90 ఆక్సిజన్‌ బెడ్స్‌ రెండు రోజుల్లో ఏర్పాటు చేయాలి

ABN , First Publish Date - 2021-04-18T04:39:41+05:30 IST

జిల్లాలో మరో 90 ఆక్సిజన్‌ బెడ్స్‌ రెండు రోజుల్లో ఏర్పాటు చేయాలని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లోని జనహితభవన్‌లో ఏర్పాటు చేసిన వైద్య ఆరోగ్యశాఖ, రెవెన్యూ, పోలీసు శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

90 ఆక్సిజన్‌ బెడ్స్‌ రెండు రోజుల్లో ఏర్పాటు చేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి

మద్నూర్‌, దోమకొండ, ఎల్లారెడ్డి, కామారెడ్డిలో 10 చొప్పున
బాన్సువాడలో 50 చొప్పున ఆక్సిజన్‌ బెడ్స్‌ను అందుబాటులోకి తీసుకురావాలి
రెమిడెసివర్‌ మందులు, ఐసోలేషన్‌ కిట్స్‌ కొరత లేకుండా చర్యలు తీసుకుంటాం
‘ఆంధ్రజ్యోతి’ కథనాల్లో వచ్చిన అంశాలపై చర్చించిన మంత్రి.. చర్యలకు ఆదేశం

