స్పందనకు 93 అర్జీలు

ABN , First Publish Date - 2022-05-17T06:45:52+05:30 IST

కలెక్టరేట్‌లో సోమవారం కలెక్టర్‌ హరినారాయణన్‌, జేసీ వెంకటేశ్వర్‌, డీఆర్వో రాజశేఖర్‌, ఇతర అధికారులు నిర్వహించిన స్పందన కార్యక్రమానికి 105 మంది బాధితులు నేరుగా హాజరై తమ బాధలను అధికారులకు చెప్పుకున్నారు.

స్పందనకు 93 అర్జీలు
అర్జీలను స్వీకరిస్తున్న కలెక్టర్‌ హరినారాయణన్‌, జేసీ వెంకటేశ్వర్‌

చిత్తూరు, మే 16: కలెక్టరేట్‌లో సోమవారం కలెక్టర్‌ హరినారాయణన్‌, జేసీ వెంకటేశ్వర్‌, డీఆర్వో రాజశేఖర్‌, ఇతర అధికారులు నిర్వహించిన స్పందన కార్యక్రమానికి 105 మంది బాధితులు నేరుగా హాజరై తమ బాధలను అధికారులకు చెప్పుకున్నారు. వారి బాధలను విన్న అధికారులు సత్వర చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అధికారుల దృష్టికి వచ్చిన అర్జీల్లో... రెవెన్యూ శాఖకు 75, డీఆర్‌డీఏకు 2, హౌసింగ్‌కు 4, డీఎంఅండ్‌హెచ్‌వోకు 5, మున్సిపాలిటీలకు 5, ఇతర శాఖలకు సంబంధించి 14 అర్జీలు అందాయి.

సీనియారిటీ ప్రకారం సొంత జిల్లాలకు బదిలీ చేయాలి

చిత్తూరు, మే 16: బయటి జిల్లాల్లో పనిచేస్తున్న 108 ఉద్యోగులను సీనియారిటీ ప్రాతిపదికన వారివారి సొంత జిల్లాలకు బదిలీ చేయాలని ఏపీ 108 సర్వీసెస్‌ కాంట్రాక్టు ఎంప్లాయీస్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు శివకుమార్‌ కోరారు. 108 అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం సోమవారం స్పందన కార్యక్రమంలో సంఘ నేతలతో కలిసి కలెక్టర్‌కు వినతిపత్రాన్ని ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ ప్రజల ప్రాణాలను కాపాడుతున్న తాము తమ కుటుంబాలకు న్యాయం చేయలేకపోతు న్నామని ఆవేదన వ్యక్తం చేశారు. హెల్త్‌ ఇన్సురెన్స్‌ను రూ. లక్ష నుంచి రూ. 10లక్షలకు పెంచాలని కోరుతున్నప్పటికీ ప్రభుత్వం స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ధరలకనుగుణంగా కూలి రేట్లు పెంచాలి

పెరిగిన ధరలకు అనుగుణంగా సివిల్‌ సప్లయిస్‌లో పనిచేసే హమాలీ కార్మికులకు కూలి రేట్లు పెంచాలని ఏఐటీయూసీ  జిల్లా  ప్రధాన కార్యదర్శి మురళి డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన కార్మికులతో కలిసి కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేశారు. అగ్రిమెంట్‌ ముగిసిపోయి ఆరు నెలలు కావస్తున్నా ఇంతవరకు కొత్త కూలి రేట్ల అగ్రిమెంట్‌ చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టలేదని మండిపడ్డారు.

మసీదు స్థలాన్ని ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి

వైఎస్సార్‌ నగర్‌లో మసీదు కోసం గత ప్రభుత్వం కేటాయించిన స్థలాన్ని ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని కో ఆప్షన్‌ మెంబర్‌ ఆను, ముస్లిం నేతలు కోరారు. ఈ మేరకు స్పందనలో కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చారు. 2008లో అప్పటి ప్రభుత్వం వైఎస్సార్‌ నగరంలో మసీదు కోసం ప్లాటు నెంబరు 1230 నుంచి 1237 వరకు 0.12 సెంట్ల భూమిని కేటాయించిందన్నారు. ఈ స్థలాన్ని కొంత మంది ఆక్రమించుకుని కడ గాలు వేశారని తెలిపారు.

ఇంటి స్థలం ఇప్పించండి

అగ్ర కులస్తుల పక్కన ఎస్సీలు ఉండకూడదనే ఉద్దేశంతో తమకు కేటాయించిన స్థలాన్ని ఇవ్వకుండా అడ్డుకుంటు న్నారని పూతలపట్టు మండలం ఎగువ పాలకూరు దళితులు ఆవేదన వ్యక్తం చేశారు. సర్వే నెంబరు 805, 788-2లో 1.25 ఎకరాల ప్రభుత్వ భూమిలో తమకు ఇళ్ల  పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని, అయితే అగ్రకులాల వారికి దగ్గరలో ఉండకూడదనే ఉద్దేశంతో లేనిపోని కారణాలు చెప్పి అడ్డుకుంటున్నారని తెలిపారు. న్యాయం చేయాలని కలెక్టర్‌కు విన్నవించారు.

Updated Date - 2022-05-17T06:45:52+05:30 IST