టేనని స్పష్టం చేశాయి. 


పోలీసులు ప్రకటించిన జాబితాలో.. షకీల్ బస్రా(28), అమర్‌ప్రీత్ సామ్రా(28), జగ్దీప్ చీమా(30), రవీందర్ శర్మ(35), బరీందర్ ధలీవాల్(39) ఆండీ సెయింట్ పియరీ(40),  గురుప్రీత్ ధలీవాల్(35), రిచర్డ్ జోసెఫ్ విట్లాక్(40), అమ్రూప్ గిల్(29), సుఖ్‌దీప్ పన్సల్(33), సుమ్దీశ్ గిల్(28) ఉన్నారు. ప్రత్యర్థి గ్యాంగ్‌లు వీరిని టార్గెట్ చేసే అవకాశం ఉందని స్పెషల్ ఎన్ఫోర్స్‌మెంట్ యూనిట్ పోలీసులు తెలిపారు.  ఫలితంగా..ఈ గ్యాంగ్‌స్టర్ల మిత్రులకు, కుటుంబసభ్యులకు, వారి సమీపంలోకి వెళ్లిన వారికి కూడా ప్రాణాపాయం ఉంటుందని హెచ్చరించారు. గత నెలలో గ్యాంగ్‌స్టర్ మణీందర్ ధలీవాల్ విస్లర్‌ ప్రాంతంలో పట్టపగలు దారుణంగా హత్యకు గురైన నేపథ్యంలో పోలీసులు ఈ జాబితాను విడుదల చేశారు. అంతేకాకుండా మణీందర్ సోదరుడు హర్‌ప్రీత్‌.. గతేడాది ప్రత్యర్థి గ్యాంగ్ సభ్యులు జరిపిన కాల్పుల్లో మరణించాడు. ఇక.. ఈ గ్యాంగ్‌వార్‌లకు చెక్ పెట్టేందుకు తాము మూడో కంటికి తెలియకుండా అనేక చర్యలు చేపడుతున్నట్టు వాంకూవర్ పోలీసులు తెలిపారు.





Updated Date - 2022-08-04T23:25:53+05:30 IST