కామారెడ్డి, ఏప్రిల్‌ 17(ఆంధ్రజ్యోతి): జిల్లాలో మరో 90 ఆక్సిజన్‌ బెడ్స్‌ రెండు రోజుల్లో ఏర్పాటు చేయాలని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లోని జనహితభవన్‌లో ఏర్పాటు చేసిన వైద్య ఆరోగ్యశాఖ, రెవెన్యూ, పోలీసు శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం జిల్లాలో 40 ఆక్సిజన్‌ బెడ్స్‌ అందుబాటు లో ఉన్నాయని, వీటికి అదనంగా మద్నూర్‌, ఎల్లారెడ్డి, దోమకొండ, కామారెడ్డి ఆసుపత్రుల్లో 10 ఆక్సిజన్‌ బెడ్స్‌ చొప్పున, బాన్సువాడ లో 50 చొప్పున మొత్తం 90 ఆక్సిజన్‌ బెడ్స్‌ రెండు రోజుల్లో ఏర్పాటు చేయాలని, అలాగే అదనంగా మెడికల్‌ ఆఫీసర్లు, స్టాఫ్‌ నర్సులు, డాటా ఎంట్రీ ఆపరేటర్లు, సిబ్బందిని వెంటనే తాత్కాలికంగా నియామకం చేసుకోవా లని జిల్లా వైద్యశాఽఖ అధికారిని ఆదేశించారు. ఆక్సిజన్‌ కొరత లేకుండా అన్ని చికిత్స విధానాలకు, మందులకు నిధులు వెంటనే మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు. అయితే జిల్లాలో ఆక్సిజన్‌ బెడ్స్‌ కొరత తీవ్రంగా ఉందని, జిల్లా కేంద్ర ఆసుపత్రిపైనే అధిక లోడ్‌ పడుతు ందని, రెమిడెసివర్‌ మందుల కొరత ఉందని, బాన్సువాడ, ఎల్లారెడ్డితో పాటు పలు సీహెచ్‌సీలలో సెంట్రలైజ్‌ ఆక్సిజన్‌ను ఏర్పాటు చేయాలని ‘ఆంధ్రజ్యోతి’లో వచ్చిన వరుస కథనాలపై మంత్రి స్పందించారు. అందు కు అనుగుణంగా ఆక్సిజన్‌ బెడ్స్‌, రెమిడెసివర్‌ మందుల కొరతపై దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. కరోనా విజృంభిస్తున్న సమ యంలో ప్రజలంతా స్వీయ నియంత్రణ పాటించాలని, తప్పని సరి గా మాస్క్‌లు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, అదే మనకు శ్రీరామరక్ష అని అన్నారు. ఎక్కువ పరీక్షలు నిర్వహించడం, పాజిటివ్‌ వస్తే చికిత్స అలాగే కరోనా బారిన పడకుండా ముందస్తు చర్యలను తీసుకున్నామని, అలాగే పరీక్షలలో రోజుకు 1,500 టార్గెట్‌కు గాను 3 వేలకు పైగా నిర్వహించి 215 శాతాన్ని సాధించడం జరిగిందని, లక్షా 50వేలకు పైగా పరీక్షలు నిర్వహించామని, 4 వేల యాక్టివ్‌ కేసులకు గాను 3,500 పాజిటివ్‌ వచ్చిన వ్యక్తులను హోమ్‌ ఐసోలేషన్‌ చేసి మందులు, చికిత్స అందించడం జరుగుతుందని వారిని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ టీములు గమనిస్తున్నట్లు తెలిపారు. కరోనా నియంత్రణలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమం జిల్లాలో అద్భుతంగా జరుగుతూ రాష్ట్రంలోనే మొదటి స్థానం లో ఉందని, ప్రతీరోజు 30 ఆరోగ్యకేంద్రాల ద్వారా 4 వేల నుంచి 5 వేల వరకు వ్యాక్సినేషన్‌ జరుగుతుందని తెలిపారు. వ్యాక్సినేషన్‌ చేసి సిబ్బంది కొరత లేకుండా తాత్కాలిక పద్ధతిపై సిబ్బందిని నియమిస్తున్న ట్లు తెలిపారు. కరోనా నియంత్రణలో డివిజన్‌, మండల ఎన్‌ఫోర్స్‌మెంట్‌ టీంలు ఇంకా ఎక్కువ జాగ్రత్త చర్యలు చేపట్టాలని, ముఖ్యంగా మహా రాష్ట్ర శివారు గ్రామాల్లో స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టాలని, పరీక్షలు ఎక్కువ నిర్వహించాలని, పాజిటివ్‌ వ్యక్తులు హోమ్‌ ఐసోలేషన్‌ నుంచి బయటకు రాకుండా పరిశీలన చేయాలని, సంతలు, మార్కెట్‌లు, షాపులలో మాస్క్‌ ల ధారణ పట్ల కఠినంగా వ్యవహరించాలని, నిబంధనలను అతిక్రమిస్తే దుకాణాదారులకు జరిమానాలు విధించాలని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ టీములను ఆదేశించారు. అంతకుముందు ఎంపీ బీబీపాటిల్‌ సూచనల మేరకు 104, 108 అంబులెన్స్‌లు అన్ని కూడా వినియోగించాలని, మరమ్మతులు ఉన్నవి రేపటిలోగా పూర్తి చేసుకుని రోడ్లపైకి రావాలన్నారు. వాటికి సంబ ంధించిన సిబ్బంది లేకపోతే తక్షణమే నియమించాలని ఆదేశించినట్లు తెలిపారు. అనంతరం కలెక్టర్‌ శరత్‌ మాట్లాడుతూ కొవిడ్‌ రెండో సారి విజృంభిస్తున్న తరుణంలో అన్ని చర్యలు తీసుకున్నామని, ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌కు, హెల్త్‌ వర్కర్స్‌కు వంద శాతం వ్యాక్సినేషన్‌ చేయించడం జరి గిందని, 45 సంవత్సరాల పైబడిన 2,33,814 మందిలో 1,03,254 మందికి 44 శాతం వ్యాక్సినేషన్‌ వేయడం జరిగిందని తెలిపారు. పీహెచ్‌సీ, సబ్‌ సెంటర్లు, గ్రామ పంచాయతీల ప్రకారం ఏ రోజు ఏ గ్రామం అనేది పక్కా ప్రణాళికతో వ్యాక్సినేషన్‌ చేయడం జరుగుతున్నదని, పరీక్షలు కూడా లక్ష్యాన్ని మించి నిర్వహించడం జరుగుతున్నదని తెలిపారు. ప్రైవేట్‌ ఆసుపత్రులలో 50శాతం బెడ్స్‌ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సరిహద్దులోని 16 గ్రామాల్లో టీంలు చెక్‌పోస్టుల నిర్వహణ ద్వారా పరీక్షలు ఎక్కువగా నిర్వహిస్తున్నట్లు వచ్చిపోయే వారిపై నిఘా పెట్టడం జరిగిందని, ఐసోలేషన్స్‌లో ఉండాలని సూచిస్తూ వారికి అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌, జడ్పీ చైర్‌పర్సన్‌ దఫేదార్‌ శోభ, ఎంపీ బీబీ పాటిల్‌, కలెక్టర్‌ శరత్‌, అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌దోత్రే, ఎమ్మెల్యే హన్మంత్‌షిండే, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ నిట్టు జాహ్నవి, డీఎంహెచ్‌వో చంద్రశేఖర్‌, డీసీహెచ్‌ఎస్‌ అజయ్‌కుమార్‌, ఆర్‌ఎంవో శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-04-18T04:39:41+05:30 IST