Maharashtra : అప్పుల భారంతో ఒకే కుటుంబానికి చెందిన 9 మంది ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-06-21T01:14:44+05:30 IST

అప్పుల బాధ తాళలేక ఒకే కుటుంబానికి 9 మంది సభ్యులు ఆత్మహత్య చేసుకున్న విషాదకర ఘటన మహారాష్ట్రంలోని సంగ్లీ జిల్లాలో చోటుచేసుకుంది.

Maharashtra : అప్పుల భారంతో ఒకే కుటుంబానికి చెందిన 9 మంది ఆత్మహత్య

సంగ్లీ, మహారాష్ట్ర : అప్పుల బాధ తాళలేక ఒకే కుటుంబానికి 9 మంది సభ్యులు ఆత్మహత్య చేసుకున్న విషాదకర ఘటన మహారాష్ట్రంలోని సంగ్లీ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. సంగ్లీ జిల్లాలోని మైసల్ గ్రామానికి చెందిన ఇద్దరు అన్నదమ్ముళ్లు పొపట్ వన్మోరే(56), డాక్టర్ మాణిక్ వన్మోరే కుటుంబాలు ముందుస్తుగా నిర్ణయించుకుని బలవన్మరణానికి పాల్పడ్డాయి. వీళ్లంతా విషం సేవించి చనిపోయారు. అన్నదమ్ముళ్లు ఇద్దరు, వీరి తల్లి, భార్యలు, నలుగురు పిల్లల మృతదేహాలను వారి ఇళ్లలో సోమవారం గుర్తించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం అన్నదమ్ముళ్లు వేర్వేరు వ్యక్తుల నుంచి పెద్ద మొత్తంలో అప్పులు చేసినట్టు తెలిసింది. దీంతో ముందుస్తు అనుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారని పోలీసులు అనుమానిస్తున్నారు.


పొపట్ వన్మోరే ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తుండుగా మాణిక్ వన్మోరే వెటర్నరీ వైద్యుడిగా పనిచేస్తున్నాడు. మైసల్ గ్రామంలోని అన్నదమ్ముళ్ల ఇళ్ల మధ్య దూరం 1.5 కిలోమీటర్లు ఉంది. రోజూ పాల కోసం తమ ఇంటికి వచ్చేవారెరూ ఇంట్లో నుంచి బయటకు రాకపోవడంతో ఇదే గ్రామానికి చెందిన ఓ బాలిక.. మాణిక్ వన్మోరే ఇంటికి వెళ్లింది. ఇంట్లో పడివున్న మృతదేహాలను చూసి షాక్‌‌కి గురయిన బాలిక విషయాన్ని గ్రామస్థులకు తెలియజేసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. దర్యాప్తును ఆరంభించారు. 


మాణిక్ వన్మోరే ఇంట్లో అతడి, అతడి తల్లి, భార్య, కూతురు, కొడుకుతోపాటు సోదరుడి కొడుకు(పొపట్ వన్మోరే కుమారుడు) మృతదేహాలను గుర్తించారు. పొపట్ వన్మోరే ఇంట్లో అతడి, అతడి భార్య, కూతురు శవాలను కనుగొన్నారు. ఇరువురి ఇళ్లలోనూ సూసైడ్ లేఖలు లభ్యమయ్యాయని, వీటిని విశ్లేషిస్తున్నామని ఇన్స్‌స్పెక్టర్ జనరల్(కోల్హాపూర్ రేంజ్) మనోజ్ కుమార్ లోహియా వెల్లడించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. కుటుంబ సభ్యులు విషం పదార్థం సేవించారు. ఆత్మహత్యలుగా భావిస్తున్నప్పటికీ తీవ్రమైన ఘటన కావడంతో తదుపరి దర్యాప్తు జరుపుతామని పోలీసులు ప్రకటించారు. పూర్తి స్థాయి విచారణలోనే అసలు నిజాలు వెలుగులోకి వస్తాయని ఆవిస్తున్నామన్నారు. మరణానికి కారణం ఏంటనేది పోర్ట్‌మార్టం నివేదిక వచ్చాక తెలుస్తుందన్నారు. కాగా వీరి గ్రామం ముంబై నుంచి 350 కిలోమీటర్ల దూరంలో ఉంది.

Updated Date - 2022-06-21T01:14:44+05:30 IST