9 ఏళ్ల వయస్సు.. 90శాతం సమస్యలు

ABN , First Publish Date - 2021-03-01T04:24:52+05:30 IST

తొమ్మిదేళ్ల వయస్సు ఉన్న సూళ్లూరుపేట మున్సిపాలిటీలో 90శాతం సమస్యలే. ఇక్కడ రోజు గడవాలంటే నీరు కొనుక్కోవాల్సిందే.

9 ఏళ్ల వయస్సు.. 90శాతం సమస్యలు
సూళ్లూరుపేట మున్సిపల్‌ కార్యాలయం

 ఇది సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిస్థితి 

సూళ్లూరుపేట, ఫిబ్రవరి 28 :  తొమ్మిదేళ్ల వయస్సు ఉన్న సూళ్లూరుపేట మున్సిపాలిటీలో 90శాతం సమస్యలే. ఇక్కడ రోజు గడవాలంటే నీరు కొనుక్కోవాల్సిందే. పారుదలలేని మురుగుకాలువల కంపుభరిస్తూ బతకాల్సిందే. ఆక్రమణలతో కుంచించుకుపోయిన  బజారువీధులతోపాటు పట్టణం మొత్తం ట్రాఫిక్‌ ఓ పద్మ వ్యూహామే. ఇక శివారు ప్రజల బతుకు దుర్భరమే. వానోస్తే బురదతొక్కనిదే ఇంటిలోకి వెళ్లలేని పరిస్థితి. ఇలా చెప్పుకుంటూపోతే సమస్యలు చాంతాడంత ఉన్నాయి.

మేజర్‌ పంచాయతీ సూళ్లూరుపేటను 2012లో మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్‌ చేశారు. అనంతరం జరిగిన ఎన్నికల్లో టీడీపీ అప్పటి కాంగ్రెస్‌ కౌన్సిలర్లతో కలసి ఈ మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. తొలి పాలకవర్గం పట్టణాన్ని అభివృద్ధి చేయడంలో విఫలమైంది. కౌన్సిలర్ల గొడవలు, కేకలు బహిష్కరణలతోనే కౌన్సిల్‌ సమావేశాలు ముగిసిపోయాయి. తొలి కౌన్సిల్‌ ఐదేళ్లలో చోటుచేసుకున్న గొడవలు, బెదిరింపులు చూసి భయపడి తొమ్మిది మంది మున్సిపల్‌ కమిషనర్లు బదిలీపై వెళ్లిపోయారు. ఈ మున్సిపాలిటీ అభివృద్ధికి రూ. 190 కోట్లు మంజూరైతే 9.19 కోట్లే ఖర్చుచేయడం తొలి కౌన్సిల్‌ పనితీరుకు నిదర్శనం. ఇలా తొలి మున్సిపాలిటీ పాలకవర్గం వైఫల్యం చెందింది. ప్రస్తుతం రెండో కౌన్సిల్‌ ఏర్పడేందుకు ఎన్నికలు జరుగుతున్నాయి. 


 25 వార్డులు, 34,830 ఓటర్లు

తొలి పాలకవర్గం 23 వార్డులతో ఏర్పడింది. ప్రస్తుతం 25 వార్డులుగా విభజించారు.  మున్సిపాలిటీలో 34,830 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో 17,040 మంది పురుషులు,  17,776 మంది మహిళలు, 14 మంది ఇతరులు ఉన్నారు.  ఈ మున్సిపాల్టీ చైర్మన స్థానాన్ని జనరల్‌కు రిజర్వు చేశారు. 1, 2, 4, 5, 15, 16, 20 వార్డులను జనరల్‌గా కేటాయించారు. ఆయా వార్డుల్లో ఎన్నికయ్యే కౌన్సిలర్లల్లో ఒకరు చైర్మన్‌ కుర్చీని ఎక్కనున్నారు. గతేడాది మార్చి 11 నుంచి 13వ తేదీ వరకు 121 మంది నామినేషన్లు సమర్పించారు. టీడీపీ తరఫున 25 మంది,  వైసీపీ తరఫున 63 మంది,  బీజేపీ నుంచి 16 మంది, కాంగ్రెస్‌ నుంచి ముగ్గురు, బీఎస్‌పీ   ఇద్దరు, జనసేన ముగ్గురు, స్వతంత్రులు  ఎనిమిది మంది నామినేషన్లు  వేశారు. జనసేన అభ్యర్థిగా 10వ వార్డుకు నామినేషన్‌ వేసిన మహిళ మృతి చెందడంతో ఆదివారం ఆ వార్డుకు జనసేన తరఫున మరో మహిళ నామినేషన్‌ వేశారు.

వైసీపీ చైర్మన్‌ అభ్యర్థిగా దబ్బల

వైసీపీ చైర్మన్‌ అభ్యర్థిగా దబ్బల శ్రీమంత్‌రెడ్డిని స్థానిక ఎమ్మెల్యే నిర్ణయించారు. ఆయన 5వ వార్డులో నామినేషన్‌ వేసి ప్రచారం చేసుకుంటున్నారు.  టీడీపీలో ఇప్పటి వరకు చైర్మన్‌ అభ్యర్థిని ఎంపిక చేసుకోకపోవడం విచిత్రం. అలాగే ఆ పార్టీ 5, 6, 10,  12, 14, 15,  22 వార్డుల్లో నామినేషనే దాఖలు చేయలేదు. కేవలం 18 వార్డుల్లోనే పోటీపడనుంది. అయితే నామినేషన్ల ఉపసంహరణ అనంతరం ఎంత మంది బరిలో నిలుస్తారో చూడాల్సి ఉంది. 




Updated Date - 2021-03-01T04:24:52+05:30 IST