12 ఏళ్ల క్రితం పద్మశ్రీ అవార్డుతో ఘన సన్మానం.. ఇప్పుడు కట్టుబట్టలతో నడిరోడ్డుపై ఇలా.. అసలేం జరిగిందంటే..

ABN , First Publish Date - 2022-04-28T22:54:57+05:30 IST

ఆయన ఒక ఒడిస్సీ కళాకారుడు. ఊహ తెలిసినప్పటి నుంచీ ఆయన ఆ సంప్రదాయ నృత్యాన్నే నమ్ముకుని జీవిస్తున్నాడు. ఈ క్రమంలోనే సరిగ్గా 12ఏళ్ల క్రితం ఆయన ప్రతిభను భారత ప్రభుత్వం గుర్తించిం

12 ఏళ్ల క్రితం పద్మశ్రీ అవార్డుతో ఘన సన్మానం.. ఇప్పుడు కట్టుబట్టలతో నడిరోడ్డుపై ఇలా.. అసలేం జరిగిందంటే..

ఇంటర్నెట్ డెస్క్: ఆయన ఒక ఒడిస్సీ కళాకారుడు. ఊహ తెలిసినప్పటి నుంచీ ఆయన ఆ సంప్రదాయ నృత్యాన్నే నమ్ముకుని జీవిస్తున్నాడు. ఈ క్రమంలోనే సరిగ్గా 12ఏళ్ల క్రితం ఆయన ప్రతిభను భారత ప్రభుత్వం గుర్తించింది. పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయి. ఫలితంగా ఇపుడు ఆయన కట్టుబట్టలతో నడిరోడ్డుపై నిల్చున్నాడు. ఆయన ఇలా రోడ్డన పడటానికి ప్రభుత్వం వైఖరి, అధికారుల అత్యుత్సాహమే కారణం. ఇంతకూ ఆయన ఎవరు? అసలేం జరిగింది అనే పూర్తి వివరాల్లోకి వెళితే..


కళాకారులను ఆదుకోవాలనే ఉద్దేశమో లేక కళారంగాన్ని ప్రోత్సహించాలనో తెలియదు కానీ కొన్నేళ్ల క్రితం భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నెలకు రూ.20వేల కంటే తక్కువ సంపాదన కలిగిన కళాకారులకు అండగా నిలిచింది. కల్చరల్ మినిస్ట్రీ సిఫార్సుతో ప్రత్యేక కోటా కింద ఢిల్లీలోని ఆసియన్ గేమ్స్‌ విలేజ్‌లో ఉన్న ప్రభుత్వ బంగళాలలో నివసించేందుకు దేశ వ్యాప్తంగా 40 మంది కళాకారులకు అవకాశం కల్పించింది. ఇందుకుగాను కనీస మొత్తాన్ని అద్దె రూపంలో చెల్లించాలని సూచించింది. ఈ క్రమంలో ఒడిస్సీ నృత్యకారుడు గురు మయధార్ రౌత్ కూడా ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఆసియన్ గేమ్స్‌ విలేజ్‌లో నివాసం ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన ప్రతిభను 2010లో భారత ప్రభత్వం గుర్తించింది. పద్మ శ్రీ అవార్డుతో ఆయనను సత్కరించింది. 



కాగా.. ప్రభుత్వ ఇళ్లలో నివసిస్తున్న కళాకారులను కనీస మొత్తాన్ని అద్దెగా చెల్లించాలని ప్రభుత్వం తొలుత సూచించినా తర్వాత అంతగా పట్టించుకోలేదు. పైగా మూడేళ్లకోసారి అద్దె కట్టలేని కళాకారుల బకాయిలను మాఫీ చేస్తూ వచ్చింది. 2014వరకూ ఇదే పద్ధతి కొనసాగింది. అయితే 2014లో అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం మాత్రం ఈ పద్ధతిని అనుసరించలేదు. అద్దె కట్టాల్సిందిగా కళాకారులపై ఒత్తిడి తెచ్చింది. అంతేకాకుండా బకాయిలు చెల్లించని కళాకారులను ఇళ్లు ఖాళీ చేయాలని సూచించింది. ఇందుకోసం 2020 డిసెంబర్ 31 తారీఖును గడువుగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో కొందరు లబ్ధిదారులు తమ ఇళ్లను ఖాళీ చేయగా సుమారు మరికొందరు మాత్రం ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ప్రభుత్వ ఆదేశాలపై హైకోర్టు స్టే విధించింది.


తాజాగా ఈ కేసులో హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తూ ఫిబ్రవరి 25న తీర్పు వెల్లడించింది. అంతేకాకుండా ఇళ్లు ఖాళీ చేయడానికి లబ్ధిదారులకు ఏప్రిల్ 25 వరకు సమయం ఇవ్వాలని ప్రభుత్వం సూచించింది. అయితే ఈ తీర్పును వ్యతిరేకిస్తూ 8 మంది లబ్ధిదారులు మరోమారు హైకోర్టులో అప్పీలు చేశారు. ఈ పిటిషన్‌పై బుధవారం విచారణ జరపనున్నట్టు కోర్టు తెలిపింది. అయితే మంగళవారం రోజు కొందరు ప్రభుత్వ అధికారులు అతిగా ప్రవర్తించారు. 90ఏళ్ల వయసులో గురు మయధార్ రౌత్‌ను అధికారులు నడిరోడ్డుపై నిలబెట్టారు. ఇంట్లోని సమాగ్రి అంతటిని రోడ్డున పడేశారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా ప్రభుత్వ వైఖరిని నెటిజన్లు తప్పుబడుతున్నారు. ఇదిలా ఉంటే.. బుధవారం సాయంత్రానికి ఈ కేసులో కోర్టు తుది తీర్పును వెల్లడించింది. ముందు ఇచ్చిన తీర్పును సమర్థస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం లబ్ధిదారులకు మరో అవకాశాన్ని కల్పించింది. ఇళ్లు ఖాళీ చేయడానికి మే 2 తారీఖు వరకు అవకాశం ఇచ్చింది. 




Updated Date - 2022-04-28T22:54:57+05:30 IST