Reena Verma Chibbar: 92 ఏళ్ల వయసులో 75 ఏళ్ల తర్వాత పాకిస్థాన్‌కు .. ఆత్మీయ ఆహ్వానానికి పులకింత!

ABN , First Publish Date - 2022-07-21T22:00:11+05:30 IST

అప్పుడెప్పుడో భారత్-పాకిస్థాన్ రెండు దేశాలుగా విడిపోయినప్పుడు ఆమె ఇండియాకు వచ్చేసింది. అప్పుడామె

Reena Verma Chibbar: 92 ఏళ్ల వయసులో 75 ఏళ్ల తర్వాత పాకిస్థాన్‌కు .. ఆత్మీయ ఆహ్వానానికి పులకింత!

రావల్పిండి: అప్పుడెప్పుడో భారత్-పాకిస్థాన్ రెండు దేశాలుగా విడిపోయినప్పుడు ఆమె ఇండియాకు వచ్చేసింది. అప్పుడామె వయసు పట్టుమని పదిహేనేళ్లు కూడా లేవు. ఇప్పుడామె వయసు 92 సంవత్సరాలు. అంటే ఆమె భారత్‌కు వచ్చి దాదాపు 75 సంవత్సరాలు. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత పుట్టిన గడ్డను చూడాలని తపించిపోయింది. మూడు నెలల విజిటింగ్ వీసాపై పాకిస్థాన్‌లోని రావల్పిండి (Rawalpindi)లో అడుగుపెట్టిన ఆమెకు అపూర్వ స్వాగతం లభించింది. అంతటి ఘన స్వాగతాన్ని ఊహించని ఆమె సంతోషం పట్టలేకపోయింది. ఇంతకీ ఆమె ఎవరో చెప్పనే లేదు కదూ. ఆమె పేరు రీనా వర్మ చిబ్బార్(Reena Verma Chibbar). 


రావల్పిండిలోని డీవీఏ కాలేజీ రోడ్డులో ఉన్న పూర్వీకుల ఇంటికి వచ్చిన రీనా వర్మకు మేళతాళాలతో ఇరుగుపొరుగువారు స్వాగతం పలికారు. డ్యాన్సులతో తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. 92 ఏళ్ల వయసులోనూ పూర్తి ఆరోగ్యంగా ఉన్న రీనా కూడా వారితో కలిసి కాలు కదిపారు. తన పూర్వీకుల ఇంటిలోని ప్రతి గదిని క్షుణ్ణంగా పరిశీలించారు. అప్పటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. బాల్కనీలో నిల్చుని పాట పాడారు. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకుని కన్నీరు పెట్టుకున్నారు.

 

డీవీఏ కాలేజీ సమీపంలోని ప్రేమ్ నివాస్ మహల్లా (Prem Nawas Mahalla)కు చేరుకున్న రీనా వర్మకు ఆ ప్రాంత ప్రజల నుంచి ఆత్మీయ ఆహ్వానం లభించింది. డ్రమ్స్ వాయిస్తూ, డ్యాన్సులు వేస్తూ, పూల రెక్కలు వెదజల్లుతూ స్వాగతం పలికారు. వారి ఆనందానికి ఉబ్బితబ్బిబ్బయిన చిబ్బార్ కూడా తనను తాను నియంత్రించుకోలేక వారితోపాటు కాలు కదిపి వారిని మరింత ఉత్సాహ పరిచారు. ఈ సందర్భంగా చిబ్బార్ మాట్లాడుతూ.. వేరే దేశానికి వచ్చిన భావన తనకు కలగలేదన్నారు. దేశ సరిహద్దులకు ఇరువైపుల ఉన్న ప్రజలు పరస్పర ప్రేమానురాగాలతో మెలుగుతున్నారని, అందులో తాను కూడా ఒకరినని అన్నారు. 


తాను నివసించిన ఇంట్లోని బెడ్ రూములోకి వెళ్లిన రీనా.. గోడలను తేరిపార చూశారు. అప్పటి తన రోజుల గురించి ఇరుగుపొరుగు వారితో చెప్పారు. 75 ఏళ్ల క్రితం రావల్పిండి ఎలా ఉండేదో వారికి చెప్పుకొచ్చారు. బాల్కనీలో కూర్చుని పాటలు హమ్ చేసేదానినని చెబుతూ 75 ఏళ్ల  క్రితం నాటి ఓ పాటను హమ్ చేయడం విశేషం. అది పాడుతూనే ఉద్వేగాన్ని నియంత్రించుకోలేక కన్నీరు పెట్టుకున్నారు.


ఆ ఇంటి జ్ఞాపకాలు తనను ఇంకా స్పృశిస్తూనే ఉన్నాయన్నారు. తన చిన్నప్పుడు ఎవరిదైనా పెళ్లి జరిగితే వీధిలోని చిన్నారులందరం కలిసి పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్లేవారమని గుర్తు చేసుకున్నారు. అప్పుడు  చాలా ఆనందంగా ఉండేదన్నారు. భారత్-పాకిస్థాన్ మధ్య నెలకొన్ని విభేదాలు తొలగిపోయి రెండూ కలిసిమెలసి ఉండాలని తన మనసు కోరుకుంటోందని రీనావర్మ అన్నారు. అప్పుడు తాము పాక్‌ను వదిలిపోతుంటే ప్రతి ఒక్కరు ఎంతో బాధపడ్డారని అన్నారు. 


తన తోటి వారందరూ చనిపోయారని, ఇప్పుడు వారి మనవళ్లు ఆ ఇళ్లలో నివసిస్తున్నారని అన్నారు. అంతా మారిపోయినా ఆ ఇళ్ల గోడలు మాత్రం నేటికీ అలానే ఉన్నాయని అన్నారు. ‘‘నేను ఇక్కడే పుస్తకాలు పెట్టుకునే దానిని’’ అంటూ ఓ ప్రదేశాన్ని చూపిస్తూ గుర్తు చేసుకున్నారు. తాను ఇండియా వెళ్లిపోయినా తన ఇంటిని, ఆ వీధిని ఎప్పుడూ మర్చిపోలేదన్నారు. ఇప్పటికీ ఈ వీధుల్లోని వాసనలు తాను జ్ఞాపకాలను గుర్తుకు తెస్తున్నాయన్నారు. తాను మళ్లీ ఇక్కడికొస్తానని ఊహించలేదన్నారు. మనమందరం ఒకేటనని, మన సంప్రదాయాలు కూడా ఒకటేనని అన్నారు. స్థానిక వ్యక్తి ఒకరు తనను గుర్తుపట్టి వీసాను స్పాన్సర్ చేయడంతో వాఘా సరిహద్దు ద్వారా రావల్పిండి చేరుకోగలిగానని అన్నారు. విభజనకు ముందు ఈ పరిసరాల్లో అందరూ హిందువులే నివసించేవారని అన్నారు. పాకిస్థాన్‌ను తాను ఎంతగానో ప్రేమిస్తున్నానని, మళ్లీమళ్లీ ఇక్కడికి వస్తూనే ఉంటానని రీనా వర్మ పేర్కొన్నారు. 



Updated Date - 2022-07-21T22:00:11+05:30 IST