తప్పించుకునేందుకు 90 సిమ్‌ కార్డులు

ABN , First Publish Date - 2022-06-26T16:48:15+05:30 IST

రెండేళ్ల బాలుడిని కిడ్నాప్‌ చేసిన నిందితుడు పోలీసులనుంచి తప్పించుకునేందుకు పది రోజుల వ్యవధిలో ఏకంగా

తప్పించుకునేందుకు 90 సిమ్‌ కార్డులు

బాలుడిని కిడ్నాప్‌ చేసి.. 

రెండురాష్ట్రాల్లో తలదాచుకుని 

పట్టుపడతానని చివరికి తల్లికి అప్పగింత

హైదరాబాద్/బంజారాహిల్స్‌: రెండేళ్ల బాలుడిని కిడ్నాప్‌ చేసిన నిందితుడు పోలీసులనుంచి తప్పించుకునేందుకు పది రోజుల వ్యవధిలో ఏకంగా 90 సిమ్‌కార్డులను మార్చాడు. పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేయడంతో ఇక వారి నుంచి తప్పించుకోలేనని భావించి చివరికి బాలుడిని తల్లికి అప్పగించాడు. కిడ్నాప్‌ కేసు నమోదు చేసిన పోలీసులు అతన్ని అరెస్ట్‌ చేశారు.  

యాదగిరిగుట్ట ప్రాంతానికి చెందిన ఓ మహిళ ఈవెంట్‌ నిర్వాహకురాలు. 2017లో ఆమెకు వివాహమైంది. వారికి (4), (2) ఇద్దరు కుమారులున్నారు. ఈ కుటుంబం నగరంలో ఉంటోంది. ఏడాది క్రితం దంపతులు విడిపోవడంతో పిల్లలు ఆమెతోనే ఉంటున్నారు. నాలుగు నెలల క్రితం ఆమెకు శంకర్‌ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ అద్దె ఇంట్లో సహజీవనం చేస్తున్నారు. అయితే, తనను వివాహం చేసుకోవాలని శంకర్‌ వత్తిడి తీసుకురాగా ఆమె నిరాకరించింది.


దీంతో ఈ నెల 15న ఇంటి వద్ద ఆడుకుంటున్న ఆమె రెండో కుమారుడిని శంకర్‌ బలవంతంగా ఆటోలో ఎక్కించుకొని పారిపోయాడు. ఫోన్‌ స్విచ్చాఫ్‌ చేశాడు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు తమిళనాడు పారిపోయినట్టు తెలుసుకున్న పోలీసులు ఓ బృందాన్ని అక్కడకు పంపించారు. అతని సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ ద్వారా పట్టుకునేందుకు ప్రయత్నాలు ఆరంభించారు. ఈ విషయం తెలుసుకున్న శంకర్‌ తాను పట్టుపడటం తప్పనిసరి అని భావించి బాలుడిని నగరానికి తీసుకువచ్చి తల్లికి అప్పగించాడు. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు శంకర్‌ 90 సిమ్‌ కార్డులు వాడినట్టు దర్యాప్తులో తేలింది. కర్ణాటక గుల్బర్గలో నాలుగు రోజులు ఉండి అక్కడి నుంచి తమిళనాడుకు వెళ్లినట్టు నిర్ధారణ అయింది. పోలీసులు నిందితుడిని అరెస్ట్‌ చేసినట్లు తెలిపారు. 

Updated Date - 2022-06-26T16:48:15+05:30 IST